Telugu Global
International

సిడ్నీ చ‌రిత్ర‌లోనే నీచ‌మైన రేపిస్ట్‌.. పాపం పండింది!

2018లోనే బాలేష్ ధ‌న్‌క‌డ్ కీచ‌క ప‌ర్వం వెలుగు చూసింది. ఇత‌ర మ‌హిళ‌ల‌తో స‌న్నిహితంగా ఉన్న డ‌జ‌నుకు పైగా వీడియోల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సిడ్నీ చ‌రిత్ర‌లోనే నీచ‌మైన రేపిస్ట్‌.. పాపం పండింది!
X

అత‌ను బీజేపీ మాజీ స‌భ్యుడు.. ఓవ‌ర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీకి గ‌తంలో చీఫ్‌గా కూడా ప‌నిచేశాడు. త‌నకున్న రాజ‌కీయ బ‌లం.. ప‌ర‌ప‌తితో తాను ఏం చేసినా బ‌య‌ట‌ప‌డొచ్చ‌నుకున్నాడు.. చివ‌రికి అత‌ని పాపం పండింది. ప‌లు అత్యాచార కేసుల్లో అత‌నిపై నేరం రుజువైంది. న్యాయ‌స్థానం అత‌న్ని దోషిగా తేల్చింది. సిడ్నీ చ‌రిత్ర‌లోనే నీచ‌మైన రేపిస్టుగా అత‌న్ని అక్క‌డి మీడియా అభివ‌ర్ణించ‌డం గ‌మ‌నార్హం.

స్నేహం న‌టించి.. మ‌త్తు మందు ఇచ్చి..

ఆస్ట్రేలియాలో భార‌త క‌మ్యూనిటీకి చెందిన ప్ర‌ముఖుడు బాలేష్ ధ‌న్‌క‌డ్ (43). అత‌ను ఓ డేటా ఎక్స్‌ప‌ర్ట్‌. సిడ్నీ డౌనింగ్ సెంట‌ర్ కోర్టులో అత‌నిపై 39 అభియోగాలు న‌మోద‌య్యాయి. యువ‌తుల‌తో స్నేహం న‌టించి.. వారిని ఇంటికి, హోట‌ళ్ల‌కు తీసుకెళ్లి.. మ‌త్తు మందు ఇచ్చి మ‌రీ అత్యాచారం చేశాడ‌ని విచార‌ణ‌లో తేలింది. ఈ విధంగా ఐదుగురు కొరియ‌న్ యువ‌తుల‌ను మ‌భ్య‌పెట్టి, వారికి మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశాడ‌ని నిర్ధార‌ణ అయింది. అత్యాచారం చేస్తుండ‌గా.. ఆ దృశ్యాల‌ను త‌న సెల్ కెమెరాలో, అలారం క్లాక్‌లో దాచిన సీక్రెట్ కెమెరాలో దాచి చిత్రీక‌రించిన‌ట్టు తెలుస్తోంది.

వీడియోలు చూసి విస్తుపోయిన జ్యూరీ..

2018లోనే బాలేష్ ధ‌న్‌క‌డ్ కీచ‌క ప‌ర్వం వెలుగు చూసింది. ఇత‌ర మ‌హిళ‌ల‌తో స‌న్నిహితంగా ఉన్న డ‌జ‌నుకు పైగా వీడియోల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అత‌ని మృగ‌చేష్ట‌ల‌తో కూడిన ఆ వీడియోల‌ను చూసి జ్యూరీ సైతం విస్తుపోయింది. ఈ నేప‌థ్యంలో అత‌న్ని రాజ‌కీయ బ‌లం ఉన్న మాన‌వ మృగంగా న్యాయ‌స్థానం అభివ‌ర్ణించింది.

బెయిల్‌ నిరాక‌ర‌ణ‌...

సోమ‌వారం ఈ కేసు విచార‌ణ సంద‌ర్భంగా జ‌డ్జి మైకేల్ కింగ్.. బాలేష్‌కు బెయిల్ ఇచ్చేందుకు నిరాక‌రించారు. అత‌ను మ‌ళ్లీ మే నెల‌లో న్యాయ‌స్థానం ముందు హాజ‌రుకావాల్సి ఉంటుంది. త్వ‌ర‌లోనే అత‌ని శిక్ష‌లు ఖ‌రార‌య్యే అవ‌కాశ‌ముంది.

First Published:  25 April 2023 3:56 AM GMT
Next Story