Telugu Global
International

తాగునీటికి ర్యాంక్ లు.. భారత్ పరిస్థితి దారుణం

భారత్ లో మనం తాగే నీటి స్వచ్ఛత 18.2 మాత్రమే. మన పొరుగున ఉన్న శ్రీలంకలో నీటి స్వచ్ఛత 46.7 శాతంగా ఉంది.

తాగునీటికి ర్యాంక్ లు.. భారత్ పరిస్థితి దారుణం
X

భారత దేశంలో తాగు నీరు ఎంత మంచిది..? అసలు మన నీళ్లే మంచివి కావు అంటున్నారు పరిశోధకులు. ప్రపంచ వ్యాప్తంగా స్థానిక ప్రజలు తాగే నీటి పరిశుద్ధతను లెక్కగట్టి ర్యాంకులు ఇచ్చింది యేల్ యూనివర్శిటీ. ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ (EPI) ర్యాంకుల ఆధారంగా ఏ దేశంలో ప్రజలు మంచినీరు తాగుతున్నారు, ఏ దేశ ప్రజలు మురికి నీరు తాగి అనారోగ్యాలబారిన పడుతున్నారని లిస్ట్ తయారు చేసింది. ఇందులో భారత్ ర్యాంక్ గురించి తెలుసుకుంటే గుండె తరుక్కుపోతుంది. 2022నాటికి దేశవ్యాప్తంగా ప్రజలందరికీ పరిశుభ్రమైన తాగునీరు అందిస్తామన్న మన ప్రధాని మోదీ మాటలు ఎంత మోసమో మరోసారి గుర్తుకొస్తుంది.

ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ప్రజలు తాగుతున్న నీటిపై యేల్ యూనివర్శిటీ పరిశోధన చేపట్టింది. అన్ని దేశాలనుంచి తాగునీటి శాంపిల్స్ ని సేకరించి విశ్లేషించింది. ఉత్తర అమెరికా, ఐరోపా ఖండాల్లోని ప్రజలు స్వచ్ఛమైన నీటిని తాగుతున్నారని తేల్చింది.




దేశాల వారీగా లెక్క తీస్తే.. నార్వే, ఫిన్లాండ్, స్విట్జర్లాండ్, ఐర్లాండ్, ఐస్ ల్యాండ్, ఆస్ట్రియా, నెదర్లాండ్, గ్రీస్, మాల్టా.. లో తాగునీరు నూటికి నూరుశాతం పరిశుద్ధమైనది. అక్కడి భౌగోళిక పరిస్థితులు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ద్వారా తాగునీరు పరిశుభ్రంగా ఉందని తేల్చారు పరిశోధకులు.

అత్యంత దారుణం ఎక్కడంటే..?

తాగునీరు పరిశుభ్రంగా ఉన్న దేశాల్లో ఏ ఇంటిలో ట్యాప్ వాటర్ తో అయినా నిస్సందేహంగా దాహం తీర్చుకోవచ్చు. అయితే కొన్ని దేశాల్లో నీరు తాగడమంటే అనారోగ్యం కొనితెచ్చుకున్నట్టే లెక్క. అలాంటి దేశాల లిస్ట్ లో నైగర్, నైజీరియా, బురుండి, టోగో ఉన్నాయి. నైగర్ దేశంలో మంచినీటికి యేల్ యూనివర్శిటీ ఇచ్చిన మార్కులు 1.5 మాత్రమే. ఇక్కడ ప్రజలు తాగేనీరు ఏమాత్రం సురక్షితమైనది కాదు. అలాగని అక్కడి ప్రజలకు పరిశుభ్రమైన నీరు దొరికే మార్గం కూడా లేదు. సహజ వనరులన్నీ కలుషితమయ్యాయి. ఆ నీటిని ఎంత శుద్ధి చేసినా మలినాలు పోవడంలేదు. దీంతో అలాంటి నీటినే తాగుతూ, అనారోగ్యాలతో బతుకీడుస్తున్నారు ఆయా దేశాల ప్రజలు.

భారత్ సంగతేంటి..?

ఇక భారత్ విషయానికొస్తే.. 178 దేశాలు ఉన్న ఈ లిస్ట్ లో భారత్ స్థానం 139. అంటే దాదాపుగా అట్టడుగు స్థానంలో ఉన్నామనమాట. భారత్ లో మనం తాగే నీటి స్వచ్ఛత 18.2 మాత్రమే. మన పొరుగున ఉన్న శ్రీలంకలో నీటి స్వచ్ఛత 46.7 శాతంగా ఉంది. భారత్ లో సహజ వనరులు పుష్కలంగా ఉన్నా, మానవ తప్పిదాల వల్లే నీరు కలుషితమవుతోంది. మనం తాగేది పరిశుభ్రమై నీరు అనే భ్రమలో బతుకుతున్నాం. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. మనం నైగర్ దేశంతో పోటీ పడాల్సి వస్తుంది. తాగునీటి వనరుల విషయంలో ముందే మేల్కొనకపోతే జరిగే నష్టం అపారం. భవిష్యత్ తరాలు మంచినీటికోసం అత్యథికంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. అదే సమయంలో నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు కూడా ప్రబలుతాయి.

First Published:  12 April 2023 6:30 PM GMT
Next Story