Telugu Global
International

తైవాన్‌పై క‌మ్ముకున్న యుద్ధ మేఘాలు..

29 యుద్ధ విమానాలు త‌మ గ‌గ‌న‌త‌లంలోకి చొర‌బ‌డ్డాయ‌ని తైవాన్ ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ తెలిపింది. వాటిలో అధునాత‌న జెట్ ఫైట‌ర్లు ఉన్నాయ‌ని వెల్ల‌డించింది.

తైవాన్‌పై క‌మ్ముకున్న యుద్ధ మేఘాలు..
X

తైవాన్‌పై యుద్ధ మేఘాలు క‌మ్ముకున్నాయి. ఆ చిన్న దేశాన్ని క‌బ‌ళించేందుకు డ్రాగ‌న్ దేశం త‌హ‌త‌హ‌లాడుతోంది. ప్ర‌స్తుతం తైవాన్ చుట్టూ చైనాకు చెందిన యుద్ధనౌక‌లు, ఫైట‌ర్ జెట్లు మోహ‌రించి ఉన్నాయి. ఆ ప్రాంతంలో చైనా చేస్తున్న విన్యాసాలు యుద్ధ క్షేత్రాన్ని త‌ల‌పిస్తున్నాయి. ఇవ‌న్నీ సైనిక విన్యాసాలే అని చెబుతున్న‌ప్ప‌టికీ.. అవి యుద్ధ స‌న్నాహ‌క ఏర్పాట్లేన‌ని అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

త‌మ స్వ‌తంత్ర ఉనికి కోసం తైవాన్ ప్ర‌య‌త్నిస్తుండ‌గా.. దానికి స‌సేమిరా అంటున్న చైనా.. ఇటీవ‌ల తైవాన్ అమెరికా సంబంధాల‌పై తీవ్ర ఆగ్ర‌హంతో ఉంది. తాజాగా తైవాన్ అధ్య‌క్షురాలు త్సాయి ఇంగ్ వెన్ అమెరికా ప‌ర్య‌ట‌న‌తో డ్రాగ‌న్ దేశం అగ్గి మీద గుగ్గిల‌మ‌వుతోంది. అంతేకాదు త‌మ‌ది స్వ‌యంపాలిత ప్ర‌జాస్వామ్య దేశ‌మ‌ని తైవాన్ అధ్య‌క్షురాలు ప్ర‌క‌టించ‌డంతో చైనా తీవ్రంగా మండిప‌డుతోంది.

ఈ నేప‌థ్యంలోనే శ‌నివారం ఆ దేశానికి అన్ని వైపులా యుద్ధనౌక‌లు, ఫైట‌ర్ జెట్ల‌ను చైనా మోహ‌రించింది. శ‌నివారం 8 యుద్ధ నౌక‌లు, 42 ఫైట‌ర్ జెట్‌లు తైవాన్ స‌రిహ‌ద్దులోకి రావ‌డం గ‌మ‌నార్హం. వాటిలో 29 యుద్ధ విమానాలు త‌మ గ‌గ‌న‌త‌లంలోకి చొర‌బ‌డ్డాయ‌ని తైవాన్ ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ తెలిపింది. వాటిలో అధునాత‌న జెట్ ఫైట‌ర్లు ఉన్నాయ‌ని వెల్ల‌డించింది. దీనికితోడు తైవాన్ జ‌ల‌సంధిలో చైనా త‌నిఖీలు చేప‌ట్ట‌డం క‌వ్వింపు చ‌ర్యేన‌ని అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇప్ప‌టికే ఉక్రెయిన్‌-ర‌ష్యా యుద్ధంతో ప్ర‌పంచ దేశాలు ఆర్థిక మాంద్యంతో అల్లాడుతుండ‌గా.. ఇప్పుడు తైవాన్‌పై చైనా ప్ర‌ద‌ర్శిస్తున్న దూకుడుతో ఆందోళ‌న‌కు గుర‌వుతున్నాయి.

First Published:  9 April 2023 4:24 AM GMT
Next Story