Telugu Global
International

సైబర్‌ నేరాల్లో సరికొత్త ట్రెండ్‌.. నయా మోసం

చైనాలో తన కుటుంబం ప్రమాదంలో ఉందని కై జువాంగ్‌కు చెప్పి, నువ్వే స్వయంగా కిడ్నాప్ గురైనట్లు దూర ప్రాంతానికి వెళ్లి అక్కడి నుండి ఫొటోలు పంపాలని సైబర్ కిడ్నాపర్లు అతనిని బెదిరించారు.

సైబర్‌ నేరాల్లో సరికొత్త ట్రెండ్‌.. నయా మోసం
X

కొద్దిరోజుల క్రితం కై జువాంగ్ అనే 17 ఏళ్ళ చైనా విద్యార్థి అమెరికాలో కనిపించకుండా పోయాడు. స్థానిక పోలీసులు కై జువాంగ్‌ను ఎవరో బలవంతంగా ఎత్తుకెళ్లారని భావించారు. తరువాత బ్రిగ్ హామ్ సిటీలో రివర్ డెల్‌కు 40 కిలోమీటర్ల దూరంలో సురక్షితంగా కనిపించడంతో అక్కడి పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇక్కడే మొదలయ్యింది అసలు కథ‌.

చైనాలో తన కుటుంబం ప్రమాదంలో ఉందని కై జువాంగ్‌కు చెప్పి, నువ్వే స్వయంగా కిడ్నాప్ గురైనట్లు దూర ప్రాంతానికి వెళ్లి అక్కడి నుండి ఫొటోలు పంపాలని సైబర్ కిడ్నాపర్లు అతనిని బెదిరించారు. లేదంటే కుటుంబ సభ్యులకు ప్రమాదం తలపెడతామని హెచ్చరించారు. ఈ వార్నింగ్‌కు భయపడిన విద్యార్థి వారు చెప్పినట్లే నిర్మానుష్య ప్రదేశంలో తను బంధించబడినట్లు ఫొటోలు తీసి సైబర్ కిడ్నాపర్లకు పంపాడు. వీటిని కిడ్నాపర్లు చైనాలో ఉన్న కై జువాంగ్ తల్లిదండ్రులకు పంపి.. తామే కిడ్నాప్ చేసినట్లు నమ్మించి, 80 వేల యూస్ డాలర్లు చెల్లించకపోతే అతనిని చంపేస్తామని బెదిరించారు. దీంతో కుటుంబ సభ్యులు భయపడి కిడ్నాపర్లు డిమాండ్ చేసిన డబ్బును చెల్లించారు. మరోవైపు ఇక్కడ అమెరికాలో విద్యార్థిని పోలీసులు గుర్తించారు. అయితే మొత్తం ఘటనపై చైనా రాయబార కార్యాలయం అధికారులు, ఎఫ్‌బీఐ అధికారులు చేసిన సంయుక్త దర్యాప్తులో ఈ సైబర్ కిడ్నాపింగ్ కథ‌ వెలుగు చూసింది.

ఎలా చేస్తారంటే

ఇతర ఆన్‌లైన్‌ మోసాలలాగే సైబర్‌ కిడ్నాపింగ్‌ కూడా డిజిటల్‌ నేరమే. సైబర్‌ కిడ్నాపింగ్‌లో ఆన్‌లైన్‌ నేరగాళ్లు బాధితులపై పలువిధాలుగా బెదిరింపులకు పాల్పడటం ద్వారా అటవీ లేదా నిర్జన ప్రాంతాలకు వెళ్లమని లేదా తమను తాము నిర్బంధంలో ఉండే విధంగా ఆదేశిస్తారు. అయితే ఈ వ్యవహారాన్నంతా కిడ్నాపర్లు ఫేస్‌టైమ్, లేదంటే స్కైప్ ద్వారా గమనిస్తుంటారు. వారు తీసిన ఫొటోలను బాధిత కుటుంబసభ్యులకు పంపి డబ్బులు డిమాండ్‌ చేస్తారు. బాధితుడి గొంతును మిమిక్రీ చేసేందుకు కృత్రిమ మేథ టూల్స్‌ను కూడా ఉపయోగిస్తున్నారు.

సైబర్, డిజిటల్ లేదా వర్చువల్ కిడ్నాప్‌ అనేక రూపాలలో జరుగుతుంది. అయితే వీటి సారాంశం ఎవరో ఒకరిని అపహరించినట్టుగా భ్రమ కల్పించడమే. తరువాత బాధితులు తమ అయినవారి కోసం పెద్ద మొత్తంలో డబ్బు కట్టకపోతే వారికేదో హాని కలుగుతుందనే ట్రిక్కే కిడ్నాపర్ల ఆయుధం. కాకపోతే మోసం, బెదిరింపుల ద్వారా, తమ పథకం బయటపడకముందే త్వరితగతిన డబ్బు చెల్లించేలా వారు బాధితులపై ఒత్తిడి తెస్తారని ఎఫ్‌బిఐ పేర్కొంది. అలాగే కిడ్నాపర్లు ఎవరైనా సంప్రదిస్తే వెంటనే కమ్యూనికేషన్‌ కట్‌ చేసి, పోలీసులకు సమాచారం అందించాలని అమెరికా సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ విద్యార్థులకు సూచించింది.

First Published:  4 Jan 2024 3:43 PM GMT
Next Story