Telugu Global
International

గూగుల్ కో ఫౌండర్ భార్యతో ఎలాన్ మస్క్ ఎఫైర్ ?

వివాదాలు ఆయన చుట్టూ తిరుగుతాయో ఆయనే వివాదాల చుట్టూ తిరుగుతాడో కానీ టెస్లా కార్లు, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఎప్పుడూ ఎదో ఒక వివాదంలో ఉంటాడు. ప్రస్తుతం గూగుల్ కో-ఫౌండర్ సెర్జీ బ్రిన్ భార్య నికోల్ షనాహన్ తో మస్క్ ఎఫైర్ సాగించాడన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

గూగుల్ కో ఫౌండర్ భార్యతో ఎలాన్ మస్క్ ఎఫైర్ ?
X

టెస్లా కార్లు, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ బాగోతాలు ఒక్కక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఒకదాని వెనుక ఒకటి వివాదాలు హాట్ హాట్ గా చక్కర్లు కొడుతున్నాయి. కేరాఫ్ కాంట్ర‌వర్సీల 'రాజా' లా మారాడన్న విమర్శలు వినవస్తున్నాయి. గూగుల్ కో-ఫౌండర్, బిలియనీర్ సెర్జీ బ్రిన్ భార్య నికోల్ షనాహన్ తో మస్క్ ఎఫైర్ సాగించాడన్న వార్తలు ఒక్కసారిగా గుప్పుమంటున్నాయి. తన గర్ల్ ఫ్రెండ్, సింగర్ కూడా అయిన గ్రిమ్స్ తో బ్రేకప్ అయ్యాక మస్క్....నికోల్ తో ఎఫైర్ పెట్టుకున్నాడ‌ని సమాచారం. గ్రిమ్స్ తో 'బంధం' కారణంగా ఆయన ఇద్దరు పిల్లల తండ్రి కూడా అయ్యాడు. నిజానికి మస్క్, సెర్జీ బ్రిన్ ఇద్దరూ స్నేహితులే ! నికోల్ తో ప్రేమాయణం మొదలు కాకముందు మస్క్-బ్రిన్ మధ్య మైత్రి ఉండేది. కానీ ఆ తరువాతే అసలు కథ మొదలైందని వాల్ స్ట్రీట్ జర్నల్ ఆర్టికల్ రాసుకొచ్చింది. తన భార్యకు మస్క్ తో 'వ్యవహారం' ఉందని తెలుసుకున్నాక బ్రిన్.. మస్క్ ని దూరం పెట్టడం ప్రారంభించాడని, ఇద్దరి మధ్య స్నేహం బీటలు వారిందని ఈ పత్రిక పేర్కొంది. ఈ రిలేషన్ షిప్ పై బ్రిన్ భగ్గుమన్నాడని వాల్ స్ట్రీట్ తెలిపింది. ఇక బ్రిన్.. తమ మధ్య విభేదాలు ఉన్నాయని, అందువల్ల తన భార్య నుంచి విడాకులు కోరుతున్నానని అంటూ ఆయన గత ఏడాది డిసెంబరు 15 న ఆమె నుంచి వేరయ్యాడు. ఇద్దరూ విడిపోయినప్పటికీ తమ కూతురిని జాయింట్ కస్టడీకి ఇవ్వాలని బ్రిన్ కోర్టును కోరాడట.

ఎలాన్ మస్క్ క్షమాపణ కోరాడా ?

ఈ ఏడాది ఆరంభంలో ఓ పార్టీలో బ్రిన్ ని కలిసినప్పుడు మస్క్ ఆయనను క్షమాపణ కోరాడని తెలిసింది. అది కూడా మామూలు అపాలజీ కాదు.. బ్రిన్ ముందు ఓ కాలు మడిచి కింద కూర్చుని దీనంగా క్షమాపణ కోరాడట.. మియామీలో గత డిసెంబరు మొదటివారంలో జరిగిన ఓ ఆర్ట్ ఈవెంట్ లో ఇది జరిగినట్టు ఈ పత్రిక రాసుకొచ్చింది. పైగా ఆ సమయంలో అక్కడ ప్రపంచ బిలియనీర్లు ఎంతోమంది ఉన్నారని కూడా వెల్లడించింది. అటు- తన టెస్లా కారు ఉత్పత్తిని ప్రారంభించిన కొత్తలో ఎలాన్ మస్క్ .. ఓ కారును బ్రిన్ కి గిఫ్ట్ గా ఇచ్చాడని, దీన్ని అందుకున్నవారిలో ఈయనే మొదటివాడని కూడా వాల్ స్ట్రీట్ వెల్లడించింది. ఇంతేకాదు 2008 లో మస్క్ ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు బ్రిన్ అతనికి 50 లక్షల డాలర్ల సాయాన్ని ఇచ్చి తన ఉదారగుణాన్ని చాటుకున్నాడట.. మస్క్ , నికోల్ మధ్య చాలా నెలలపాటు ఎఫైర్ సాగడమే కాదు.. తన న్యూరాలిక్ కంపెనీలో పని చేస్తున్న షివాన్ జిలిస్ అనే మహిళా ఎగ్జిక్యూటివ్ తో సంబంధం పెట్టుకున్న మస్క్..గత ఏడాది ఇద్దరు కవల పిల్లలకు జన్మ నిచ్చాడన్నవార్తలు ఇప్పటికీ చక్కర్లు కొడుతున్నాయి.

'ఆబ్బే ! ఇదంతా వట్టిదే' ! ఎలాన్ మస్క్

గూగుల్ కో-ఫౌండర్ సెర్జీ బ్రిన్ భార్యతో తాను ఎఫైర్ పెట్టుకున్నట్టు వచ్చిన వార్తలను ఎలాన్ మస్క్ ఖండించాడు. ఇది పూర్తిగా నిరాధారమని, తాను, బ్రిన్ ఇద్దరం స్నేహితులమని , నిన్న రాత్రే ఓ పార్టీలో కలుసుకున్నామని చెప్పాడు. మూడేళ్ళలో తాను నికోల్ ని రెండు సార్లు మాత్రమే చూశానని, ఆ రెండు సందర్భాల్లోనూ తమ చుట్టూ ఎంతోమంది ఉన్నారని తెలిపాడు. రొమాన్సా ? పాడా? అని ట్వీట్ చేశాడు. ఇక ట్విటర్ తో మస్క్ వివాదం ఇంకా కొనసాగుతోంది. దాన్ని కొంటానని చెప్పి.. ఊరించి చివరకు ముఖం చాటేసిన ఈయనపై ట్విటర్ కోర్టుకెక్కింది. ఇంతకీ ఈ వివాదమంతా మస్క్ చుట్టూనే తిరుగుతోంది కానీ గూగుల్ కో-ఫౌండర్ బ్రిన్ భార్య నికోల్ ఏమంటోందో మాత్రం ఇంకా సస్పెన్స్ గానే ఉంది.




First Published:  25 July 2022 6:49 AM GMT
Next Story