Telugu Global
International

ఖాలిస్తాన్ కు వ్యతిరేకంగా కొందరు భారతీయుల‌ ప్రదర్శన... నిరసనకారులను తరిమి కొట్టిన ఖాలిస్తాన్ వాదులు

మెల్‌బోర్న్ ఫెడరేషన్ స్క్వేర్ వద్ద భారత జాతీయ జెండాలతో ప్రదర్శన‌ చేస్తున్న వారిపై ఖాలిస్తాన్ అనుకూల వాదులు కర్రలతో దాడులు చేశారు. వారి దాడితో కకావికలమైన నిరసనకారులు అక్కడి నుంచి పారిపోయారు.

ఖాలిస్తాన్ కు వ్యతిరేకంగా కొందరు భారతీయుల‌ ప్రదర్శన... నిరసనకారులను తరిమి కొట్టిన ఖాలిస్తాన్ వాదులు
X

సిక్కులకు ప్రత్యేక దేశం కోరుతూ సిఖ్స్ ఫర్ జస్టిస్ అనే సంస్థ ఆస్ట్రేలియాలో నిర్వహిస్తున్న రెఫరెండమ్ ను వ్యతిరేకిస్తూ కొందరు భారతీయులు ప్రదర్శనకు దిగారు. హిందూ దేవాలయాలపై ఖాలిస్తాన్ వాదుల దాడులను కూడా వీరు వ్యతిరేకించారు.

మెల్‌బోర్న్ ఫెడరేషన్ స్క్వేర్ వద్ద భారత జాతీయ జెండాలతో ప్రదర్శన‌ చేస్తున్న వారిపై ఖాలిస్తాన్ అనుకూల వాదులు కర్రలతో దాడులు చేశారు. వారి దాడితో కకావికలమైన నిరసనకారులు అక్కడి నుంచి పారిపోయారు. ఐదుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలు కాగా వారిని ఆస్పత్రిలో చేర్చినట్టు ఆస్ట్రేలియా టుడే నివేదించింది.

నిరసనకారులను ఖాలిస్తానీ అనుకూల వాదులు తరుముతున్న‌ వీడియో వైరల్ అయిన తర్వాత, బిజెపి నాయకుడు మంజీందర్ సింగ్ సిర్సా ఆస్ట్రేలియాలో ఖలిస్తానీ అనుకూల "భారత వ్యతిరేక కార్యకలాపాలను" ఖండించారు.

''ఆస్ట్రేలియాలో ఖలిస్తానీ అనుకూల, భారత వ్యతిరేక చర్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ కార్యకలాపాలతో దేశంలోని శాంతి, సామరస్యాలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తున్న సంఘ వ్యతిరేక శక్తులపై కఠినంగా వ్యవహరించి, దోషులను కఠినంగా శిక్షించాలి.'' అని ఆయన డిమాండ్ చేశారు

దేశంలో పెరుగుతున్న ఖలిస్థాన్ అనుకూల కార్యకలాపాలకు వ్యతిరేకంగా మెల్‌బోర్న్‌లోని ఫెడరేషన్ స్క్వేర్ వద్ద నిరసనకు ప్లాన్ చేసినట్లు ఆస్ట్రేలియాలోని భారతీయులు విక్టోరియా పోలీసులకు ముందుగానే తెలియజేసినట్లు ఆస్ట్రేలియా టుడే గతంలో నివేదించింది.

ఇదిలావుండగా, కత్తితో ఉన్న ఓ ఖలిస్థాన్ మద్దతుదారుణ్ణి పోలీసులు ఫెడరేషన్ స్క్వేర్‌లో అరెస్టు చేశారని ఆస్ట్రేలియన్ హిందూ మీడియా ట్వీట్ చేసింది.

"ఖలిస్థానీ గూండా, కత్తి పట్టుకొని ఉన్నాడు. తిరంగ జెండా పట్టుకున్న భారతీయులపై దాడి చేశాడు. ఈరోజు మెల్బోర్న్ లోని ఫెడరేషన్ స్క్వేర్ వద్ద‌ పోలీసులు ఆతన్ని అరెస్టు చేశారు" అని ఆస్ట్రేలియన్ హిందూ మీడియా ట్వీట్ చేసింది.

ఇప్పటి వరకు ఇద్దరిని అరెస్టు చేసినట్లు విక్టోరియా పోలీసులు తెలిపారు. అరెస్టయిన ఇద్దరు వ్యక్తులకు పెనాల్టీ నోటీసు జారీ చేశామని అధికారులు తెలిపారు..

కాగా మెల్ బోర్న్ లో భారతీయులపై ప్రత్యేక ఖలిస్థాన్ అనుకూల వాదుల దాడిని ఆస్ట్రేలియా విదేశాంగ శాఖ సహాయ మంత్రి టిమ్ వాట్స్ ఖండించారు. ‘‘మెల్ బోర్న్ లోని ఫెడ్ స్క్వేర్ వద్ద జరిగిన హింసను చూసి దిగ్భ్రాంతికి గురయ్యాను. ప్రజలు ఆస్ట్రేలియాలో శాంతియుతంగా నిరసన తెలియజేసుకోవచ్చు. హింసకు గానీ, విధ్వంస చర్యలకు గానీ చోటు లేదు. విక్టోరియా పోలీసులు వెంటనే స్పందించి, దర్యాప్తు చేయాలి’’అంటూ మంత్రి ట్వీట్ చేశారు.

దీనిపై భారత్ లో ఆస్ట్రేలియా హై కమిషనర్ బారీ ఓ ఫారెల్ కూడా స్పందించారు. ‘‘భారత్ ఆస్ట్రేలియా తమ తమ జాతీయ దినోత్సవాల సందర్భంగా భిన్నత్వం, ఏకత్వాన్ని చాటుతున్న సమయంలో ఇలాంటి ఘటనలు బాధాకరం. శాంతియుత ప్రదర్శనలు హింసాత్మక రూపం దాల్చకూడదు’’అని పేర్కొన్నారు.

First Published:  31 Jan 2023 6:17 AM GMT
Next Story