Telugu Global
International

అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ హత్యకు ఆ తెలుగు యువకుడు కుట్ర పన్నాడా?

యువకుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా.. తాను అమెరికా అధ్యక్షుడిని లక్ష్యంగా చేసుకున్నానని చెప్పినట్లు పోలీసులు తెలిపారు.

అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ హత్యకు ఆ తెలుగు యువకుడు కుట్ర పన్నాడా?
X

అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ హత్యకు కుట్ర పన్నిన కేసులో పోలీసులు తెలుగు సంతతికి చెందిన యువకుడిని అరెస్టు చేశారు. యూఎస్ ప్రెసిడెంట్ అధికారిక నివాసమైన వైట్ హౌస్ పరిసరాల్లోకి ట్రక్కుతో దూసుకొని వచ్చిన కందుల అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10 గంటల సమయంలో భారీ ట్రక్కుతో వచ్చిన సాయి వర్షిత్.. వైట్ హౌస్ ఉత్తర భాగం వైపు భద్రత నిమిత్త ఏర్పాటు చేసిన ట్రాఫిక్ బారియర్స్‌ను ఢీకొట్టి.. లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించాడు.

ట్రాఫిక్ బారియన్స్‌ను ఢీకొట్టిన వెంటనే అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది అప్రమత్తం అయ్యారు. ఆ సమయంలో ట్రక్కుపై నాజీ జెండా ఉన్నట్లు కూడా గుర్తించారు. యువకుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా.. తాను అమెరికా అధ్యక్షుడిని లక్ష్యంగా చేసుకున్నానని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అతడిపై మారణాయుధాల వినియోగం, వాహనాన్ని నిర్లక్ష్యంగా నడపడం, దేశాధ్యక్షుడికి ప్రాణ హానీ కలిగించేందుకు ప్రయత్నించడం, ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం వంటి కేసులు నమోదు చేశారు.

కాగా, ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. సంఘటన జరిగినప్పుడు బైడెన్ వైట్‌హౌస్‌లో ఉన్నరా లేదా అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. మంగళవారం అధ్యక్షుడి దృష్టికి ఘటన అంశాన్ని తీసుకొని వెళ్లినట్లు తెలిపారు. అమెరికాలోని ఛెస్ట్‌ఫీల్డ్‌కు చెందిన సాయి వర్షిత్ 2022లో మార్క్వెట్ సీనియర్ హైస్కూల్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యాడు. సామాజిక మాధ్యమాల ద్వారా అతడికి సంబంధించి మరిన్ని వివరాలు సేకరించేపనిలో అమెరికా పోలీసులు పడ్డారు.

First Published:  24 May 2023 5:16 AM GMT
Next Story