Telugu Global
International

బెజోస్‌నే వెన‌క్కి నెట్టిన అదానీ..! - ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానానికి ఎగ‌బాకిన వైనం

అదానీ నిక‌ర విలువ 2022లో ఇప్ప‌టివ‌ర‌కు 70 బిలియన్ డాల‌ర్లకు పైగా పెర‌గ‌డం గ‌మ‌నార్హం. ఈ ఏడాది నిక‌ర విలువ పెరిగిన ప్ర‌పంచంలోని టాప్ టెన్ సంప‌న్న వ్య‌క్తుల్లో అదానీ ఒక్క‌రే ఉండ‌టం విశేషం.

బెజోస్‌నే వెన‌క్కి నెట్టిన అదానీ..! - ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానానికి ఎగ‌బాకిన వైనం
X

భార‌తీయ బిలియ‌నీర్‌, పారిశ్రామిక‌వేత్త‌, అదానీ గ్రూప్ చైర్మ‌న్ గౌత‌మ్ అదానీ ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానానికి ఎగ‌బాకారు. ఇప్ప‌టివ‌ర‌కు రెండో స్థానంలో ఉన్న అమెజాన్ అధిప‌తి జెఫ్ బెజోస్‌ను వెన‌క్కి నెట్టి అరుదైన ఘ‌న‌త సాధించారు. దీంతో ఆసియాలోనే ఈ ఘ‌న‌త సాధించిన తొలి వ్య‌క్తిగా నిలిచారు.

ఫోర్బ్స్ రియ‌ల్‌టైమ్ బిలియ‌నీర్ల జాబితా ప్ర‌కారం.. 2022 సెప్టెంబ‌ర్ 16 నాటికి గౌత‌మ్ అదానీ నిక‌ర ఆదాయం విలువ 155.7 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉంది. ఇదే క్ర‌మంలో విలాస వ‌స్తువుల కంపెనీ ఎల్‌వీఎంహెచ్ అధినేత బెర్నార్డ్ ఆర్నాల్ట్ 155.2 బిలియ‌న్ డాల‌ర్ల‌తో మూడో స్థానంలో, ఇక జెఫ్ బెజోస్ 149.7 బిలియ‌న్ డాల‌ర్ల‌తో నాలుగో స్థానంలో నిల‌వ‌డం గ‌మ‌నార్హం. 273.5 బిలియ‌న్ డాల‌ర్ల నిక‌ర విలువ‌తో టెస్లా సీఈవో ఎలాన్ మ‌స్క్ టాప్ ప్లేస్‌లో కొన‌సాగుతున్నారు.

అదానీ నిక‌ర విలువ 2022లో ఇప్ప‌టివ‌ర‌కు 70 బిలియన్ డాల‌ర్లకు పైగా పెర‌గ‌డం గ‌మ‌నార్హం. ఈ ఏడాది నిక‌ర విలువ పెరిగిన ప్ర‌పంచంలోని టాప్ టెన్ సంప‌న్న వ్య‌క్తుల్లో అదానీ ఒక్క‌రే ఉండ‌టం విశేషం. గురువారం మార్కెట్లు ముగిసే స‌మ‌యానికి అదానీ గ్రూప్ లోని న‌మోదిత సంస్థ‌ల మార్కెట్ విలువ రూ.20.11 లక్ష‌ల కోట్లుగా ఉంది. అదానీ గ్రూప్‌లో మొత్తం ఏడు కంపెనీలు స్టాక్ ఎక్స్‌ఛేంజీల్లో న‌మోద‌య్యాయి. వాటిలో నాలుగు సంస్థ‌ల షేరు ధ‌ర ఈ ఏడాది రెండు రెట్ల‌కు పైగా పెరిగింది.

ఆసియాలోనే అత్యంత సంప‌న్న వ్య‌క్తిగా అదానీ ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో అవ‌త‌రించారు. ఏప్రిల్ క‌ల్లా ఆయ‌న సంప‌ద విలువ రూ.100 కోట్ల‌ను దాట‌డంతో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌ను వెన‌క్కి నెట్టి.. ప్ర‌పంచ కుబేరుల్లో నాలుగో స్థానానికి చేరారు. జెఫ్ బెజోస్‌, బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ను అధిగ‌మించి ఇప్పుడు రెండో స్థానానికి చేర‌డం విశేషం.

First Published:  16 Sep 2022 10:15 AM GMT
Next Story