Telugu Global
International

నేపాల్‌ను కలవరపెడుతున్న భూకంపాలు.. తాజాగా మరోసారి

మళ్లీ నేపాల్ దేశాన్ని భూప్రకంపనలు వణికించాయి. ఆదివారం తెల్లవారుజామున రిక్టర్ స్కేలుపై 3.6 తీవ్రతతో మరో భూకంపం హిమాలయ దేశాన్ని వణికించింది.

నేపాల్‌ను కలవరపెడుతున్న భూకంపాలు.. తాజాగా మరోసారి
X

నేపాల్‌లో మరోసారి భూకంపం చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున ఈ భూకంపం సంభవించినట్టు నేషనల్ సెంట‌ర్ ఫ‌ర్‌ సిస్మాలజీ తెలిపింది. శుక్రవారం రాత్రి సంభవించిన భారీ భూకంపం వల్ల 157 మంది మరణించారు. ఈ ఘ‌ట‌న నుంచి తేరుకోక‌ముందే మళ్లీ నేపాల్ దేశాన్ని భూప్రకంపనలు వణికించాయి. ఆదివారం తెల్లవారుజామున రిక్టర్ స్కేలుపై 3.6 తీవ్రతతో మరో భూకంపం హిమాలయ దేశాన్ని వణికించింది. ఖాట్మండుకు 169 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో తెల్లవారుజామున 4.38 గంటల సమయంలో భూకంపం సంభవించిందని అధికారిక సమాచారం. జాజర్‌కోట్ జిల్లాలో తొలుత 6.4 తీవ్రతతో శుక్రవారం రాత్రి 11.50 గంటలకు భూకంపం చోటుచేసుకుంది. అనంతరం కొద్ది గంటల తేడాలోనే 4.2 తీవ్రతతో మరో భూకంప రామిదండాలో నమోదయ్యింది.




భూకంపం తరువాత హిమాలయ దేశంలో సహాయక చర్యలు కష్టంగా మారాయని, కొండచరియలు విరిగిపడి మార్గం మూసుకుపోవడంతో కొన్నిచోట్లకు చేరుకోలేకపోయామని అధికారులు పేర్కొన్నారు. హెలికాప్టర్ల ద్వారా రెస్క్యూ ఆప‌రేష‌న్స్ నిర్వహించడానికి నేపాల్ సైన్యం, నేపాలీ సెంటినెల్, సాయుధ పోలీసు బలగాలను ప్రభుత్వం రంగంలోకి దింపింది. క్షతగాత్రులను హెలికాప్టర్‌లో ఆస్ప‌త్రులకు తరలించి వైద్య సేవ‌లు అందించారు. నేపాల్ భూకంపం తర్వాత భారతదేశ పౌరుల కోసం హెల్ప్‌లైన్ నంబర్‌ను ఏర్పాటు చేసింది. మృతుల కుటుంబాలకు నేపాల్ ప్రధాని పుష్పకమల్ సంతాపం తెలిపారు. వైద్య బృందంతో కలిసి నేపాల్ ప్రధాని భూకంప ప్రభావిత ప్రాంతాలను సంద‌ర్శించారు. తిరుగు ప్రయాణంలో ఏడుగురు క్షతగాత్రుల్ని తన హెలికాప్టర్‌లో ఖాట్మండుకు తీసుకువచ్చారు.




2015లో నేపాల్‌లో 7.8 తీవ్రతతో వచ్చిన భూకంపం సుమారు 9,000 మందిని బలి తీసుకుని మరో 22 వేలమందిని గాయాలపాల్జేసింది. ఆ తర్వాత జరిగిన పెద్దవిపత్తు ఇదే. టిబెట్, భారత్ భూ ఫ‌లకాలు కలిసేచోట నేపాల్ ఉంది. ప్రతి వందేళ్లకు రెండు మీటర్లు చొప్పున ఇవి దగ్గరకు జరుగుతుండటం వల్ల వెలువడే ఒత్తిడి.. భూకంపాల రూపంలో బయటకు విడుదలవుతోందని నిపుణులు చెబుతున్నారు.

శుక్రవారం రాత్రి సంభవించిన భూకంప తీవ్రత ఉత్తర భారతాన్ని కూడా తాకింది. భారత్‌లోని పలు ప్రాంతాలు కంపించాయి. ఢిల్లీతో పాటు యూపీ, బిహార్‌లలో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. తాజాగా, ఆదివారం తెల్లవారుజామున భూమి కంపించడంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు.

First Published:  5 Nov 2023 4:02 AM GMT
Next Story