Telugu Global
International

సౌదీ ప్ర‌ధానిగా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ నియామ‌కం

సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ (ఎంబిఎస్‌) ను ప్రధాన మంత్రిగా నియ‌మించారు రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్. ఎంబిఎస్ గా పిలువబడే యువరాజు గ‌తంలో రక్షణ మంత్రిగా ఉన్నారు.

సౌదీ ప్ర‌ధానిగా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ నియామ‌కం
X

సౌదీ అరేబియా రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ తన కుమారుడు, వారసుడు యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ (ఎంబిఎస్‌) ను ప్రధాన మంత్రిగా నియ‌మించారు. రాజు రెండవ కుమారుడు ప్రిన్స్ ఖలీద్‌ను రక్షణ మంత్రిగా నియమించినట్లు రాజ శాసనం తెలిపింది. ఈ పునర్వ్యవస్థీకరణలో రాజు మరో కుమారుడు ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్ ఇంధన శాఖ మంత్రిగా నియ‌మితుల‌య్యారు.

కాగా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్, ఆర్థిక మంత్రి మహ్మద్ అల్-జదాన్, పెట్టుబడి మంత్రి ఖలీద్ అల్-ఫాలిహ్ శాఖ‌ల‌లో ఎటువంటి మార్పులు లేవ‌ని రాజ శాస‌నం పేర్కొంది. ప్ర‌ధాన‌మంత్రి హోదాలో యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ కొత్త పాత్రను పోషిస్తారు. విదేశీ పర్యటనలలో దేశానికి ప్రాతినిధ్యం వహించడం, దేశం త‌ర‌పున నిర్వహించే శిఖరాగ్ర సమావేశాలకు అధ్యక్షత వహించడం వంటి బాధ్య‌త‌ల‌ను ఆయ‌న నిర్వ‌హించాల్సి ఉంటుంద‌ని సౌదీ అధికారి ఒక‌రు మంగళవారం తెలిపారు. "రాజు ఆదేశాల ఆధారంగా హెచ్‌ఆర్‌హెచ్ యువరాజు, ఇప్పటికే రాష్ట్రంలోని ప్రధాన కార్యనిర్వాహక సంస్థలను రోజూ వారీగా పర్యవేక్షిస్తున్నారు. ప్రధానమంత్రిగా అతని కొత్త పాత్ర లో కూడా ఈ బాధ్య‌త‌ల‌ను చూస్తార‌ని," ఆ అధికారి తెలిపారు.

ఎంబిఎస్ గా పిలువబడే యువరాజు గ‌తంలో రక్షణ మంత్రిగా ఉన్నారు. ఆయ‌న చిన్న త‌మ్ముడు ప్రిన్స్ ఖలీద్ బిన్ సల్మాన్ గతంలో డిప్యూటీ డిఫెన్స్ మినిస్టర్‌గా పనిచేశారు. తాను హాజరయ్యే క్యాబినెట్ సమావేశాలకు కింగ్ సల్మాన్ అధ్యక్షత వహిస్తారని ఉత్త‌ర్వులు పేర్కొన్నాయి. 86 ఏళ్ల రాజు గత రెండేళ్లుగా అనారోగ్యం ఉన్నారు. ఆయన పలుమార్లు ఆసుపత్రి పాలయ్యారు.

ప్రిన్స్ మొహమ్మద్ 2017 లో అధికారంలోకి వచ్చినప్పటి నుండి సౌదీ అరేబియాలో సమూల మార్పులు చేశారు. అతను కేవ‌లం చమురు ఎగుమ‌తుల‌పైనే ఆధారపడకుండా దేశ ఆర్థిక వ్యవస్థను వైవిధ్యపరిచే ప్రయత్నాలు చేశాడు. మహిళలకు డ్రైవింగ్ చేసే హ‌క్కును అనుమతించాడు. సమాజంపై మతాధికారుల అధికారాన్ని అరికట్టాడు. ఈ సంస్క‌ర‌ణ‌లు అంత తేలిగ్గా సాధ్య‌ప‌డ‌లేదు. రాజ్యం తీరుపై , ప‌లువురు ఉద్య‌మకారులు, రాజ కుటుంబీకులు, మహిళా హక్కుల కార్యకర్తలు, వ్యాపారవేత్తల ప్ర‌తిఘ‌ట‌న‌ల‌ను అణ‌చివేతల అనంత‌రం చివ‌రికి సంస్క‌ర‌ణ‌లు అమ‌లులోకి వ‌చ్చాయి.

అయితే 2018లో ఇస్తాంబుల్‌లోని రాజ్య కాన్సులేట్‌లో పాత్రికేయుడు జమాల్ ఖషోగ్గి హత్య అతని ప్రతిష్టను దిగజార్చింది .యునైటెడ్ స్టేట్స్ ,ఇతర పాశ్చాత్య మిత్రదేశాలతో ఆ దేశ‌ సంబంధాలను దెబ్బతీసింది.

First Published:  28 Sep 2022 6:15 AM GMT
Next Story