Telugu Global
International

వంతెనలు కూలిపోవడం వల్ల గత 20 ఏళ్లలో జరిగిన ఘోర ప్ర‌మాదాలు

గుజరాత్ లో కేబుల్ బ్రిడ్జి కూలిపోయిన ఘటనలో ఇప్పటి వరకు 141 మందిమరణించగా అనేక మంది గాయాలపాలయ్యారు. ఈ నేపథ్యంలో గ‌త ఇర‌వై యేళ్ళ‌లో ప్రపంచవ్యాప్తంగా ఇలా వంతెన‌లు కూలి వంద‌లాది మంది మ‌ర‌ణించిన హోర సంఘ‌ట‌న‌ల వివ‌రాలు తెలుసుకుందాం

వంతెనలు కూలిపోవడం వల్ల  గత 20 ఏళ్లలో   జరిగిన ఘోర ప్ర‌మాదాలు
X

గుజరాత్‌లోని మోర్బీలో మచ్చు నదిపై నిన్న సాయంత్రం కేబుల్ బ్రిడ్జి కూలిపోయిన ఘ‌ట‌నతో దేశం యావ‌త్తు దిగ్బ్రాంతి చెందింది. ఈ సంఘటనలో 141 మంది మ‌ర‌ణించ‌గా ప‌లువురు ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొన్నేళ్లలో దేశాన్ని కుదిపేసిన అత్యంత ఘోరమైన ప్ర‌మాదాల‌లో ఇది ఒకటి. గ‌త ఇర‌వై యేళ్ళ‌లో ప్రపంచవ్యాప్తంగా ఇలా వంతెన‌లు కూలి వంద‌లాది మంది మ‌ర‌ణించిన హోర సంఘ‌ట‌న‌ల వివ‌రాలు....

నిన్నగుజరాత్‌లోని మోర్బీలో 100 ఏళ్ల నాటి కేబుల్ బ్రిడ్జి (వేలాడే వంతెన) కూలిపోయి 141 మంది మరణించారు. ప్ర‌మాద స‌మ‌యంలో మోర్బీ వంతెనపై 500 మంది వరకు ఉన్నారని అధికారులు చెబుతున్నారు.

2021మే నెలలో మెక్సికో సిటీ మెట్రో సిస్టమ్‌లోని ఎలివేటెడ్ ట్రాక్ ఒక ప్యాసింజర్ రైలు కూలిపోవడంతో 26 మంది మరణించారు. ఈ ప్ర‌మాదంలో ప‌దుల సంఖ్య‌లో గాయపడ్డారు.

ఇటలీలోని జెనోవా నగరంలో 2018ఆగస్టులో మొరాండి వంతెన కూలి 43 మంది మరణించారు. ఈ వంతెన ఫ్రాన్స్, ఇటలీలను కలిపే కీలక రహదారిలో ఉంది.

కోల్‌కతాలో2016 మార్చిలో రద్దీగా ఉండే వీధిలో ఫ్లైఓవర్ కూలిపోవడంతో దాదాపు 26 మంది మరణించారు. భారీ కాంక్రీట్ స్లాబ్‌లు, మెటల్ కింద గాయపడిన దాదాపు 100 మందిని స‌హాయ‌క సిబ్బంది బయటకు తీశారు.

అక్టోబర్ 2011లో వ‌ర‌స‌గా రెండు ప్ర‌మాదాలు జ‌రిగాయి., డార్జిలింగ్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఈశాన్య భారతదేశంలో పండుగ సంద‌ర్భంగా ప్ర‌జ‌లు భారీగా వంతెన‌పైకి రావ‌డంతో వంతెన కూలిపోయి కనీసం 32 మంది మరణించారు. ఈ సంఘట‌న జ‌రిగిన వారం లోపే అరుణాచల్ ప్రదేశ్‌లో నదిపై వంతెన కూలి 30 మంది చనిపోయారు.

చైనా, నేపాల్ దేశాల్లో 2007 ఆగస్టులో సెంట్రల్ హునాన్ ప్రావిన్స్‌లో ఒక నది వంతెన నిర్మాణాన్ని పూర్తి చేస్తుండగా కూలిపోవడంతో కనీసం 64 మంది కార్మికులు మరణించారు. నేపాల్‌లో డిసెంబర్‌లో దేశంలోని పశ్చిమ ప్రాంతంలో యాత్రికులతో రద్దీగా ఉన్న స‌మ‌యంలో భేరీ నదిపై వంతెన కూలిపోవడంతో కనీసం 16 మంది మరణించ‌గా 25 మంది గ‌ల్లంత‌య్యారు. ప్రమాదం జరిగిన సమయంలో వంతెనపై దాదాపు 400 మంది ఉన్నట్లు సమాచారం. దాదాపు 100 మంది వరకు ఈత కొట్టి సురక్షితంగా బయటపడ్డారు.

భారత్ లో 2006 డిసెంబర్‌లో బీహార్‌లోని రైల్వే స్టేషన్‌లో ప్యాసింజర్ రైలుపై 150 ఏళ్ల నాటి వంతెన కూలిపోవడంతో కనీసం 34 మంది మరణించారు. పాకిస్తాన్‌లో 2006 ఆగస్టులో భారీ వ‌ర్షాల‌కు పెషావర్‌కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న మర్దాన్‌లో వంతెన కొట్టుకుపోవడంతో కనీసం 40 మంది మరణించారు.

భారత్ లో 2003 ఆగస్టులో ముంబైకి సమీపంలో ఒక వంతెన నదిలో కూలిపోవ‌డంతో దానిపై ప్ర‌యాణిస్తున్న స్కూలు బ‌స్సు లో ఉన్న 19 మంది పిల్లలతో సహా 20 మంది మరణించారు,డిసెంబరులో బొలీవియాలో బస్సు దాటుతుండగా రోడ్డు వంతెన వరదలకు కొట్టుకుపోవడంతో 29 మంది చనిపోయారు.

First Published:  31 Oct 2022 6:22 AM GMT
Next Story