Telugu Global
International

ప్రపంచం మొత్తంలోని సగం వ్యక్తిగత సంపద వారిదే..

2021 సంవత్సరం గణాంకాలను తాజాగా క్రెడిట్ సూయిస్ సంస్థ వెల్లడించింది. ప్రపంచంలోని మొత్తం వ్యక్తిగత సంపద 2021 ఆఖరి నాటికి 463.6 లక్షల కోట్ల డాలర్లుగా సంస్థ అంచనా వేసింది.

ప్రపంచం మొత్తంలోని సగం వ్యక్తిగత సంపద వారిదే..
X

ఈ రోజుల్లో ఎలా బతికావ‌న్నది కాదు.. ఎంత సంపాదించావన్నదే ముఖ్యం. జేబు బరువును చూసి మనకు ఇచ్చే విలువ చాలా ఎక్కువ‌గా ఉంటుంది. జనానికి డబ్బు జబ్బు పట్టుకుంది. లేచింది మొదలు పడుకునే వరకూ డబ్బు చుట్టే పరుగులు. అందుకే భారతీయులు ఎక్కువగా విదేశాలకు పరిగెత్తేది. ఇక ఈ సంపాదనలో చైనా, అమెరికా పౌరులు మరింత ఆరితేరి పోయారు. వ్యక్తిగత సంపాదనలో వారే టాప్. ప్రపంచంలో సగం సంపాదన వారిదే. ఒక దేశ ఆర్థిక స్థితిగతులను తెలుసుకోవడానికి జీడీపీతో పాటు తలసరి ఆదాయాన్ని అంచనా వేస్తారు. ఏటా గ్లోబల్ వెల్త్ రిపోర్ట్‌ను విడుదల చేసే'క్రెడిట్‌ సూయిస్‌' సంస్థ ఈ ఏడాదికి సంబంధించిన రిపోర్ట్‌ను విడుదల చేసింది.


2021 సంవత్సరం గణాంకాలను తాజాగా క్రెడిట్ సూయిస్ సంస్థ వెల్లడించింది. ప్రపంచంలోని మొత్తం వ్యక్తిగత సంపద 2021 ఆఖరి నాటికి 463.6 లక్షల కోట్ల డాలర్లుగా సంస్థ అంచనా వేసింది. ఆసక్తికరంగా దీనిలో సగం సంపద అమెరికా, చైనా పౌరుల సొంతమని నివేదిక స్పష్టం చేసింది. ఇక వీరిద్దరిలో అమెరికా పౌరులది ఎక్కువ శాతం వాటా కాగా.. ఆ తర్వాతి స్థానంలో చైనా పౌరులున్నారు. మొత్తం వ్యక్తిగత సంపదలో అమెరికా పౌరులకు 31.5 శాతం వాటా.. చైనా పౌరులు 18.4 శాతం వాటాను కలిగి ఉన్నారు. ఇక ఇండియా ఎక్కడుందంటే.. 3.1 శాతం వాటాతో ఏడో స్థానంలో నిలిచింది. టాప్‌–10లో అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, యూకే, ఫ్రాన్స్, ఇండియా, కెనడా, ఇటలీ, ఆస్ట్రేలియా ఉన్నాయి.


నివేదికలో ముఖ్యాంశాలు..

భారీ ఆర్థిక శక్తుల వద్దే వ్యక్తిగత సంపద అంతా కూడగట్టుకుంటోంది.

♦ ప్రపంచంలోని వ్యక్తిగత సంపదలో 75 శాతం కేవలం 10 దేశాల్లోనే ఉంది.

♦ దశాబ్దం క్రితం ప్రపంచ వ్యక్తిగత సంపదలో చైనా వాటా 9 శాతం మాత్రమే.. కానీ ఇప్పుడు రెట్టింపు అయ్యింది.

♦ ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 6.2 కోట్ల మంది మిలియనీర్లు ఉండగా, 2026 నాటికి వీరి సంఖ్య 8.75 కోట్లకు చేరుతుందని అంచనా.

♦ 10 లక్షల డాలర్లు, అంతకంటే ఎక్కువ సంపద ఉన్న వ్యక్తుల (మిలయనీర్ల) సంఖ్య 2021లో 7.9 లక్షలు.

First Published:  13 Nov 2022 7:45 AM GMT
Next Story