Telugu Global
International

శ్రీలంక బాటలో మరో డజను దేశాలు... ఆర్థిక సంక్షోభంతో అతలాకుతలం

శ్రీలంక ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయి ప్రజలకు తినడానికి ఆహారం కూడా లేని పరిస్థితి నెలకొంది. లీటర్ పెట్రోల్ 500 రూపాయలకు , టమాటాలు కిలో 500 రూపాయలకు, కిలో బియ్యం 350 రూపాయలకు కొనాల్సిన పరిస్థితి వచ్చిందక్కడ.

శ్రీలంక బాటలో మరో డజను దేశాలు... ఆర్థిక సంక్షోభంతో అతలాకుతలం
X

శ్రీలంక ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయి ప్రజలకు తినడానికి ఆహారం కూడా లేని పరిస్థితి నెలకొంది. లీటర్ పెట్రోల్ 500 రూపాయలకు, టమాటా కిలో 500 రూపాయలకు, కిలో బియ్యం 350 రూపాయలకు కొనాల్సిన పరిస్థితి వచ్చిందక్కడ. ఇక గ్యాస్ అయితే దొరికే పరిస్థితే లేదు. ఈ నేపథ్యంలో ప్రజల తిరుగుబాటుతో అధ్యక్షుడు దేశం విడిచి పారిపోయాడు. ఈ ప‌రిస్థితుల్లో శ్రీలంకకు పర్యాటకుల రూపంలో వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. విదేశీ మారక నిల్వలు పూర్తిగా అడుగంటి పోయాయి. దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడే శ్రీలంక ఇప్పుడు ఏ వస్తువూ దిగుమతి చేసుకునే పరిస్థితుల్లో లేదు.

ఇదిప్పుడు ఒక్క శ్రీలంక పరిస్థితే కాదు కొంచెం హెచ్చు తగ్గులతో ప్రపంచంలోని డజనుకు పైగా దేశాల పరిస్థితి ఇలాగే తయారయ్యింది. ఉక్రెయిన్, పాకిస్థాన్, ఘనా, అర్జెంటీనా, ట్యునీషియా, కెన్యా, ఈజిప్ట్, ఎల్ సాల్వెడార్, బెలారస్, ఈక్వెడార్, ఇథియోపియా, నైజీరియా తదితర దేశాల ఆర్థిక వ్యవస్థలు పూర్తిగా దిగజారిపోయాయి. అక్కడ ప్రస్తుతం కొనాలంటే కొరివి అమ్మాలంటే అడవి లాంటి పరిస్థితులున్నాయి. రుణాల ఊబిలో కూరుకపోయిన ఆయా దేశాలు తమ ఆదాయాన్నంతా అప్పులపై వడ్డీలు కట్టడానికే ఖర్చు చేస్తున్నాయి. విదేశీ మారకద్రవ్యం లేక దిగుమతులు ఆగిపోయాయి.

ఘనా

ఇప్పుడీ దేశం భరించలేనంత అప్పుల పాలై కునారిల్లుతోంది. అప్పులను తీర్చడానికి మళ్ళీ మళ్ళీ అప్పులు చేస్తూ వాటిని తీర్చే శక్తిలేని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఆ దేశ జీడీపీలో అప్పుల రేషియో 85 శాతానికి చేరింది. ద్రవ్యోల్బణం 30 శాతానికి చేరింది. ఆదేశంలో పన్నుల ద్వారా, ఇతర మార్గాల ద్వారా వచ్చే ఆదాయాల్లో సగానికి పైగా రుణాల చెల్లింపులకే ఖర్చుపెడుతోంది. ఇప్పుడా దేశానికి అప్పు పుట్టే పరిస్థితి కూడా లేదు.

కెన్యా

ఇప్పుడీ దేశం తన ఆదాయంలో 30 శాతాన్ని అప్పులకే చెల్లిస్తోంది. ఈ దేశ బాండ్లు సగం మేర విలువను కోల్పోయాయి. 2 బిలియన్ డాలర్ బాండ్లు 2024లో చెల్లింపులకు రానున్నాయి.

అర్జెంటీనా

ఈ దేశం విపరీతంగా విదేశీ రుణాలు తీసుకుంది. ఆదాయంలో ఎక్కువ భాగం వాటిని కట్టడానికే సరిపోతుంది. ఆ దేశ కరెన్సీ పెసో 50 శాతం డిస్కౌంట్ రేటుకు బ్లాక్ మార్కెట్లో ట్రేడ్ అవుతోంది. విదేశీ మారకం నిల్వలు చాలా తక్కువగా ఉండటంతో కావాల్సిన వస్తువులు దిగుమతి చేసుకోలేని పరిస్థితి నెలకొంది. 2024 వరకు ఈ దేశం ఎలాగో ఓ లాగ నెట్టుకు రాగలదని ఆపైన కష్టమే అని ఆర్థిక నిపుణుల అభిప్రాయం.

ఎల్ సాల్వెడార్

ఈ దేశం ప్రస్తుతం అప్పు చేస్తే తప్ప నడవలేని పరిస్థితి నెలకొంది. అయితే ఈ దేశానికి అప్పులు ఇవ్వడానికి ప్రస్తుతం ఏ సంస్థా, దేశమూ ముందుకు రావడంలేదు. ఐఎంఎఫ్ కూడా తలుపులు మూసేసింది. ఇక్కడ ఆరు నెలల్లో గడువు తీరే బాండ్లు 30 శాతం తక్కువకు ట్రేడ్ అవుతుంటే, దీర్ఘకాల బాండ్లు 70 శాతం డిస్కౌంట్ కే లభిస్తున్నాయి.

ఈజిప్ట్

ఈ దేశ అప్పులు జీడీపీలో 95 శాతానికి చేరాయి. వచ్చే ఐదేళ్లలో ఈ దేశం 100 బిలియన్ డాలర్ల రుణాలను చెల్లించాల్సిన పరిస్థితి. విదేశీ మారక ద్రవ్యం పూర్తిగా ఖాళీ అయ్యింది.

పాకిస్థాన్

ఈ దేశం ఆదాయంలో 40 శాతం చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించడానికే సరిపోతోంది. విదేశీ మారకం నిల్వలు 9.8 బిలియన్ డాలర్లకు తగ్గిపోయాయి. పాక్ రూపీ విలువ‌ భారీగా కోల్పోయింది. ప్రస్తుతం రుణం కోసం ఆశగా ఐఎంఫ్ వైపు చూస్తోంది.

ఈక్వెడార్

ఈ దేశం తాను తీసుకున్న అప్పులను చెల్లించలేనంటూ రెండేళ్ళక్రితమే చేతులెత్తేసింది. అక్కడిప్పుడు ఆహారం దొరకడం కూడా కష్టంగా మారింది. ప్రజలు పెద్ద ఎత్తున తిరగబడుతున్నారు. అధ్యక్షుడు లాసో దిగిపోవాలంటూ ఆందోళనకారులు హింసకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇంధనం, ఆహారంపై సబ్సిడీ ఇస్తున్నప్పటికీ ప్రజల్లో కొనుగోలు శక్తి అడుగంటింది.

ఉక్రెయిన్

రష్యాతో పోరాటంలో చిక్కుకపోయిన ఈ దేశం ఆర్థిక పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది. ఈ పరిస్థితిని పాశ్చాత్య దేశాలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి కానీ ఉక్రెయిన్ మాత్రం శిథిలమై పోతోంది. ఈ ఏడాది సెప్టెంబర్ లో 1.2 బిలియన్ డాలర్లను ఈ దేశం చెల్లించాల్సి ఉంది. ప్రస్తుత యుద్ద పరిస్థితుల్లో అది అనుమానమే. ఇప్పటికే ఆదేశానికి ఉన్న 20 బిలియన్ డాలర్ల విదేశీ రుణాలను పునరుద్ధరించుకోవడం తప్ప మరో మార్గం లేదు. మరి అది జరుగుతుందా లేదా అనేది వేచి చూడాలి.

బెలారస్

రష్యా, ఉక్రెయిన్ పోరాటం మధ్యలో ఈ దేశం చిక్కుకుంది. ఈ యుద్దంలో బెలారస్ రష్యాకు మద్దతుగా నిలబడటంతో పాశ్చాత్య దేశాల ఆంక్షల దెబ్బ రుచి చూడాల్సి వస్తోంది. పాశ్చాత్య దేశాల ఆంక్షల దెబ్బకు రష్యా సైతం రుణాలను సకాలంలో చెల్లించలేకపోతోదంటే ఇక చిన్న దేశమైన బెలారస్ పరిస్థితి ఊహించవచ్చు. ఒకవైపు అప్పులు, మరో వైపు ఆంక్షల మూలంగా అవసరమైన వస్తువులు దిగుమతి చేసుకోలేక పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో బెలారస్ రుణాలు కూడా తిరిగి చెల్లించగలదా అన్న సంశయం కొనసాగుతోంది

ట్యునీషియా

ప్రపంచంలోనే ప్రభుత్వరంగంలో అత్యధిక వేతనాలు ఇస్తున్న దేశం ఇది. బడ్జెట్ లో ఎక్కువ భాగం జీతాలకే ఖర్చు చేయాల్సి వస్తోంది. బడ్జెట్ లో 10 శాతం లోటుతో నెట్టుకొస్తోంది. మూడు డిఫాల్ట్ దేశాల్లో ఉక్రెయిన్, ఎల్ సాల్వెడార్ తోపాటు ట్యునీషియా కూడా ఉంది.

ఇదీ ప్రస్తుతం ప్రపంచ పరిస్థితి. ఈ పన్నెండు దేశాలు మాత్రమే ఇలా ఉన్నాయనుకుంటే పొరపాటే. కొన్ని వేళ్ళ మీద లెక్కపెట్టగలిగే అగ్రదేశాలు తప్ప మిగతా అన్ని దేశాలకు ఏదో ఓ రోజు ఈ పరిస్థితే రావచ్చంటూ ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇతరులపై ఆధారపడటం తగ్గించి ప్రతి దేశం స్వయం సమృద్ధి సాధిస్తే తప్ప మనుగడ సాగించడం కష్టమే.

First Published:  17 July 2022 3:52 AM GMT
Next Story