Telugu Global
International

అప్పులిస్తాం రండి.. చైనా బ్యాంకుల ఆఫర్లు..

ఆ సంక్షోభాన్ని ఎదుర్కోడానికి వడ్డీ రేట్లను తగ్గించడం అనే అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. వడ్డీ రేట్ల తగ్గింపుతో సంక్షోభంలో కూరుకుపోయిన స్థిరాస్తి రంగానికి చైనా ఊతమిస్తోంది. రెండో దశ కొవిడ్‌ విజృంభణతో నెమ్మదించిన ఆర్థిక వ్యవస్థకు అక్కడి ప్రభుత్వం దన్నుగా నిలుస్తోంది.

అప్పులిస్తాం రండి.. చైనా బ్యాంకుల ఆఫర్లు..
X

ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ఆర్థిక రంగాలు కుదేలవుతున్నాయి. నష్టాలను తట్టుకోడానికి బ్యాంకులు వడ్డీ రేట్లను సవరిస్తున్నాయి. కానీ చైనా మాత్రం రివర్స్ లో వెళ్తోంది. అవును, చైనాలో వడ్డీ రేట్లను త‌గ్గిస్తున్నారు. రండి రండి అప్పులిస్తామంటూ బ్యాంకులు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఎందుకిదంతా..? చైనా ఆర్థిక వ్యూహం ఏంటి..?

చైనా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది, అంత పెద్ద కరోనా విపత్తుని కూడా జయించి ఇప్పుడు తిరిగి ఆర్థిక స్థిరత్వాన్ని సాధిస్తోంది. కానీ ఇప్పుడు అనుకోకుండా చైనాలో రియల్ ఎస్టేట్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సహజంగా ఇతర దేశాల్లో ఇలాంటి సంక్షోభాలు వస్తే, ప్రభుత్వాలు ప్రేక్షక పాత్ర పోషించడం మినహా చేసేదేం లేదు. ఎందుకంటే ప్రైవేటు రంగంలోని రియల్ ఎస్టేట్ కుదేలయితే, ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమీ లేదు. కానీ చైనా అలా ఆలోచించలేదు. ఆ సంక్షోభాన్ని ఎదుర్కోడానికి వడ్డీ రేట్లను తగ్గించడం అనే అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. వడ్డీ రేట్ల తగ్గింపుతో సంక్షోభంలో కూరుకుపోయిన స్థిరాస్తి రంగానికి చైనా ఊతమిస్తోంది. రెండో దశ కొవిడ్‌ విజృంభణతో నెమ్మదించిన ఆర్థిక వ్యవస్థకు అక్కడి ప్రభుత్వం దన్నుగా నిలుస్తోంది.

పెట్టుబడులు తరలిపోకూడదనే..

ఆర్థిక మందగమనం ఉంటే సహజంగా పెట్టుబడులు ఇతర దేశాలకు తరలిపోతాయి. దాన్ని అడ్డుకోడానికే ఇప్పుడు చైనా ప్రభుత్వం బ్యాంకులను రంగంలోకి దించింది. తక్కువ వడ్డీ రేట్లకు రుణాలిస్తామంటూ వ్యాపారులను, పెట్టుబడులను కాపాడుకోబోతోంది. బ్యాంకింగ్‌ వ్యవస్థలోని నగదును చలామణిలోకి తీసుకురావడం కోసం కీలక నిర్ణయాలకు తెరతీసింది చైనా. రుణాలపై వడ్డీ రేట్లు తగించడం ద్వారా ద్రవ్య లభ్యత అధికమవుతుందని భావిస్తోంది. తమ దేశం నష్టపోకూడదు, ఆ అవకాశం విదేశాలకు అస్సలు ఇవ్వకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వమే రంగంలోకి దిగి రియల్ ఎస్టేట్ రంగానికి అండగా నిలబడుతోంది.

ప్రస్తుతం చైనాలో రుణాలపై కనీస వడ్డీ రేటును 2.85 శాతం నుంచి 2.75 శాతానికి తగ్గించాయి వివిధ బ్యాంకులు. రుణ పరపతి పెంచేందుకు బ్యాంకులకు అదనంగా 6,000 కోట్ల డాలర్ల నిధులను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఈ ఏడాది చైనా జీడీపీ వృద్ధి రేటు 2.5 శాతం మించలేదు. వృద్ధి రేటు ఇలానే కొనసాగితే ఈ సంవత్సరం లక్ష్యంగా పెట్టుకున్న 5.5 శాతం జీడీపీ వృద్ధి రేటు సాధించడం అసాధ్యం అంటున్నారు. అందుకే వడ్డీ రేట్లు తగ్గింపుతో ప్రభుత్వం ఉద్దీపనలకు దిగింది.

First Published:  23 Aug 2022 6:28 AM GMT
Next Story