Telugu Global
International

పాకిస్తాన్‌లో 48 విమానాలు రద్దు.. కారణం ఏంటో తెలుసా?

సంక్షోభం నుంచి బయట పడటానికి తమకు రూ.23 బిలయన్లు సాయం చేయాలని పీఐఏ కోరింది.

పాకిస్తాన్‌లో 48 విమానాలు రద్దు.. కారణం ఏంటో తెలుసా?
X

పాకిస్తాన్‌లోని అతిపెద్ద విమానయాన సంస్థ, ప్రభుత్వ రంగానికి చెందిన పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ (పీఐఏ) గత రెండు రోజుల్లో 48 దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేసింది. ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా ఉన్నది. రోజు రోజుకూ ఆ దేశ ఆర్థిక వనరులు ఆవిరైపోతున్నాయి. రోజువారీ ఖర్చులకు కూడా ఖజానాలో డబ్బు లేని పరిస్థితిలో ఆ దేశం ఉన్నది. దీంతో ఇంధనం కూడా కొనలేని స్థితి నెలకొన్నది.

ఇంధన లేమి కారణంగా పలు విమానాలు రద్దు చేశామని, మరికొన్ని విమానాలను రీషెడ్యూల్ చేసినట్లు పీఐఏ ప్రతినిధి తెలిపారు. ఇప్పటి వరకు 13 దేశీయ, 11 అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేశారు. మరో 12 విమానాలను రీషెడ్యూల్ చేశారు. బుధవారం మరో 16 విమానాలను రద్దు చేశారు. రద్దు అయిన విమానాలకు సంబంధించిన ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు పీఐఏ పేర్కొన్నది. ప్రయాణికులు విమానాశ్రయాలకు వచ్చే ముందే పీఐఏ కస్టమర్ కేర్‌ను సంప్రదించి.. విమానం రద్దు కాలేదని తెలిస్తేనే రావాలని కోరడం గమనార్హం.

ప్రభుత్వ చమురు సంస్థ పీఎస్ఓ నుంచి పీఐఏకు ఇంధనం సరఫరా అవుతుంది. అయితే బకాయిలు చెల్లించకపోవడంతో సరఫరా నిలిచిపోయింది. ప్రతీ రోజు ఇంధనం కోసం రూ.100 మిలియన్లు అవసరం అవుతాయి. ఇన్నాళ్లూ అప్పు మీద ఇంధనం సరఫరా అయ్యేది. కానీ ఇప్పుడు అడ్వాన్స్ పేమెంట్ ఉంటేనే సరఫరా చేస్తామని చెప్పడంతో పీఐఏ చేతులెత్తేసింది.

పీఐఏ పూర్తిగా నష్టాల్లో ఉండటంతో పాటు భారీగా రుణభారం కూడా ఉన్నది. దీంతో పీఐఏను ప్రైవేట్‌పరం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. సంక్షోభం నుంచి బయట పడటానికి తమకు రూ.23 బిలయన్లు సాయం చేయాలని పీఐఏ కోరింది. కానీ ప్రభుత్వం వద్దే ప్రస్తుతం డబ్బులేని పరిస్థితి నెలకొనడంతో పీఐఏ మనుగడ అగమ్యగోచరంగా మారింది. భవిష్యత్‌లో మరిన్ని విమాన సర్వీసులు రద్దయ్యే అవకాశం ఉన్నది. ఖజానా పూర్తిగా ఖాళీ అవడంతో ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారు.

First Published:  18 Oct 2023 8:11 AM GMT
Next Story