Telugu Global
International

పపువా న్యూగినియాలో గిరిజనుల మధ్య హింసాకాండ..64 మంది మృతి

పపువా న్యూ గినియాలో చెలరేగిన గిరిజన హింసాకాండలో పదుల సంఖ్యలో గిరిజనులు ప్రాణాలు కోల్పోయారు.

పపువా న్యూగినియాలో గిరిజనుల మధ్య హింసాకాండ..64 మంది మృతి
X

పపువా న్యూ గినియాలో చెలరేగిన గిరిజన హింసాకాండలో పదుల సంఖ్యలో గిరిజనులు ప్రాణాలు కోల్పోయారు. ప‌ర్వ‌త శ్రేణుల్లో ఉండే అంబులిన్, సికిన్ అనే రెండు గిరిజ‌న తెగ‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ జ‌రిగింది. ఓ ద‌ళం త‌మ వ‌ద్ద ఉన్న ఆయుధాల‌తో.. మ‌రో తెగ‌పై ఫైరింగ్ చేసింది. ఎంగ్వా ప్రావిన్సులో ఈ ర‌క్త‌పాతం చోటుచేసుకున్న‌ది. సోమవారం ఉదయం నాటికి వాపెనమండలోని రోడ్డు పక్కన, కొండలపై తొలుత 64 మృతదేహాలు కనిపించాయని తెలిపిన ఆస్ట్రేలియా మీడియా- ఆ తర్వాత 26 మంచి చనిపోయారని ప్రకటించింది. ప‌ర్వ‌త ప్రాంతాల్లోచాలాకాలం నుంచి వ‌ర్గ పోరు న‌డుస్తోంది. అయితే గ‌త వారం చివ‌ర‌లో జ‌రిగిన హింస మ‌రీ దారుణ‌మ‌ని అధికారులు చెబుతున్నారు.

అక్ర‌మంగా ఆ దీవిలో ఆయుధాలు వ‌చ్చిన‌ట్లు అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. కాల్పులకు దుండగులు ఎస్ఎల్ఆర్, ఏకే-47, ఎం4, ఏఆర్ 15 రైఫిల్స్ ఉపయోగించినట్టు చెబుతున్నారు. దీంతో స్థానిక గిరిజ‌న తెగ‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ మరింత తీవ్రంమైందని సమాచారం. రాజ‌ధాని పోర్ట్ మోర్సీబీకి 600 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న వాబాగ్ ప‌ట్ట‌ణంలో ఎక్క‌డ చూసినా మృత‌దేహాలు కనపడుతున్నాయి. మృతదేహాలను ట్రక్కుల్లో తరలిస్తున్నామని, ఈ హింసాకాండలో గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించామని పపువా న్యూ గినియా అధికారులు ఆస్ట్రేలియా మీడియాకు తెలిపారు. గిరిజనుల పోరు ఉద్ధృతమవుతోందన్న హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో తగిన చర్యలు తీసుకోవాలని భద్రతా బలగాలకు ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు. పపువా న్యూ గినియాలో హింసాకాండపై ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోని ఆల్బనీస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తనను ఆ వార్త కలిచివేసిందని చెప్పారు. పపువా న్యూ గినియాకు సహాయం చేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు.

పపువా న్యూగినియా ప్రభుత్వం హింసను నియంత్రించడానికి అణచివేత, మధ్యవర్తిత్వం, క్షమాభిక్ష ఇతర ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఫలితాల నివ్వలేదు. మరోవైపు దేశ జనాభా 1980 నుంచి అధికంగా పెరిగింది. దీంతో భూమి, వనరులపై గిరిజనుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ నేపపథ్యంలోనే అల్లర్లు జరుగుతున్నాయి. గ‌త ఏడాది జూలై నుంచి మూడు నెల‌ల పాట ఆ ప్రాంతంలో లాక్‌డౌన్, తరువాత కొంతకాలం క‌ర్ఫ్యూ, ట్రావెల్ ఆంక్ష‌లు విధించారు. గ‌త ఆగ‌స్టులో కూడా అక్క‌డ భారీ హింస చోటుచేసుకుంది.

First Published:  19 Feb 2024 10:06 AM GMT
Next Story