Telugu Global
International

బయటపడిన చైనా దారుణాలు.. నిరసనకారులను ఏం చేస్తోందో తెలుసా?

జైళ్లలో పెడితే బెయిల్‌పై బయటకు వస్తారనే అనుమానంతో.. మతిస్థిమితం కోల్పోయారనే ముద్రవేసి మానసిక వైద్యశాలల్లో వేస్తోంది. 2010 మొదటి నుంచి నిరసనకారులు, హక్కుల కార్యకర్తలను ఇదే విధంగా పదుల సంఖ్యలో మానసిక వైద్యశాల‌ల్లో నిర్బంధించినట్లు సదరు నివేదికలో పేర్కొన్నారు.

బయటపడిన చైనా దారుణాలు.. నిరసనకారులను ఏం చేస్తోందో తెలుసా?
X

ప్రభుత్వం, పాలకులపై విమర్శలు చేయడం.. ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించడం సాధారణమైన విషయమే. ప్రశ్నించే గొంతుకలను, నిరసనకారులను అణిచి వేయడం అనేది ప్రతీ దేశంలోనూ చూస్తుంటాము. మన దేశంలో కూడా ఇటీవల కాలంలో ఎంతో మంది సామాజిక కార్యకర్తలను, ప్రజా గొంతుకలను అనవసరమైన కేసుల్లో ఇరుకించి జైళ్ల పాలు చేయడం చూశాము. కనీసం బెయిల్ కూడా రాకుండా, బెయిల్ వచ్చినా సొంత ఇంటికి దూరంగా ఉండాలంటూ నానా షరతులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తోంది. అయితే కమ్యూనిస్టు దేశంగా ముద్రపడిన చైనాలో కూడా నిరసనకారులపై వేధింపులు తక్కువేమీ కాదు. పైగా ఇతర దేశాల్లో పోలిస్తే అక్కడ మరింత దారుణంగా ప్రజా వ్యతిరేక గళాలను అణిచివేస్తున్నట్లు ఓ నివేదిక తెలిపింది.

మాడ్రిడ్‌కు చెందిన సేఫ్‌గార్డ్ డిఫెండర్స్ అనే స్వచ్ఛంద‌ సేవా సంస్థ సమగ్ర నివేదికను రూపొందించింది. ఇందులో చైనా తమ నిరసనకారులపై ఎలాంటి దారుణాలకు పాల్పడుతుందో పూర్తిగా వివరించారు. జైళ్లలో పెడితే బెయిల్‌పై బయటకు వస్తారనే అనుమానంతో.. మతిస్థిమితం కోల్పోయారనే ముద్రవేసి మానసిక వైద్యశాలల్లో వేస్తోంది. 2010 మొదటి నుంచి నిరసనకారులు, హక్కుల కార్యకర్తలను ఇదే విధంగా పదుల సంఖ్యలో మానసిక వైద్యశాల‌ల్లో నిర్బంధించినట్లు సదరు నివేదికలో పేర్కొన్నారు. సేఫ్‌గార్డ్ డిఫెండర్స్ అనే సంస్థ దీనికి సంబంధించిన వివరాలన్నింటినీ సివిల్ రైట్స్ అండ్ లైవ్లీహుడ్ వాచ్ (సీఆర్ఎల్‌డబ్ల్యూ) అనే చైనా ఎన్డీవో సంస్థ నుంచి సేకరించారు. లీ ఫెయీ అనే జర్నలిస్తు నెలకొల్పిన ఈ సంస్థ చైనా మానసిక ఆసుపత్రుల్లో మగ్గుతున్న వందలాది మంది హక్కుల కార్యకర్తలను ఇంటర్వ్యూలు చేసింది.

2015 నుంచి 2021 వరకు దాదాపు 100 మంది చైనీస్ హక్కుల కార్యకర్తలు బలవంతంగా మానసిక వైద్యశాలల్లో బంధించబడ్డారని.. రాజకీయ కారణాలే ఇందుకు కారణమని సదరు సంస్థ తేల్చి చెప్పింది. రాజకీయ విమర్శలు, ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేస్తుండటం వల్లే వారిని ఇలా నిర్బంధించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలు, నాయకులను విమర్శించారనే వారిని మానసిక వైద్యశాలలకు తరలించినట్లు వారు తమ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

చైనీస్ కమ్యూనిస్టు పార్టీ (సీసీపీ) తమకు అడ్డుతగిలే కార్యకర్తలు, పిటిషనర్లను న్యాయవ్యవస్థకు అందకుండా ఇలా నిర్బంధిస్తున్నట్లు తెలుస్తున్నది. ఇలా పిచ్చాసుపత్రుల పాలు చేయడం ద్వారా వాళ్లు లాయర్‌ను నియమించుకోలేకపోతున్నారని, అంతే కాకుండా వారి కేసులు అసలు కోర్టులకు కూడా చేరడం లేదని తెలుస్తున్నది. ఒకవేళ ఎవరైనా కోర్టులో కేసు వేసి వారికి బెయిల్ వచ్చేలా చేసినా.. మానసిక వైకల్యంతో బాధపడుతున్నారని చెప్పి.. ఆసుపత్రుల్లోనే ఉంచేస్తున్నారు. సదరు ఆసుపత్రుల్లోని వైద్యులు కూడా సీసీపీ చెప్పినట్లుగానే వైద్యం చేస్తూ.. బలవంతంగా వారితో అనవసరపు మందులు తినిపిస్తున్నట్లు నివేదికలో పేర్కొన్నారు.

దేశంలోని పలు ప్రావిన్సులకు చెందిన 99 మంది హక్కుల కార్యకర్తలను గత కొన్నేళ్లుగా ఇలా నిర్బంధించి పెట్టింది. ఇలా చేయడం వల్ల సీసీపీకి మూడు రకాలుగా లబ్ది పొందుతుందని నివేదికలో పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలపై నిరసన తెలపకుండా, మీడియాతో మాట్లాడకుండా సదరు కార్యకర్తలను అణచి వేస్తోంది. రెండోది.. వీళ్ల అణచివేత చూసిన తర్వాత ఇతరుల నోర్లను కూడా మూయించి, ప్రభుత్వంపై వ్యతిరేకత అనేది కనపడకుండా చేస్తోంది. ఇక మూడోది.. మానసిక వైకల్యం అనే నెపంతో వారిని ఒంటరి చేయడం ద్వారా కార్యకర్తల్లో భయాందోళన పుట్టిస్తోంది. వారిని మానసికంగా బలహీనులుగా చేస్తోందని నివేదిక స్పష్టం చేసింది.

ఇక మానసిక వైకల్యం ఉందనే నెపంతో ఆసుపత్రుల్లో జాయిన్ చేసిన కార్యకర్తలను అలా వదిలేయకుండా టార్చర్ పెడుతోంది. షాక్ ట్రీట్‌మెంట్‌ ఇస్తూ.. వారిని మానసికంగా, శారీరకంగా బలహీనులుగా మార్చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. హుబే ప్రావిన్స్‌కు చెందిన జియాంగ్ అనే కార్యకర్తను ఇలాగే 2019లో మానసిక వైద్యశాలలో పెట్టి తీవ్రంగా హింసించింది. అక్కడ తనకు తరచూ ఎలక్ట్రిక్ షాకులు ఇచ్చేవారని, దాని వల్ల తాను పూర్తిగా బలహీనపడ్డానని వెల్లడించాడు. ఏరోజైనా కాస్త హుషారుగా కనిపిస్తే తమకు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి మూలన కూర్చోబెట్టే వాళ్లని అతడు ఆవేదనగా చెప్పాడు. కనీసం టాయిలెట్‌కు కూడా వెళ్లే శక్తి లేకుండా టార్చర్ పెట్టేవారని అతడు చెప్పాడు. టార్చర్‌తో పాటు మిస్టరీ డ్రగ్స్‌ను మెడికల్ సిబ్బంది తమకు ఇచ్చేవారని బాధితులు చెప్తున్నారు. అసలు తమకు ఏ మెడిసిన్ ఇస్తున్నారో కూడా చెప్పేవారు కాదని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా హక్కుల కార్యకర్తలపై జరుగుతున్న దారుణాల్లో చైనానే అగ్రస్థానంలో ఉన్నట్లు నివేదిక పేర్కొన్నది. అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు పూర్తి అధికారాలు వచ్చిన తర్వాత ఈ అరాచకాలు మరింతగా పెరిగాయని తెలిపింది.

Next Story