Telugu Global
Science and Technology

ట్విట్టర్‌కు కొత్త సీఈవో.. పేరు ప్రకటించని ఎలాన్ మస్క్

ఒక మహిళను ఈ పదవికి ఎంపిక చేసినట్లు తెలుస్తున్నది. కాగా, కొత్త సీఈవో బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఎలాన్ మస్క్ కంపెనీకి చీఫ్ టెక్నాలజిస్ట్‌గా కొనసాగనున్నట్లు సమాచారం.

ట్విట్టర్‌కు కొత్త సీఈవో.. పేరు ప్రకటించని ఎలాన్ మస్క్
X

ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌కు కొత్త సీఈవోను ఎంపిక చేసినట్లు ఎలాన్ మస్క్ ప్రకటించారు. గత ఏడాది సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్‌ను హస్తగతం చేసుకున్న ఎలాన్ మస్క్.. తానే సీఈవోగా వ్యవహరిస్తున్నారు. తాజాగా, తాను ఆ పదవి నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించారు. ఆరు వారాల్లో కొత్త సీఈవో బాధ్యతలు చేపడతారని తెలిపారు. ఒక మహిళను ఈ పదవికి ఎంపిక చేసినట్లు తెలుస్తున్నది. కాగా, కొత్త సీఈవో బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఎలాన్ మస్క్ కంపెనీకి చీఫ్ టెక్నాలజిస్ట్‌గా కొనసాగనున్నట్లు సమాచారం.

ప్రస్తుతం ఎన్‌బీసీ యూనివర్సల్‌లో అడ్వర్టైజింగ్ అండ్ పార్ట్‌నర్‌షిప్స్ విభాగం చైర్ పర్సన్‌గా ఉనన లిండా యాకరినోను కొత్త సీఈవో నియమించినట్లు 'వాల్ స్ట్రీట్ జర్నల్' ఒక కథనంలోపేర్కొన్నది. ఆమెతో మస్క్ గత కొన్ని వారాలుగా చర్చలు జరుపుతున్నారని.. తాజాగా ఆ పదవిని చేపట్టడానికి లిండా సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తున్నది. దాదాపు ఆమె పేరే సీఈవోగా ఖరారు అయ్యే అవకాశాలు ఉన్నాయని ట్విట్టర్ వర్గాలు చెబుతున్నాయి.

ఎన్‌బీసీ యూనివర్సల్‌లో లిండా పదేళ్లుగా పనిచేస్తున్నారు. యాడ్స్ ప్రభావాన్ని మరింత మెరుగుపరిచే అంశాలపై ఆమె పని చేస్తున్నారు. ఈ కంపెనీ ప్రవేశపెట్టిన ప్రకటనల ఆధారిత పీకాక్ స్ట్రీమింగ్ సర్వీసెస్‌లో లిండాది కూడా కీలక పాత్ర ఉన్నది. అంతకు ముందు టర్నర్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో 19 ఏళ్ల పాటు పని చేశారు. యాడ్ సేల్స్‌ను డిజిటల్ రూపంలోకి మార్చడంలో ఆమె కీలకంగా వ్యవహరించారు.

ట్విట్టర్‌లో మస్క్ చేస్తున్న మార్పులకు ఎప్పటి నుంచో లిండా మద్దతు తెలుపుతున్నారు. గత నెలలో కూడా ఎలాన్ మస్క్‌ను లిండా ఇంటర్వ్యూ చేశారు. వీరిద్దరి మధ్య చాన్నాళ్లుగా సత్సంబంధాలు ఉన్నాయి. ఇక లిండాతో పాటు ట్విట్టర్‌లో ట్రస్ట్ అండ్ సేఫ్టీ విభాగానికి ఇంచార్జిగా ఉన్న ఎల్లా ఇర్విన్ కూడా సీఈవో రేసులో ఉన్నట్లు తెలుస్తున్నది.


First Published:  12 May 2023 6:48 AM GMT
Next Story