Telugu Global
International

ఐరాస భ‌ద్ర‌తా మండ‌లిలో రష్యాకు వ్యతిరేకంగా భారత్ ఓటు

ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడి తర్వాత మొదటి సారి భారత్ రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేసింది. 15 మంది సభ్యుల ఐరాస భ‌ద్ర‌తా మండ‌లి సమావేశంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లొదిమిర్ జెలెన్స్కీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించడానికి అనుకూలంగా పడ్డ 13 ఓట్లలో భారత్ ఓటు కూడా ఉంది.

ఐరాస భ‌ద్ర‌తా మండ‌లిలో రష్యాకు వ్యతిరేకంగా భారత్ ఓటు
X

ఎట్ట‌కేల‌కు ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడి విష‌యంలో భార‌త్ మొట్ట‌మొదటి సారి నోరు విప్పింది. ఫిబ్రవరిలో రష్యా సైనిక చర్య ప్రారంభమైన తర్వాత ఉక్రెయిన్ విషయంలో రష్యాకు వ్యతిరేకంగా భారత్ తొలిసారి ఓటు వేసింది. ఉక్రెయిన్‌పై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో "విధానపరమైన ఓటింగ్ " సందర్భంగా బుధవారంనాడు భారతదేశం మొదటిసారిగా రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేసింది, 15 మంది సభ్యుల శక్తివంతమైన ఐరాస భ‌ద్ర‌తా మండ‌లి ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లొదిమిర్ జెలెన్స్కీని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో ప్రసంగించడానికి ఆహ్వానించింది.

ఉక్రెయిన్‌పై రష్యా దాడికి పాల్పడినందుకు భారత్ ఏనాడూ విమర్శించలేదు. దౌత్య, చ‌ర్చ‌ల ద్వారా ప‌రిష్కారం క‌నుగొనాల‌ని, ఇందుకు సంబంధించి జ‌రిగే దౌత్య ప‌ర‌మైన ప్ర‌య‌త్నాల‌కు తాము స‌హ‌క‌రిస్తామ‌ని చెప్పుకుంటూ వ‌చ్చింది.

బుధవారంనాడు ఉక్రెయిన్ 31వ స్వాతంత్య్ర‌ వార్షికోత్సవం సందర్భంగా ర‌ష్యా ఉక్రెయిన్ ల మ‌ధ్య సంఘ‌ర్ష‌ణల పై స‌మీక్షించేందుకు ఐరాస భ‌ద్ర‌తా మండ‌లి ఒక సమావేశాన్ని నిర్వహించింది.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సమావేశంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు పాల్గొన‌డానికి సంబంధించిన విధానపరమైన ఓటింగ్ జ‌ర‌గాల‌ని ఐరాస‌లో ర‌ష్యా రాయ‌బారి వాసిలీ ఎ నెబెంజియా కోరారు. త‌ర్వాత జ‌రిగిన ఓటింగ్ లో జెలెన్స్‌కీ పాల్గొనేందుకు అనుకూలంగా 13 ఓట్లు ప‌డ‌గా ర‌ష్యా వ్య‌తిరేకంగా ఓటు వేసింది. చైనా వోటింగ్ కు గైర్హాజ‌రైంది.

కోవిడ్ కాలంలో వ‌ర్చువ‌ల్ స‌మావేశాలు నిర్వ‌హించినా తిరిగి య‌థాస్థితిలో స‌మావేశాలు జ‌రుగుతున్నాయ‌ని ర‌ష్యా పేర్కొంది. ఉక్రెయిన్ అధ్య‌క్షుడి భాగ‌స్వామ్యాన్ని వ్య‌తిరేకించింది. ఈ విష‌యంలో మిగిలిన దేశాల ప‌రిస్థితిని తాను అర్ధం చేసుకోగ‌ల‌న‌ని అన్నారు. స‌భ్యులు మండ‌లి ప్రాధ‌మిక సూత్రాలు, ఆచ‌ర‌ణ‌ల‌ను మ‌ర్చిపోయారంటూ నెబింజియా అసంతృప్తి వ్య‌క్తం చేశారు.

దురాక్ర‌మ‌ణ నేరాల‌కు ర‌ష్యా బాధ్య‌త వ‌హించాలి..:జెలెన్స్కీ

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన జెలెన్స్కీ ఉక్రెయిన్‌పై దురాక్రమణ నేరాలకు రష్యన్ ఫెడరేషన్ బాధ్యత వహించాలని అన్నారు. "మాస్కోను ఇప్పుడు ఆపకపోతే, ఈ రష్యన్ హంతకులందరూ అనివార్యంగా ఇతర దేశాలకు చేరుకుంటారు" అని హెచ్చ‌రించాడు. " ఉక్రెయిన్ భూభాగంలో జ‌రిగే ఈ ప‌రిస్థితులు ప్రపంచ భవిష్యత్తు నిర్ణయిస్తాయి. " అన్నారాయన. "మా స్వాతంత్య్రం మీ భద్రత, అని ఐరాస భ‌ద్ర‌తా మండ‌లి స‌మావేశంలో చెప్పాడు.

జపోరిజ్జియా అణు విద్యుత్ ప్లాంట్‌ను యుద్ధ ప్రాంతంగా మార్చడం ద్వారా రష్యా ప్రపంచాన్ని అణు విపత్తు అంచున నిలిపింద‌ని జెలెన్స్కీ ఆరోపించారు. ప్లాంట్‌లో ఆరు రియాక్టర్లు ఉన్నాయి - చెర్నోబిల్‌లో ఒకటి మాత్రమే పేలింది. అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఎఈఎ) వీలైనంత త్వరగా పరిస్థితిని శాశ్వతంగా నియంత్రించాలని ఆయన అన్నారు. రష్యా తన "అణు బ్లాక్ మెయిల్"ను నిలిపివేయాలని, ప్లాంట్ నుండి పూర్తిగా ఉపసంహరించుకోవాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు అన్నారు.

స్వీయ వినాశనానికి దారితీయవచ్చు: ఆంటోనియో గుటెర్రెస్ ఆందోళ‌న

ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ మాట్లాడుతూ ..జపోరిజ్జియా అణు విద్యుత్ ప్లాంట్ ,చుట్టుపక్కల పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు, వార్నింగ్ బెల్స్ మోగుతున్నాయిని అన్నారు. సమగ్రత, ర‌క్ష‌ణ‌, భద్రతకు హాని కలిగించే ఏ చర్యలు ఆమోదయోగ్యం కాదు.పరిస్థితి మరింత తీవ్రమైతే స్వీయ వినాశనానికి దారితీయవచ్చు. న్యూక్లియ‌ర్ ప్లాంట్ భ‌ద్రతను కాపాడాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. ఈ విష‌యంలో ఐఎఈఎ వీలైనంత త్వరగా త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. అంతర్జాతీయ మానవతా చట్టాల ఉల్లంఘ‌న‌ల‌పై గుటెర్రెస్ ఆందోళన వ్యక్తం చేశారు.

ఐరాస‌లో యుఎస్ రాయబారి లిండా థామస్ గ్రీన్‌ఫీల్డ్,మాట్లాడుతూ " ఉక్రెయిన్‌ను ప్రపంచ పటం నుండి తొలగించాల‌న్న ర‌ష్యా ల‌క్ష్యం స్ప‌ష్టంగా క‌న‌బ‌డుతోంద‌ని అన్నారు.

అయితే, ఉక్రెయిన్ సరిహద్దులను బలవంతంగా మార్చేందుకు రష్యా చేస్తున్న ప్రయత్నాన్ని అంతర్జాతీయ సమాజం ఎప్పటికీ గుర్తించదని ఐరాస భద్రతా మండలిలో ఆమె అన్నారు. జపోరిజ్జియా అణు విద్యుత్ ప్లాంట్‌లో అణుశక్తి భద్రతకు సంబంధించి ఉక్రెయిన్ నిష్కళంకమైన రికార్డును కలిగి ఉందని ఆమె పేర్కొన్నారు. రష్యా ఫెడరేషన్ నిర్లక్ష్యంగా దాడి చేసి, అణు విపత్తును కలిగించే ప్రమాదంతో ఆ సైట్‌ను బలవంతంగా స్వాధీనం చేసుకుందన్నారు. మాస్కో "ఫిల్ట్రేషన్ ఆపరేషన్ " గురించి అమెరికన్ రాయబారి ఆందోళన వ్యక్తం చేశారు.

First Published:  25 Aug 2022 2:25 PM GMT
Next Story