Telugu Global
International

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు 3 ఏళ్ల జైలు శిక్ష.. ఐదేళ్ల అనర్హత వేటు

సెషన్స్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించి, అరెస్టు వారెంట్ కూడా జారీ చేసింది. దీంతో నిమిషాల వ్యవధిలో పోలీసులు ఇమ్రాన్‌ఖాన్‌ను అరెస్టు చేశారు.

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు 3 ఏళ్ల జైలు శిక్ష.. ఐదేళ్ల అనర్హత వేటు
X

తోషాఖానా అవినీతి కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాక్ తెహ్రిక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ చైర్మన్ ఇమ్రాన్ ఖాన్‌ దోషిగా తేలారు. ఇస్లామాబాద్ జిల్లా సెషన్స్ కోర్టు శనివారం ఆయనను దోషిగా తేల్చి.. మూడేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో పాటు ఐదేళ్ల పాటు ఆయన ఏ రకమైన ఎన్నికల్లో కూడా పోటీ చేయకుండా అనర్హత వేటు వేసింది. అంతే కాకుండా ఇమ్రాన్ ఖాన్‌కు 1 లక్ష పాకిస్తానీ రూపాయల జరిమానా విధించింది. ఇమ్రాన్ ఖాన్ ఒక వేళ ఈ జరిమానా కట్టకపోతే మరో ఆరు నెలల పాటు జైల్లో ఉండాల్సి వస్తుందని కోర్టు హెచ్చరించింది.

ఇమ్రాన్ ఖాన్ ప్రధాని మంత్రిగా పని చేసిన కాలంలో.. విదేశీ పర్యటనల్లో ఆయనకు వచ్చిన బహుమతులను విక్రయించాననే ఆరోపణలు వచ్చాయి. దీనిపై కేసు నమోదైంది. తన హయాంలో 58 ఖరీదైన బహుమతులు అందుకున్నారు. ప్రధాని హోదాలోని వ్యక్తికి బహుమతులు అందితే.. వాటిని తోషాఖానాలో జమ చేయాల్సి ఉంటుంది. ఒక వేళ వాటిని సొంతం చేసుకోవాలని అనుకుంటే.. నిబంధనల ప్రకారం సగం ధర చెల్లించి తీసుకోవాలి.

అయితే ఇమ్రాన్ ఖాన్ రూ.38 లక్షల విలువైన రోలెక్స్ వాచ్‌ను కేవలం రూ.7,54,000 మాత్రమే చెల్లించి తీసుకున్నారు. రూ.15 లక్షల విలువైన మరో రోలెక్స్ గడియారాన్ని.. రూ.2,94,000 మాత్రమే చెల్లించి సొంతం చేసుకున్నారు. ఇలాంటి అనేక కానుకలను తక్కువ ధర చెల్లించి తన ఇంటికి చేర్చుకున్నారు. ఆ తర్వాత ఈ కానుకలను దుబాయ్‌లో అమ్మేసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ చేపట్టి.. నిజమేనని తేలడంతో తాజాగా జైలు శిక్ష విధించారు.

సెషన్స్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించి, అరెస్టు వారెంట్ కూడా జారీ చేసింది. దీంతో నిమిషాల వ్యవధిలో పోలీసులు ఇమ్రాన్‌ఖాన్‌ను అరెస్టు చేశారు. లాహోర్‌లోని ఇమ్రాన్ నివాసం నుంచి అతడిని పోలీసులు అదుపులోకి తీసుకన్నారు. ఇమ్రాన్ ఖాన్‌పై అనర్హత వేటు పడటంతో ఈ ఏడాది జరగబోయే ఎన్నికల్లో కూడా పోటీ చేసేందుకు వీల్లేకుండా పోయింది. ఈ నెల 9న జాతీయ అసెంబ్లీని దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ రద్దు చేయనున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత 90 రోజుల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ఇమ్రాన్‌పై అనర్హత వేటు పడింది.

First Published:  5 Aug 2023 9:20 AM GMT
Next Story