Telugu Global
International

డ్రాగన్ కంట్రీ మామూలుగా లేదుగా.. విదేశీ మీడియాను కూడా కబ్జా చేస్తోంది.!

డ్రాగన్ కంట్రీ చైనా తన పేరుకు తగ్గట్లుగానే ప్రపంచమంతా విస్తరించే ప్లాన్‌లో పడింది. దక్షిణ చైనా సముద్రంలో పట్టు పెంచుకోవడంతో మొదలు పెట్టిన చైనా.. తన పక్కనున్న చిన్న దేశాలను ఆక్రమించి తనలో కలిపేసుకుంది.

డ్రాగన్ కంట్రీ మామూలుగా లేదుగా.. విదేశీ మీడియాను కూడా కబ్జా చేస్తోంది.!
X

డ్రాగన్ కంట్రీ చైనా తన పేరుకు తగ్గట్లుగానే ప్రపంచమంతా విస్తరించే ప్లాన్‌లో పడింది. దక్షిణ చైనా సముద్రంలో పట్టు పెంచుకోవడంతో మొదలు పెట్టిన చైనా.. తన పక్కనున్న చిన్న దేశాలను ఆక్రమించి తనలో కలిపేసుకుంది. హాంకాంగ్, తైవాన్, భూటాన్ దేశాలతో పాటు నేపాల్‌పై పట్టు పెంచుకున్నది. ఇండియాలోని అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో ఏకంగా భారీ ఎత్తున భూకబ్జాకు పాల్పడి ఇళ్లు కూడా నిర్మించింది. ఇక అప్పుల పేరుతో శ్రీలంక, పాకిస్తాన్‌పై పట్టు భిగిస్తోంది. అమెరికాకు చెందిన మేధో సంస్థ 'ఫ్రీడమ్ హౌస్' తాజా నివేదికలో అంతర్జాతీయ మీడియాను చైనా ఎలా తన గుప్పిట్లో పెట్టుకుంటుందో వివరించారు.

చైనా సుప్రీమ్ జిన్‌పింగ్ హయాంలో పలు మీడియా సంస్థలను బెదిరించి తమ దేశానికి అనుకూలమైన వార్తలు రాయించుకుంటున్నట్లు తెలిసింది. 2019 నుంచి ప్రధాన మీడియాలో చైనా అనుకూల కంటెంట్ భారీ ఎత్తున ప్రచారం చేస్తోంది. సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలను ఉపయోగించి తప్పుడు సమాచారాన్ని ప్రచారంలోకి తీసుకొని వస్తున్నట్లు తేలింది. అంతే కాకుండా చైనా కమ్యూనిస్టు పార్టీకి వ్యతిరేకంగా ఎవరైనా వార్తలు రాసినా, తమ అభిప్రాయాలను ప్రచురించినా వారిని బెదిరించడంతో పాటు.. ఆయా సంస్థలు, వ్యక్తులపై సైబర్ దాడులకు పాల్పడుతోందని, వారిని తీవ్రంగా వేధిస్తోందని నివేదికలో వెల్లడించారు.

ఇప్పటికే దక్షిణాసియా దేశాలపై పట్టు సాధించాలని పలు ప్రయత్నాలు చేస్తున్న డ్రాగన్ కంట్రీ.. ఇప్పుడు అఫ్రికన్ దేశాలపై తమ కన్నేసింది. ముందుగా అక్కడి ప్రజల్లో చైనా పట్ల సానుకూల అభిప్రాయం ఏర్పడేలా మీడియా సంస్థల ద్వారా కథనాలు రాయిస్తున్నట్లు 'ఫ్రీడమ్ హౌస్' నివేదికలో పేర్కొన్నది. ఆఫ్రికాలోని 18 దేశాల్లోని మీడియా లక్ష్యంగా చైనా ప్రభుత్వం తప్పుడు మార్గాలను అనుసరిస్తున్నట్లు తెలిపింది. జిన్‌పింగ్ ఇమేజ్ పెంచేలా కథనాలు రాయాలని ఆయా సంస్థలపై ఒత్తిడి తెస్తున్నట్లు వెల్లడించింది. ఆయా దేశాల్లోని సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్, జర్నలిస్టులు, మీడియా సంస్థలను ఉపయోగించుకొని చైనా అనుకూల వాతావరణ కల్పించేలా వార్తలు రాయిస్తోంది.

అంతే కాకుండా ఒక్కో మీడియా సంస్థకు దాదాపు రూ. 1 కోటి వరకు చెల్లించి తమకు అనుకూలమైన ఛానల్స్ ప్రారంభించింది. ఈ వార్తా ఛానల్స్‌లో చైనా అనుకూల కంటెంట్ నిరంతరం ప్రసారం చేస్తున్నారు. జిన్‌పింగ్ ఇమేజ్ పెంచేలా కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నారు. అంతే కాకుండా చైనాలో నిర్వహించే ప్రభుత్వ కార్యక్రమాలను ఈ ఛానల్స్ ప్రసారం చేస్తున్నాయి. చైనా కావాలనే ఇదంతా చేస్తోందని, దీర్ఘకాలంలో తమ దేశానికి ప్రజలు అనుకూలంగా మారిపోవాలనే ఇలాంటి నిర్ణయం తీసుకుందని నివేదికలో పేర్కొన్నారు. గత మూడేళ్లుగా ఆఫ్రికన్ మీడియా సంస్థలను పూర్తిగా కబ్జా చేసిందని.. తద్వారా తమకు అనుకూలంగా మార్చేసుకుందని నివేదిక వెల్లడించింది. ఇది మీడియా హక్కులకు భంగం కలిగించడమేనని పేర్కొన్నది. అయితే చైనా ఈ నివేదికపై ఇంకా స్పందించలేదు.

First Published:  12 Sep 2022 3:15 AM GMT
Next Story