Telugu Global
International

హిజాబ్ వ్యతిరేక నిరసనలతో భగ్గుమంటున్న ఇరాన్...ఐదుగురు మృతి!

ఇరాన్ లో హిజాబ్ కు వ్యతిరేకంగా సాగుతున్న ఆందోళనలపై అక్కడి ప్రభుత్వం ఉక్కుపాద‍ం మోపుతోంది. లాఠీచార్జ్ లు, అరెస్టులతో పాటు కాల్పులకు కూడా తెగించింది. పోలీసు కాల్పుల్లో ఐదుగురు మరణించారు.

హిజాబ్ వ్యతిరేక నిరసనలతో భగ్గుమంటున్న ఇరాన్...ఐదుగురు మృతి!
X

ప్రభుత్వ వ్యతిరేక నిరసనలతో ఇరాన్ అట్టుడుకుతోంది. షరియా చట్టాలకు వ్యతిరేకంగా మహిళలు రోడ్డెక్కగా వారికి మద్దతుగా పురుషులు కూడా ఉద్యమంలోకి వస్తున్నారు.

హిజాబ్ సరిగా ధరించలేదంటూ మహ్సా అమినీ అనే 22 ఏళ్ళ యువతిని పోలీసులు అరెస్టు చేయడం, ఆమె పోలీసు కస్టడీలో మరణించడంతో ఇరాన్ లో మహిళలు ఒక్క సారి భగ్గున మండిపోయారు. తరాలుగా అణిచివేతకు గురవుతున్న మహిళలు పోరుమార్గం పట్టారు.

బహిరంగంగా హిజాబ్ లు కాల్చేయడం, జుత్తు కత్తిరించుకోవడం లాంటి నిరసనలతో వేలాది మహిళలు ప్రభుత్వ నిరంకుశ చట్టాలను ధిక్కరిస్తున్నారు. ముఖ్యంగా మహ్సా అమినీ స్వస్థలమైన కుర్దిష్ ప్రాంతంలో నిరసనలు మిన్నంటుతున్నాయి. అయితే ఒక్క కుర్దిష్ లోనే కాక ఇరాన్ రాజధాని టెహ్రయిన్ తో సహా అనేక పట్టణాల్లో ప్రదర్శన‌లు ఊపందుకున్నాయి. పోలీసు లాఠీచార్జీలు, టియర్ గ్యాస్ లు ఎదుర్కొంటూ ప్రదర్శనకారులు ముందుకు సాగుతున్నారు.

అమినీ స్వస్థలం కుర్దిష్ ప్రాంతంలోని సక్వెజ్ నగరంలో ఆందోళనకారులపై భద్రతా దళాలు కాల్పులు జరపడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. అదే విధంగా డెహ్గోలన్‌లో ఒకరు మరణించగా, దివాందర్రే పట్టణంలో మరో ఇద్దరు మరణించారు.

మహిళలు వీధుల్లోకి వచ్చి హిజాబ్‌లు తీసేసి.. దహనం చేస్తూ.. నినాదాలు చేస్తున్నారు. వీరిని అడ్డుకునే క్రమంలో పోలీసు కాల్పుల్లో ఐదుగురు చనిపోయినట్లు కుర్దుల హక్కుల సంఘాన్ని ఉటంకిస్తూ రాయిటర్స్‌ కథనం ఇచ్చింది. ఒక్క సోమవారం రోజే పోలీసుల దాడుల్లో 75 మంది ఆందోళనకారులు గాయాలపాలైనట్లు పేర్కొంది. దివాందర్రేలో కొందరు.. పోలీసుల మీదకు రాయి విసురుతున్న వీడియోను ట్విటర్‌లో ఉంచింది. ''ఇక్కడ యుద్ధం నడుస్తోంది'' అంటూ ఓ పురుషుడు అరుస్తుండడం ఇందులో వినిపించింది. అమిని మృతికి నిరసన వ్యక్తం చేస్తూ.. ''మహ్సా అమిని'' హ్యాష్‌ట్యాగ్‌తో పర్షియన్‌ భాషలో చేసిన ట్వీట్లు 20 లక్షలు దాటడం గమనార్హం.

పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి నిరసనకారులపై తీవ్రమైన దాడులు చేస్తున్నప్పటికీ అమిని సొంత రీజియన్‌ కుర్దిస్థాన్‌లో ఆందోళనలు మాత్రం మరింత తీవ్రమవుతున్నాయి. కుర్దిస్థాన్‌ రాజధాని సనందజ్‌లో ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు.

ఇతర పట్టణాలకు కూడా నిరసనలు విస్తరిస్తున్నాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో మొదలైన‌ నిరసనలు రష్త్‌, మషాద్‌, ఇస్ఫహాన్‌ నగరాలకూ వ్యాపించాయి. పోలీసు కార్ల అద్దాలు ధ్వంసమైన, ఆందోళనకారులపై వ్యాటర్‌ కేనన్‌లు ప్రయోగించిన దృశ్యాలను ఒక నెటిజన్ ట్విటర్‌ లో పోస్ట్‌ చేశారు. రాళ్లు విసురుతూ ఓ మహిళ.. 'నియంతకు ఇక మరణమే' అంటూ నినాదాలు చేయడం కూడా ఇందులో ఉంది. టెహ్రాన్‌ వర్సిటీ లోనూ ఆందోళనలు జరుగుతున్న వీడియోను కూడా ఒకరు ట్వీట్‌ చేశారు.

అయితే ఇరాన్‌ అధికారిక వార్తా సంస్థ IRNA మాత్రం ఆందోళనలు స్వల్ప స్థాయిలో జరిగాయని అంటోంది. మరణాలు సంభవించినట్లు వస్తున్న కథనాలను ఖండించింది. కొన్ని అరెస్టులు జరగడం మాత్రం నిజమే అని IRNA తెలిపింది.


Next Story