Telugu Global
International

బ్రిటన్: లిజ్ ట్ర‌స్ కేబినెట్ కొత్త రికార్డు!

బ్రిటన్ కొత్త మంత్రివర్గంలోకి ఈ సారి ఎక్కువగా మైనార్టీ వర్గీయులను తీసుకున్నారు. బ్రిటిష్ కొత్త ప్ర‌ధాన మంత్రిగా లిజ్ ట్రస్ బాధ్యతలు చేపట్టగానే ఎన్నడూ లేని విధంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

బ్రిటన్: లిజ్ ట్ర‌స్ కేబినెట్ కొత్త రికార్డు!
X

బ్రిటిష్ కొత్త ప్ర‌ధాన మంత్రి లిజ్ ట్రస్ వినూత్న రీతిలో త‌న మంత్రివర్గాన్నిఎన్నుకున్నారు. దేశంలోని నాలుగు ముఖ్యమైన మంత్రి పదవులలో ఒకదానిలో కూడా శ్వేత జాతీయుడు కూడా లేక‌పోవ‌డం విశేషం. బ్రిట‌న్ చ‌రిత్ర‌లో ఇలా జ‌ర‌గ‌డం ఇదే తొలిసారి కావ‌డం గ‌మ‌నార్హం. కీల‌క‌మైన ఆర్ధిక మంత్రిగా ట్రస్ క్వాసీ క్వార్టెంగ్‌ను నియ‌మించారు. ఆయ‌న కుటుంబం 1960ల‌లో బ్రిట‌న్ కు ఘ‌నా నుంచి వ‌ల‌స వ‌చ్చింది. దీంతో ఆయ‌న బ్రిట‌న్ లో తొలి నల్లజాతి ఆర్థిక మంత్రిగా చ‌రిత్ర‌కెక్కారు. మ‌రో కీల‌క‌మైన శాఖ‌ విదేశాంగ శాఖకు న‌ల్ల జాతీయుడైన జేమ్స్ క్లీవర్లీ ని మంత్రిగా నియ‌మించారు. ఆయ‌న తండ్రి శ్వేత జాతీయుడు కాగా త‌ల్లి సియెర్రా లియోన్ నల్లజాతి మ‌హిళ అవ‌డంతో ఆయ‌న మిశ్ర‌మ జాతి వాడిగా చిన్న త‌నం నుంచి ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నారు. దీంతో ఆయ‌న న‌ల్ల జాతి ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించ‌డానికి వారి అభివృద్ధికి పార్టీ మ‌రింత చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని వాదించేవారు.

సుయెల్లా బ్రేవర్‌మాన్ హోం శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. సుయెల్లా త‌లిదండ్రులు ఆరు ద‌శాబ్దాల క్రితం కెన్యా, మారిష‌స్ ల‌నుంచి బ్రిట‌న్ కు వ‌ల‌స వ‌చ్చారు. ప్రీతి పటేల్ తర్వాత ఈ ప‌ద‌వి చేప‌ట్టిన రెండవ మైనారిటీ జాతి వ్య‌క్తిగా నిలిచారు. ఈ ప‌ద‌విలో ఆమె పోలీసు, ఇమ్మిగ్రేషన్ వ్య‌వ‌హారాల‌కు సంబందించిన బాధ్యతలు నిర్వ‌ర్తిస్తారు.

ఇటీవలి సంవత్సరాలలో పార్లమెంటుకు మరింత వైవిధ్యమైన అభ్యర్థులను ఎన్నుకునేందుకు కన్జర్వేటివ్ పార్టీ చేసిన కృషికి నిద‌ర్శ‌నం ఈ వైవిద్య‌మైన కొత్త కేబినెట్ . బ్రిటీష్ ప్రభుత్వాలు కొన్ని దశాబ్దాల క్రితం వరకు ఎక్కువగా శ్వేతజాతీయులతోనే రూపొందేవి. భార‌త దేశ మూలాలు గ‌ల రిషి సునాక్ బోరిస్ జాన్స‌న్ కేబినెట్ లో ఆర్ధిక మంత్రిగా ప‌నిచేశారు. అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ఆయ‌న లిజ్ ట్ర‌స్ తో పోటీ ప‌డి ర‌న్న‌ర్ అప్ గా నిలిచారు.

"రాజకీయాలు వేగాన్నిపుంజుకుంటున్నాయి. ఇప్పుడు ఈ వైవిధ్యాన్ని సాధారణమైనదిగా పరిగణిస్తాము. అయితే ఈ వేగ‌వంత‌మైన మార్పు మాత్రం అసాధారణమైనది." అని నాన్-పార్టీసన్ థింక్-ట్యాంక్ బ్రిటిష్ ఫ్యూచర్ డైరెక్టర్ సుందర్ కట్వాలా అన్నారు.

అయితే, న్యాయవ్యవస్థ, సివిల్ సర్వీస్, సైన్యంలోని ఉన్నత ర్యాంక్‌లలో ఇప్పటికీ తెల్లజాతీయులే ఉన్నారు. వైవిధ్యం కోసం ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని పార్టీ ప్ర‌చారం చేసుకుంటున్న‌ప్ప‌ట‌కీ ,పార్లమెంటులోని కన్జర్వేటివ్ సభ్యులలో నాలుగింట ఒకవంతు మాత్రమే మహిళలు, 6 శాతం మంది మాత్ర‌మే మైనారిటీ నేపథ్యాల నుండి వ‌చ్చినవారు ఉన్నారు

First Published:  7 Sep 2022 9:56 AM GMT
Next Story