Telugu Global
International

Sudan:మిలటరీ, పారా మిలటరీ మధ్య ఘర్షణల్లో 200 మందిమృతి, 1800 మందికి గాయాలు

RSF అనేక విమానాశ్ర‌యాలను స్వాధీనం చేసుకుంది. పలు పట్టణాలపై వైమానిక దాడులు జరుగుతున్నాయి. అనేక ఆస్పత్రులు నాశ‌నమయ్యాయి. రంజాన్ మాసం చివరి రోజులు కావడంతో ప్రజలు ఆహారం కోసం అల్లాడుతున్నారు.

Sudan:మిలటరీ, పారా మిలటరీ మధ్య ఘర్షణల్లో 200 మందిమృతి, 1800 మందికి గాయాలు
X

అంతంత మాత్రంగా సూడాన్ ఆర్ధిక పరిస్థితి మరింత దిగజారిపోతోంది. సైన్యం, పారామిలిటరీల మధ్య జరుగుతున్న పోరులో దేశం అతలాకుతలమవుతోంది. ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు 200 మంది మృతి చెందగా 1800 మంది గాయాలపాలయ్యారు. ఇందులో అత్యధికులు పౌరులే ఉన్నారు.మరణించిన వారిలో పిల్లలు, స్త్రీలు ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

2021 తిరుగుబాటులో అధికారాన్ని చేజిక్కించుకున్న సుడాన్ ఆర్మీ చీఫ్ అబ్దెల్ ఫత్తా అల్-బుర్హాన్, పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్స్ (RSF)కు నాయకత్వం వహిస్తున్న మొహమ్మద్ హమ్దాన్ డాగ్లో ల మధ్య కొన్ని వారాలుగా సాగుతున్న అధికార పోరాటం శనివారం హింసాత్మకంగా మారింది.

RSF అనేక విమానాశ్ర‌యాలను స్వాధీనం చేసుకుంది. పలు పట్టణాలపై వైమానిక దాడులు జరుగుతున్నాయి. అనేక ఆస్పత్రులు నాశ‌నమయ్యాయి. రంజాన్ మాసం చివరి రోజులు కావడంతో ప్రజలు ఆహారం కోసం అల్లాడుతున్నారు. దేశంలో అనేక షాపులు మూసి వేశారు. తెరిచి ఉన్న అవుట్‌లెట్‌ల వద్ద రొట్టె, పెట్రోల్ కోసం ప్రజలు భయం భయంగానే క్యూలు కడుతున్నారు. విద్యుత్తు అంతరాయంతో నగరవాసులు అనేక‌ ఇబ్బందులు పడుతున్నారు.

ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకున్నప్పటికీ ఇరు వర్గాలు యుద్దం ఆపడం లేదు. సోమవారం ప్రారంభంలో, UN సెక్రటరీ-జనరల్ ఆంటోనియో గుటెర్రెస్, సుడాన్ లో పోరాడుతున్న ఇరు వర్గాలను తక్షణమే పోరాటం నిలిపివేయాలని కోరారు. ఈ పోరాటం ఇలాగే కొనసాగడం సూడాన్ కే కాక చుట్టూ ఉన్న దేశాలకు కూడా వినాశకరమైనది అని ఆయన హెచ్చరించారు.

అమెరికా కూడా ఈ ఘర్షణలు ఆపడానికి ప్రయత్నిస్తోంది. యుఎస్ విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ మంగళవారం మాట్లాడుతూ తాను ఇద్దరు జనరల్స్‌తో మాట్లాడానని కాల్పు విరమణ తక్షణ అవసరాన్ని నొక్కిచెప్పానని అన్నారు.

సూడాన్‌లోని యూరోపియన్ యూనియన్ రాయబారిపై సోమవారం కార్టూమ్‌లోని అతని ఇంటిలో దాడి జరిగింది.

రాజధాని ఖార్టూమ్ లో అనేక ఆస్పత్రులు దెబ్బ తిన్నాయి. గాయపడ్డవారికి చికిత్స అందిస్తున్న అనేక ఆస్పత్రుల్లో రక్తం తో సహా ముఖ్యమైన సామాగ్రి ఖాళీ అయ్యింది. దీంతో సరైన చికిత్స అందక అనేక మంది మరణిస్తున్నారని వైద్యులు చెప్తున్నారు.

"ఈ పోరాటం వల్ల ఇప్పటికే దిగజారిపోయిన సూడాన్ పరిస్థితి మరింత దిగజారింది. UN ఏజెన్సీలు, ఇతర వాలంటీర్ సంస్థలు సుడాన్ అంతటా 250 కంటే ఎక్కువ చోట్ల కార్యక్రమాలను తాత్కాలికంగా మూసివేయవలసి వచ్చింది" అని UN అత్యవసర సహాయ సమన్వయకర్త మార్టిన్ గ్రిఫిత్స్ అన్నారు.

ఖార్టూమ్‌కు పౌర విమానాలు ఏవీ రావడం లేదు, పోరాటం వల్ల విమానాలు దెబ్బతిన్నాయి. కాగా, ఇరు వర్గాల మధ్య పోరాటం ఆగే పరిస్థితులు కనిపించడం లేదని యుద్ద నిపుణులు అంచనా వేస్తున్నారు.

First Published:  18 April 2023 4:51 AM GMT
Next Story