Telugu Global
International

ట్విట్టర్ అయిపోయింది.. ఎలాన్ మస్క్ ఇప్పుడు మాంచెస్టర్ యునైటెడ్ జట్టును కొంటాడంటా..!

'అవును, నేను మాంచెస్టర్ యునైటెడ్‌ను కూడా కొనుగోలు చేస్తున్నాను.. నీకు ధన్యవాదాలు' అని పేర్కొన్నాడు. ఈ ట్వీట్ సంచలనంగా మారింది.

ట్విట్టర్ అయిపోయింది.. ఎలాన్ మస్క్ ఇప్పుడు మాంచెస్టర్ యునైటెడ్ జట్టును కొంటాడంటా..!
X

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారనే విషయం తెలిసిందే. ఆయన ఎప్పుడు సీరియస్ ట్వీట్లు చేస్తాడో.. ఎప్పుడు వ్యంగ్యంగా మాట్లాడతాడో ఎవరికీ అర్థం కాదు. ఈ క్రమంలో బుధవారం ఆయన చేసిన ట్వీట్ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అమెరికా రాజకీయాల్లో తాను ఎవరికి మద్దతు ఇస్తాననే విషయంపై వ్యంగ్యంగా స్పందిస్తూ.. పలు వరుస ట్వీట్లు చేశాడు.

తాను రాజకీయాల్లో లెఫ్ట్ హాఫ్ రిపబ్లికన్ పార్టీకి, రైట్ హాఫ్ డెమోక్రాట్లకు సపోర్ట్ చేస్తానంటూ చెప్పుకొచ్చారు. అంటే తాను ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వనని, ఇద్దరికీ సమాన దూరంలో ఉంటానని చెప్పుకొని రావడమే ఎలాన్ మస్క్ ఉద్దేశం. ఈ క్రమంలోనే అదే థ్రెడ్‌లో 'అవును, నేను మాంచెస్టర్ యునైటెడ్‌ను కూడా కొనుగోలు చేస్తున్నాను.. నీకు ధన్యవాదాలు' అని పేర్కొన్నాడు. ఈ ట్వీట్ సంచలనంగా మారింది.

ఎలాన్ మస్క్ నిజంగానే మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్‌‌ను కొనేస్తాడా అనే వార్తలు పుట్టుకొచ్చాయి. కానీ, నిజంగా ఆ థ్రెడ్‌ను పరిశీలిస్తే ఎలాన్ మస్క్ మొత్తం సరదాగా చేసిన సంభాషణ లాగే కనిపిస్తోంది. సాధారణంగా అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్ఛేంజ్ కమిషన్ (మన సెబీ లాంటిదే) మీద ఎలాన్ మస్క్ జోకులేస్తుంటాడు. ఇటీవల ట్విట్టర్‌ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేస్తానని మస్క్ ప్రకటించారు. అయితే కొనుగోలు ఒప్పందం మేరకు ఫేక్ అకౌంట్ల వివరాలు చెప్పలేదనే సాకుతో.. కొనుగోలు నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్నట్లు చెప్పాడు.

కాగా, ఈ విషయంపై ట్విట్టర్ బోర్డు ఎలాన్ మస్క్‌కు నోటీసులు పంపించింది. కొనుగోలు ఒప్పందం నుంచి వైదొలిగినందుకు కోర్టును ఆశ్రయించింది. ఈ విషయంలో యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్చేంజ్ కమిషన్ కూడా మస్క్‌ను తప్పుబట్టింది. అందుకే దానిని అప్పుడప్పుడు ట్రోల్ చేస్తుంటాడు. ఇప్పుడు మాంచెస్టర్ యునైటెడ్‌ను కూడా కొనుగోలు చేస్తున్నాను.. ఏం చేసుకుంటారో చేసుకోండి అనే ధోరణిలో ఆ ట్వీట్ చేశాడు. ఆ తర్వాత తాను ఎలాంటి స్పోర్టింగ్ క్లబ్‌ను కొనుగోలు చేయడం లేదని వివరణ ఇచ్చాడు. కాగా మాంచెస్టర్ యునైటెడ్‌కు చెందిన షేర్లు న్యూయార్క్ స్టాక్ ఎక్చేంజీలో నమోదయ్యాయి. ఈ ఏడాది దాని క్లాస్-ఏ షేర్లు 10 శాతం పతనం అయ్యాయి.

అమెరికా బిజినెస్‌మెన్‌ మాల్కమ్ గ్లేజర్‌ వారసులకు చెందిన ఈ ఇంగ్లీష్ ఫుట్‌బాల్ క్లబ్ 144 ఏళ్ల క్రితం నెలకొల్పారు. 20 సార్లు ఇంగ్లాండ్ చాంపియన్లుగా నిలచిన రికార్డు ఈ క్లబ్‌దే. యూరోపియన్ కప్‌ను మూడు సార్లు గెలిచారు. గత ఏడాది ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్‌లో 6వ స్థానంలో నిలిచారు. ప్రస్తుతం ఈ క్లబ్ విలువ 4.6 బిలియన్ డాలర్లుగా నిపుణులు అంచనా వేశారు. రెడ్ డెవిల్స్‌గా పిలిచే ఈ క్లబ్‌లో ప్రస్తుతం స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో ఆడుతున్నాడు.

First Published:  17 Aug 2022 9:13 AM GMT
Next Story