Telugu Global
International

హవాయి నుంచి కెనడా దిశగా కార్చిచ్చు..

ఎల్లోనైఫ్ నగరం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ఉన్న ఏకైక రహదారి కూడా గాలుల ప్రభావంతో మంటల్లో చిక్కుకునే అవకాశం ఉండటంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు.

హవాయి నుంచి కెనడా దిశగా కార్చిచ్చు..
X

అమెరికా హవాయి ద్వీపం కార్చిచ్చుతో పూర్తిగా కాలిబూడిదైంది. ఇప్పుడు ఆ కార్చిచ్చు కెనడాను కలవరపెడుతోంది. చరిత్రలోనే అతిపెద్ద కార్చిచ్చు ఆ దేశాన్ని వణికిస్తోంది. నార్త్‌ వెస్ట్‌ టెర్రిటరీస్‌ రాజధాని ఎల్లోనైఫ్‌ నగరానికి దావానలం సమీపిస్తుండటంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. విమానాశ్రయాల్లో విమానాల కోసం కొంత మంది నిరీక్షిస్తుండగా, మరికొందరు సొంత వాహనాల్లో అక్క‌డి నుంచి బ‌య‌ట‌ప‌డుతున్నారు. ఎల్లోనైఫ్ నగరం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ఉన్న ఏకైక రహదారి కూడా గాలుల ప్రభావంతో మంటల్లో చిక్కుకునే అవకాశం ఉండటంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఊర్లు ఖాళీ చేయించడానికి హడావిడి పడుతున్నారు.

కెనడాలోని నార్త్ వెస్ట్ టెర్రిటరీస్‌ రాజధాని అయిన ఎల్లోనైఫ్ నగరానికి కార్చిచ్చు ఉత్తరాన 16 కిలోమీటర్ల దూరంలో పొంచి ఉంది. 20 వేల జనాభా కలిగిన ఈ నగరానికి దావాగ్ని సమీపిస్తుండటంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లిపోతున్నారు. రహదారులపై కార్లు, ఇతర వాహనాలు బారులు తీరాయి. కొందరు అత్యవసర విమానాల కోసం నిరీక్షిస్తున్నారు. 3 వేల జనాభా కలిగిన హే రివర్ పట్టణంలో కూడా తరలింపు ప్రక్రియ జరుగుతోందని అధికారులు తెలిపారు.

శుక్రవారం 22 విమానాల ద్వారా 1800 మందిని తరలించేందుకు ఏర్పాట్లు చేసిన అధికారులు మొత్తం 5 వేల మందిని విమానాల ద్వారా తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. అయితే ఇదే అదనుగా విమానయాన సంస్థలు టికెట్లల‌ను అధిక ధరకు విక్రయిస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒక్క నార్త్‌ వెస్ట్‌ టెర్రిటరీస్‌లోనే 268 కార్చిచ్చులు ధాటికి 21 వేల చదరవు కిలోమీటర్ల అటవీ భూమి ఇప్పటికే కాలిబూడిదైందని ఆ దేశ అగ్నిమాపకశాఖ తెలిపింది. ఎల్లోనైఫ్‌లో ప్రస్తుత పరిస్థితులపై మేయర్‌ రెబెక్కా ఆల్టీతో మాట్లాడినట్లు కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ట్వీట్ చేశారు. ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని ప్రకటించారు.

First Published:  18 Aug 2023 8:57 AM GMT
Next Story