Telugu Global
International

ట్విట్ట‌ర్ నుంచి 7000 మందికి ఉద్వాస‌న‌.. `ఎక్స్‌`లో కొత్త నియామ‌కాలు.. ఎల‌న్ మ‌స్క్ స్ట్రాట‌ర్జీయే డిఫ‌రెంట్

ఎక్స్(ట్విట్ట‌ర్‌) అధినేత ఎల‌న్ మ‌స్క్ రూటే సెప‌రేటు.. గ‌తేడాది టేకోవ‌ర్ చేయ‌గానే ట్విట్ట‌ర్‌లో భారీగా ఉద్యోగుల ఉద్వాసన ప‌లికిన మ‌స్క్‌.. ఇప్పుడు త‌న `ఎక్స్‌`లో కొత్త నియామ‌కాలు చేప‌ట్ట‌నున్నారు.

ట్విట్ట‌ర్ నుంచి 7000 మందికి ఉద్వాస‌న‌.. `ఎక్స్‌`లో కొత్త నియామ‌కాలు.. ఎల‌న్ మ‌స్క్ స్ట్రాట‌ర్జీయే డిఫ‌రెంట్
X

సోష‌ల్ మీడియా ప్లాట్ ఫామ్ `ఎక్స్‌`(ఇంత‌కుముందు ట్విట్ట‌ర్‌) అధినేత ఎల‌న్ మ‌స్క్ ఏం చేసినా స్పెష‌లే.. గ‌తేడాది ట్విట్ట‌ర్‌ను టేకోవ‌ర్ చేయ‌గానే నాటి ట్విట్ట‌ర్ సీఈఓ సహా భారీగా ఉద్యోగుల‌కు ఉద్వాస‌న ప‌లికారు. దాదాపు 7000 మందిని ఇంటికి సాగ పంపారు. ఎల‌న్ మ‌స్క్ టేకోవ‌ర్ చేసే నాటికి ట్విట్ట‌ర్ ఉద్యోగులు 8,000 మంది ఉంటే.. ఇప్పుడు మాజీ ట్విట్ట‌ర్ `ఎక్స్‌`లో సుమారు 1500 మంది ఉద్యోగులు ప‌ని చేస్తున్నార‌ట‌. తాజాగా `ఎక్స్‌`లోకి కొత్త ఉద్యోగుల‌ను నియ‌మించుకోవాల‌ని ఎల‌న్ మ‌స్క్ భావిస్తున్నారు. `ఎక్స్‌` సీఈఓ లిండా య‌కారినో ఈ సంగ‌తి ధృవీక‌రించారు. ఇటీవ‌లే `ఎక్స్‌` సీఈఓగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన లిండా య‌కారినో.. సీఎన్‌బీసీకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో త‌మ సంస్థ ప‌రివ‌ర్త‌న దిశ‌గా అడుగులేస్తున్న‌ద‌న్నారు. పొదుపు చ‌ర్య‌ల నుంచి వృద్ధి దిశ‌గా `ఎక్స్‌` ప్ర‌యాణిస్తుంద‌ని పేర్కొన్నారు. `వృద్ధి అంటే నియామ‌కాలు` అని పేర్కొన‌డం ద్వారా `ఎక్స్‌` వ్యూహం మారుతుంద‌న్న‌ సంకేతాలిచ్చారు లిండా య‌కారినో.

భారీగా ఉద్యోగుల‌కు ఉద్వాస‌న ప‌లికినా `ఎక్స్` నిర్వ‌హ‌ణ‌కు ఎటువంటి అంత‌రాయాలు క‌లుగ‌లేదు. `ఎక్స్(ట్విట్ట‌ర్‌)`ను ఎల‌న్ మ‌స్క్ టేకోవ‌ర్ చేసిన త‌ర్వాత కంపెనీ భారీగా దెబ్బతిన్న‌ట్లు వార్త‌లొచ్చాయి. కానీ ఇప్పుడు `ఎక్స్‌` రిక‌వ‌రీ దిశ‌గా అడుగులేస్తున్నట్లు సంకేతాలు క‌నిపిస్తున్నాయి. ట్విట్ట‌ర్‌ను ఎల‌న్ మ‌స్క్ టేకోవ‌ర్ చేసిన త‌ర్వాత కంపెనీతో అనుబంధాన్ని తెగ‌దెంపులు చేసుకున్న అడ్వ‌ర్టైజ‌ర్లు తిరిగి వ‌స్తున్నార‌ని లిండా య‌కారినో ధృవీక‌రించారు.

గ‌ణ‌నీయ సంఖ్య‌లో ఉద్యోగుల‌ను తొల‌గించిన‌ప్పుడు.. స‌ద‌రు కంపెనీతో అడ్వ‌ర్టైజ‌ర్ల సంబంధ బాంధవ్యాలు దెబ్బ తిన‌డం స‌హ‌జ‌మేన‌ని లిండా య‌కారినో తెలిపారు. కంపెనీ ఆర్థిక స్థితిగ‌తుల‌ను స్థిరీక‌రించ‌డానికి, ఖ‌ర్చుల నియంత్ర‌ణ‌కు ఉద్యోగుల‌కు ఉద్వాస‌న చెప్ప‌క త‌ప్ప‌లేద‌న్నారు.

ఎల‌న్ మ‌స్క్‌తో త‌న సంబంధాలు బేష్షుగ్గా ఉన్నాయ‌న్నారు లిండా య‌కారినో. కంపెనీలో త‌మ విధులు, బాధ్య‌త‌లు స్ప‌ష్టంగా నిర్వ‌చించ‌బ‌డ్డాయ‌ని తెలిపారు. ఎల‌న్ మ‌స్క్ పూర్తిగా టెక్నాల‌జీ, ప్రొడక్ట్ డెవ‌ల‌ప్‌మెంట్‌పై దృష్టి సారిస్తార‌న్నారు. కంపెనీ నిర్వ‌హ‌ణ‌కు తీసుకోవాల్సిన నిర్ణ‌యాల‌పై ఎల‌న్ మ‌స్క్ త‌న‌కు పూర్తి స్వ‌యం ప్ర‌తిప‌త్తి క‌ల్పించార‌ని తెలిపారు.

ఎక్స్(ట్విట్ట‌ర్‌) సీఈఓగా లిండా య‌కారినో బాధ్య‌త‌లు చేప‌ట్ట‌క ముందు కంపెనీ ప‌రిమాణం భారీగా త‌గ్గించడానికి ఎల‌న్ మ‌స్క్ చ‌ర్య‌లు తీసుకున్నారు. క‌ష్ట‌ప‌డి ప‌ని చేయండి.. లేదా కంపెనీని వీడండి అని ఉద్యోగుల‌ను అభ్య‌ర్థించారు. దూకుడుగా పొదుపు చ‌ర్య‌లు చేప‌ట్టడం తొంద‌ర‌పాటు చ‌ర్యేన‌ని సీఎన్బీసీ ఇంట‌ర్వ్యూలో ఎల‌న్ మ‌స్క్ అంగీక‌రించారు. ఖ‌ర్చుల నియంత్ర‌ణ పేరిట కొంద‌రు ఉద్యోగుల‌ను తొల‌గించ‌డం త‌ప్పేన‌ని ఒప్పుకున్నారు. ఉద్వాస‌న‌కు గురైనవారిలో కొంద‌రిని కంపెనీ నూత‌న వృద్ధి వ్యూహంలో భాగంగా తిరిగి నియ‌మించుకుంటాన‌ని చెప్పారు.

First Published:  11 Aug 2023 6:18 AM GMT
Next Story