Telugu Global
International

బంగ్లాదేశ్‌లో విషాదం.. ప్యాసింజర్ రైలులో మంటలు.. ఐదుగురు సజీవదహనం

ప్రమాదం జరిగిన సమయంలో రైలులో దాదాపు 292 మంది ప్రయాణికులు ఉన్నట్లు.. ఎక్కువ మంది భారతదేశం నుంచి ఇంటికి తిరిగి వస్తున్నారని అధికారులు చెప్పారు.

బంగ్లాదేశ్‌లో విషాదం.. ప్యాసింజర్ రైలులో మంటలు.. ఐదుగురు సజీవదహనం
X

బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో విషాదకర సంఘటన జరిగింది. ప్యాసింజర్ రైలులో మంటలు చెలరేగి ఐదుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. జెస్సోర్ నుంచి రాజధాని ఢాకాకు చేరుకున్న బెనాపోల్ ఎక్స్‌ప్రెస్‌లో నాలుగు కోచ్‌లు మంటలకు ఆహుతయ్యాయి. శుక్రవారం రాత్రి ఢాకాలోని గోపీబాగ్‌ ప్రాంతంలో ఈ ఘటన జరుగగా స్థానికులు మంటల్లో కాలిపోతున్న ట్రైన్ నుంచి చాలా మంది ప్రయాణికులను ర‌క్షించారు. ప్రమాదం జరిగిన సమయంలో రైలులో దాదాపు 292 మంది ప్రయాణికులు ఉన్నట్లు.. ఎక్కువ మంది భారతదేశం నుంచి ఇంటికి తిరిగి వస్తున్నారని అధికారులు చెప్పారు. మంటలు చాలా త్వరగా వ్యాపించాయని వివరించారు.


బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. జాతీయ ఎన్నికలను బహిష్కరించాలంటూ ప్రతిపక్షాలు నిరసనలు తెలుపుతున్న సమయంలో జరిగిన ఈ ఘటనలో కుట్రకోణంపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ అగ్నిప్రమాదాన్ని విధ్వంస దాడిగా భావిస్తున్నామని పోలీసు చీఫ్ అన్వర్ హుస్సేన్ చెప్పారు. గత నెలలో కూడా బంగ్లాదేశ్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. రైలులో మంటలు చెలరేగి నలుగురు వ్యక్తులు చనిపోయిన ఆ ఘటనకు ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) కారణమని పోలీసులు, ప్రభుత్వ నేతలు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను బీఎన్‌బీ తీవ్రంగా వ్యతిరేకించింది.


ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో అవామీ లీగ్ పార్టీ ప్రతినిధిగా షేక్ హసీనా అధికారంలో ఉండగా.. దేశంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఉంది. ఈ బీఎన్పీ ఎన్నికలను పూర్తిగా బహిష్కరించింది. బంగ్లాదేశ్‌లో మొత్తం 300 సీట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో అవామీ లీగ్ 300 సీట్లకు గాను 290 సీట్లు గెలుచుకుంది. అయితే ఎలాంటి పక్షపాతం లేకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికను నిర్వహించాలంటే, ప్రధానమంత్రి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేయాలని, ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్ర‌తిప‌క్షాలు పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్త నిరసనలకు విపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి.

First Published:  6 Jan 2024 5:47 AM GMT
Next Story