Telugu Global
International

అమెరికాలో మళ్ళీ గన్ గర్జన... నలుగురి మృతి

అమెరికాలోని ఇండియానాలో మళ్ళీగన్ గర్జించింది. ఈ రాష్ట్రంలోని గ్రీన్ వుడ్ పార్క్ మాల్ లో నిన్న సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తి ఒకరు జరిపిన కాల్పుల్లో నలుగురు మరణించారు. కాల్పులు జరిపిన అగంతకుడిని ఓ యువకుడు కాల్చి చంపాడు.

అమెరికాలో మళ్ళీ గన్ గర్జన... నలుగురి మృతి
X

అమెరికాలోని ఇండియానాలో మళ్ళీగన్ గర్జించింది. ఈ రాష్ట్రంలోని గ్రీన్ వుడ్ పార్క్ మాల్ లో నిన్న సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తి ఒకరు జరిపిన కాల్పుల్లో నలుగురు మరణించారు. కాల్పులు జరిపిన అగంతకుడిని ఓ యువకుడు కాల్చి చంపాడు. గాయపడిన కొందరిని ఆసుపత్రికి తరలించారు. . ఈ ఘటనలో మాల్ లోని ఎవరో అజ్ఞాత వ్యక్తి తన గన్ తో దుండగుడిని కాల్చి చంపినట్టు గ్రీన్ వుడ్ మేయర్ మార్క్ మైర్స్ తెలిపారు. సంఘటన జరిగిన ప్రాంతానికి పోలీసు వాహనాలు వేగంగా వస్తున్న దృశ్యాలు వీడియోకెక్కాయి. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ కూడా రంగంలోకి దిగాయి. ఈ మాల్ లోని ఓ బాత్ రూమ్ లో అనుమానాస్పద ప్యాకేజీని పోలీసులు కనుగొన్నారు. బహుశా అందులో మందుగుండు సామాగ్రి ఉండవచ్చునని భావిస్తున్నారు. కాల్పులు జరిపిన షూటర్ మధ్యవయస్కుడని, ఎందుకీ కాల్పులకు పాల్పడ్డాడో తెలియడంలేదని పోలీసులు చెప్పారు. ఆ వ్యక్తి పొడవైన రైఫిల్, పలు తూటాలతో కూడిన మ్యాగజైన్ తో కనిపించినట్టు అధికారులు తెలిపారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఈ కాల్పుల ఉదంతం గురించి తమకు సమాచారం అందిందని, వెంటనే తాము సంఘటనా స్థలానికి చేరుకున్నామని పోలీస్ అసిస్టెంట్ చీఫ్ క్రిస్ బెయిలీ వెల్లడించారు.

దేశంలో ఈ తరహా ఘటన జరగడం చాలా విచారకరమని, మాల్ కి వచ్చిన వారిపై ఈ వ్యక్తి విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్టు తెలిసిందని ఆయన అన్నారు. ఈ ఘటనలో దుండగుడిపై కాల్పులు జరిపి హతమార్చిన వ్యక్తి ఎవరోగానీ అతడు రియల్ హీరో అని, ఒకవేళ ఆ వ్యక్తి దుండగునిపై షూట్ చేయకపోయి ఉంటే మరింత ఘోరం జరిగి ఉండేదని ఆయన చెప్పారు. బహుశా 22 ఏళ్ళ యువకుడు కాల్పులు జరిపినట్టు తెలుస్తోందన్నారు. దేశంలోని స్కూళ్ళు, మాల్స్,పబ్ లు వంటి బహిరంగ ప్రదేశాల్లో ఈ విధమైన ఘటనలు పెరిగిపోతుండడం జోబైడెన్ ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది. గన్ కంట్రోల్ చట్టాన్ని తెచ్చినా ఫలితం లేకపోతోందని వైట్ హౌస్ వర్గాలు విచారం వ్యక్తం చేస్తున్నాయి.

ముఖ్యంగా మే నెలలో న్యూయార్క్ గ్రాసరీ స్టోర్స్ లోను, ఆ తరువాత టెక్సాస్ లోని ఎలిమెంటరీ స్కూల్లోనూ, ఇల్లినాయిస్ లో ఇండిపెండెన్స్ డే పరేడ్ సందర్భంగానూ జరిగిన షూట్ ఘటనలు తీవ్ర కలవరం కలిగిస్తున్నట్టు ఈ వర్గాలు పేర్కొన్నాయి. కొన్ని అసాల్ట్ వెపన్స్ ని పూర్తిగా నిషేధించేందుకు సంబంధించిన బిల్లును యూఎస్ హౌస్ జుడీషియరీ కమిటీ ఈ వారంలో పరిశీలించనుంది. అయితే దీన్ని సెనేట్ ఆమోదిస్తుందా అన్నది సందేహాస్పదమే.. దేశంలో రైఫిల్ క్లబ్ ప్రాబల్యం, పాపులారిటీ ఎక్కువగా ఉంది. ఎంపీల్లో చాలామంది ఈ క్లబ్ సభ్యులే..

ఆత్మరక్షణ కోసం ఆయుధాలను ఉంచుకోవాలే గానీ, హింసకు కాదని, అందువల్ల ఇలాంటి చట్టాల వల్ల ఉపయోగం ఉండదని వీరు భావిస్తున్నారు. అయితే ఎవరికి పడితే వారికి గన్ లైసెన్సులు ఇవ్వరాదని, ఆయుధాల అమ్మకాలపై పరిమిత ఆంక్షలుండాలన్నది వీరి అభిప్రాయం. ఈ కారణంగానే బైడెన్ ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించలేకపోతోందని అంటున్నారు. అసాల్ట్ వెపన్ల నిషేధంపై తాము మాత్రం కచ్చితమైన నిర్ణయం తీసుకుంటామని హౌస్ జుడీషియరీ కమిటీ చైర్మన్ జెరాల్డ్ నాడ్లర్ తెలిపారు. డెమాక్రాట్ అయిన ఈ సభ్యుని ప్రతిపాదనకు కమిటీలోని ఇతర సభ్యులంతా ఆమోదం తెలుపుతున్నారు.

Next Story