Telugu Global
International

నైజీరియాలో నరమేధం.. సాయుధమూకల కాల్పుల్లో 160 మంది మృతి

అనేక సంవత్సరాలుగా ఈ ప్రాంతాల్లో మతపరమైన, జాతి పరమైన విబేధాల వల్ల ఘర్షణలు జరుగుతున్నాయి. ముఖ్యంగా వాయవ్య, మధ్య నైజీరియాలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుంటాయని అక్కడి అధికారులు చెబుతున్నారు.

నైజీరియాలో నరమేధం.. సాయుధమూకల కాల్పుల్లో 160 మంది మృతి
X

సాయుధమూకల అరాచక దాడులతో నైజీరియా గడగడలాడిపోతోంది. మధ్య నైజీరియాలోని పలు ప్రాంతాల్లో సాయుధమూకలు జరిపిన వరుస కాల్పుల్లో ఏకంగా 160 మంది మృతిచెందారు. ప్రజలే లక్ష్యంగా ‘బండిట్స్‌’ అని పిలవబడే పిలిచే సాయుధ సమూహాలు అరాచక దాడులకు తెగబడినట్టుగా స్థానిక ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఇళ్లలోకి చొరబడి ప్రజలను చిత్రహింసలకు గురిచేశారు. ఆదివారం సాయంత్రం జరిగిన కాల్పుల్లో మొదట 160 మంది మృతి చెందినట్లు ప్రకటించారు. అయితే, ఈ మారణకాండ సోమవారం కూడా కొనసాగడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ ఘటనలో మరో 300 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారని, వారంతా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు.

కొన్ని తెగలకు చెందిన ప్రజలే లక్ష్యంగా సాయుధ మూకలు మారణకాండకు తెగపడ్డాయి. దాడి సమయంలో సెంట్రల్ నైజీరియాలోని ఇళ్లకు నిప్పు పెట్టారని, ఇళ్లలోకి చొరబడి ప్రజలను చిత్రహింసలకు గురిచేశారని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. కనీసం 20 వేర్వేరు కమ్యూనిటీలపై దాడులు చేసి ఇళ్లకు నిప్పంటించినట్లు తెలుస్తోంది. అలాగే 300 మందికి పైగా గాయపడిన వారిని బోకోస్, జోస్, బార్కిన్ లాడిలోని ఆసుపత్రులకు తరలించారు. స్థానిక రెడ్‌క్రాస్ సమాచారం మేరకు బొక్కోస్ ప్రాంతంలోని 18 గ్రామాలలో 104 మరణాలు, బార్కిన్ లాడి ప్రాంతంలోని అనేక గ్రామాలలో కనీసం 50 మంది మరణించినట్లు తెలుస్తోంది.

అనేక సంవత్సరాలుగా ఈ ప్రాంతాల్లో మతపరమైన, జాతి పరమైన విబేధాల వల్ల ఘర్షణలు జరుగుతున్నాయి. ముఖ్యంగా వాయవ్య, మధ్య నైజీరియాలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుంటాయని అక్కడి అధికారులు చెబుతున్నారు. అటవీ ప్రాంతాల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకున్న సంచార జాతులకు చెందిన కొన్ని సాయుధమూకలు గ్రామాలపై తరచూ దాడులు చేసి దోపిడీలకు పాల్పడుతుంటాయని తెలిపారు. వీరు స్థానికుల్ని అపహరించి సొమ్మును డిమాండ్‌ చేస్తుంటారు. 2009 నుంచి ఇప్పటి వరకు అనేకసార్లు ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇటువంటి ఘటనలతో ఇప్పటివరకు వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇక తాజా దాడిలో ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు ఊచకోత కొనసాగింది.

First Published:  26 Dec 2023 5:05 AM GMT
Next Story