Telugu Global
International

అఫ్గాన్‌ వరదల్లో 68 మంది మృతి

వరదల కారణంగా ఘోర్‌ ప్రావిన్స్‌లో పరిస్థితులు దారుణంగా మారాయని, 2500కు పైగా కుటుంబాలు ప్రభావితమయ్యాయని ఐక్యరాజ్యసమితి ఆహార సంస్థ ’ఎక్స్‌’ వేదికగా తెలిపింది.

అఫ్గాన్‌ వరదల్లో 68 మంది మృతి
X

అఫ్గానిస్తాన్‌ వరదలతో అతలాకుతలమవుతోంది. అక్కడ కురుస్తున్న భారీ వర్షాల ప్రభావం వరదగా మారి ముంచెత్తుతోంది. ఊహించని స్థాయిలో కురిసిన భారీ వర్షాలకు మెరుపు వరదలు తోడై బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ వరదల్లో చిక్కుకొని తాజాగా 68 మంది మృతిచెందినట్టు తాలిబన్‌ అధికారులు వెల్లడించారు.

ఇక పశ్చిమ ప్రావిన్స్‌లో భారీ స్థాయిలో వరద పోటెత్తడంతో.. 50 మంది ప్రాణాలు కోల్పోయారని గవర్నర్‌ అధికార ప్రతినిధి తెలిపారు. రాజధాని సహా పలు ప్రాంతాల్లో వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయని, దీంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని చెప్పారు. వేల ఎకరాల్లో వ్యవసాయ క్షేత్రాలు దెబ్బతిన్నాయని వెల్లడించారు. ఉత్తర ప్రావిన్స్‌ ఫరయాబ్‌లోనూ 18 మంది మరణించగా.. మరో ఇద్దరు గాయపడినట్టు వెల్లడించారు.

వరదల కారణంగా ఘోర్‌ ప్రావిన్స్‌లో పరిస్థితులు దారుణంగా మారాయని, 2500కు పైగా కుటుంబాలు ప్రభావితమయ్యాయని ఐక్యరాజ్యసమితి ఆహార సంస్థ ’ఎక్స్‌’ వేదికగా తెలిపింది. వారం రోజులుగా దేశవ్యాప్తంగా భారీ వర్షాల ధాటికి 300 మందికి పైగా మరణించారని వెల్లడించింది. ప్రాణాలతో బయటపడిన వారికి ఆశ్రయం కరువైందని పేర్కొంది.

First Published:  19 May 2024 2:52 AM GMT
Next Story