Telugu Global
International

కాల్పులతో దద్దరిల్లిన అమెరికా.. 22 మంది మృతి, 60 మందికి గాయాలు

ఘటన జరిగిన వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఆ ప్రాంతాన్ని దాదాపు అదుపులోకి తీసుకున్నప్పటికీ అప్రమత్తంగా ఉండాల్సిందిగా ప్రజలను అభ్యర్థించారు.

కాల్పులతో దద్దరిల్లిన అమెరికా.. 22 మంది మృతి, 60 మందికి గాయాలు
X

అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పుల మోత మోగింది. మైనే రాష్ట్రంలోని లూయిస్టన్ నగరం తుపాకీ కాల్పులతో దద్దరిల్లింది. రెండు ప్రాంతాల్లో జరిగిన కాల్పుల్లో కనీసం 22 మంది ప్రాణాలు కోల్పోగా మరో 60 మందికిపైగా గాయపడ్డారు. గాయపడినవారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం ఈ ఘటన జరిగింది. ఆండ్రోస్కోగ్గిన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం ప్రకారం ఒక తీవ్రవాది ఈ కాల్పులు జరిపినట్లుగా అనుమానిస్తున్నారు. నిందితుడు కాల్పులు జరిపిన స్థానంలో రైఫిల్ పట్టుకుని ఉన్న రెండు ఫొటోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసి, అతను పరారీలో ఉన్నాడని ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది. ఫొటోలో పొడవాటి చేతుల చొక్కా, జీన్స్ ధరించిన, గడ్డం ఉన్న వ్యక్తి కాల్పులు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.


నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. అతనిని గుర్తించడానికి స్థానిక ప్రజల సహాయాన్ని కోరారు. అయితే దర్యాప్తులో భాగంగా.. ఆ ప్రాంతాల్లోని అన్ని వ్యాపారాలను మూసివేయాలని ఆండ్రోస్కోగిన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం ఫేస్ బుక్ ప్రకటనలో తెలిపింది. మైనే రాష్ట్ర పోలీసులు తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో కూడా "యాక్టివ్ షూటర్" అంటూ హెచ్చరికలు జరీ చేసింది. కాల్పుల ఘటనల నేపథ్యంలో ప్రజలు ఇళ్లలో నుంచి బైటికి రావద్దని, గడియ పెట్టుకుని లోపలే ఉండాలని కోరింది. ఆండ్రోస్కోగ్గిన్ కౌంటీలో ఒక భాగమైన లెవిస్టన్.. మైనే అతిపెద్ద నగరమైన పోర్ట్‌ల్యాండ్‌కు ఉత్తరాన 35 మైళ్ల (56 కి.మీ.) దూరంలో ఉంది. ఘటన జరిగిన వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఆ ప్రాంతాన్ని దాదాపు అదుపులోకి తీసుకున్నప్పటికీ అప్రమత్తంగా ఉండాల్సిందిగా ప్రజలను అభ్యర్థించారు.


అంతకుముందు, 2022లో టెక్సాస్‌లోని ఉవాల్డేలోని ఒక ప్రాథమిక పాఠశాలలో ఓ వ్యక్తి జరిపిన కాల్పులు 19 మంది పిల్లలను, ఇద్దరు ఉపాధ్యాయులను బలితీసుకున్నాయి. ఆ ఘటన తరువాత ఇదే అత్యంత ఘోరమైన సామూహిక కాల్పులు అని రాయిటర్స్ పేర్కొంది.

First Published:  26 Oct 2023 5:03 AM GMT
Next Story