Telugu Global
International

నాకంటే పెద్ద వెధవ దొరికితే రాజీనామా చేస్తా –మస్క్

ట్విట్టర్ అధినేతగా తాను వైదొలగుతానని ప్రకటించారు కానీ అక్కడే చిన్న ట్విస్ట్ ఇచ్చారు మస్క్. తనకంటే పెద్ద వెధవ దొరకాలి అన్నారు.

నాకంటే పెద్ద వెధవ దొరికితే రాజీనామా చేస్తా –మస్క్
X

ట్విట్టర్ కి నేను ఫిట్టా, అన్ ఫిట్టా అంటూ ట్విట్టర్లోనే పోల్ పెట్టి భంగపడ్డారు సీఈఓ ఎలాన్ మస్క్. ట్విట్టర్ అధినేతగా నేను వైదొలగాలా..? అంటూ ఓ పోల్ పెట్టారు. ఫలితాన్ని బట్టి తాను నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. డిసెంబర్ 19న ఈ పోల్ ని తన ట్విట్టర్ హ్యాండిల్ లో పెట్టారు మస్క్. దానికి బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటి వరకూ 1.76కోట్లమంది స్పందించారు. వీరిలో 57.5శాతం మంది మస్క్ మాకొద్దు అంటూ తేల్చి చెప్పేశారు. కేవలం 42.5 శాతం మంది మాత్రమే మస్క్ కొనసాగినా ఫర్వాలేదన్నారు. ఈ పోల్ తో జ్ఞానోదయం అయిందో, లేక ముందుగానే నిర్ణయం తీసేసుకున్నారో తెలియదు కానీ, తాను ట్విట్టర్ సీఈఓ పదవినుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు మస్క్.

నాకంటే పెద్ద వెధవ దొరకాలిగా..!

ట్విట్టర్ అధినేతగా తాను వైదొలగుతానని ప్రకటించారు కానీ అక్కడే చిన్న ట్విస్ట్ ఇచ్చారు మస్క్. నాకంటే పెద్ద వెధవ దొరకాలి అన్నారు. తనకంటే పెద్ద ఫూల్ తన స్థానాన్ని తీసుకోడానికి ముందుకొస్తే కచ్చితంగా తాను వైదొలగుతానన్నారు. ఆ తర్వాత తాను కేవలం సాఫ్ట్ వేర్, సర్వర్స్ టీమ్ తో కలసి పనిచేస్తానని ట్వీట్ చేశారు. ప్రస్తుతం మస్క్ ట్వీట్ వైరల్ గా మారింది.

ఎందుకీ గొడవంతా..?

ట్విట్టర్ ని సొంతం చేసుకున్న తర్వాత ఎలాన్ మస్క్ భారీ మార్పులు చేస్తూ వచ్చారు. బ్లూటిక్ వ్యవహారంతో అంతా గందరగోళం చేసేశారు. బ్లూ టిక్ కి రేటు కట్టి, ట్విట్టర్ ఇక ఎంతమాత్రం ఫ్రీ సర్వీస్ కాబోదనే సందేశం ఇచ్చారు. దీంతో చాలామంది ప్రత్యామ్నాయ ప్లాట్ ఫామ్ లను చూసుకున్నారు. అయితే మస్క్ మాత్రం ట్విట్టర్ యూజర్ల సంఖ్య భారీగా పెరుగుతోందని ప్రచారం చేసుకున్నారు. అక్కడితో ఆగలేదు, ఉద్యోగుల విషయంలో కరకుగా వ్యవహరించారు. ఉద్యోగులకు ఇచ్చే సదుపాయాలు తగ్గించేశారు, పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించారు. ట్విట్టర్ తర్వాత పెద్ద పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీలన్నీ ఉద్యోగుల్ని ఇంటికి పంపించడానికి ధైర్యం చేశాయి. ఒకరకంగా సాఫ్ట్ వేర్ రంగంలో ఉద్యోగాల తొలగింపు విషయంలో సునామీ సృష్టించారు మస్క్. దీంతో మస్క్ పై విమర్శలు వెల్లువెత్తాయి. వాటన్నిటిపై రియాక్ట్ అవుతూ తాజాగా పోల్ నిర్వహించారు. ఆ పోల్ లో ఫలితం తేడా కొట్టడంతో పదవినుంచి వైదొలగుతానని ప్రకటించారు.

First Published:  21 Dec 2022 3:05 AM GMT
Next Story