Telugu Global
International

శ్రీలంక క్రీడాకారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టించే ఘటన..

కామన్ వెల్త్ గేమ్స్ పేరుతో శ్రీలంక నుంచి బ్రిటన్ కు వచ్చిన 10మంది క్రీడాకారులు ఉపాధి వెదుక్కుంటూ జంప్ అయ్యారు. 9మంది అథ్లెట్లు, వారి మేనేజర్ అడ్రస్ లేకుండా వెళ్లిపోయారు.

శ్రీలంక క్రీడాకారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టించే ఘటన..
X

బ్రిటన్ లో జరుగుతున్న కామన్ వెల్త్ గేమ్స్ లో పాల్గొనేందుకు శ్రీలంక నుంచి కూడా క్రీడాకారులు వెళ్లారు. కానీ ఆటల పోటీల్లో పాల్గొనకుండానే అందులో 10 మంది అదృశ్యమయ్యారు. వారు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, పోటీల్లో పాల్గొనకుండా ఎందుకు అదృశ్యమయ్యారనే విషయంపై అధికారిక సమాచారం లేదు. కానీ, వారు పోటీల్లో పాల్గొనకుండా పారిపోవడానికి కారణం మాత్రం ఆకలి అని తెలుస్తోంది. పోటీల సందర్భంగా ఆహారం దొరకడం లేదని కాదు, ఉపాధి వెదుక్కోడానికి ఆ 10మందికి అంతకు మించిన అవకాశం దొరకలేదు. అందుకే అదృశ్యమయ్యారు.

ఆటల పోటీల్లో గెలిస్తే క్రీడాకారులకు బంగారు, వెండి, కాంస్య పతకాలిస్తారు, క్యాష్ ప్రైజ్ కూడా ఇస్తారు. కానీ ఆ డబ్బులతో శ్రీలంకకి తిరిగి వెళ్తే వారం రోజుల్లో ఖర్చైపోతాయి, ఆ తర్వాత మళ్లీ ఆకలి కేకలు మొదలవుతాయి. అందుకే కామన్ వెల్త్ గేమ్స్ పేరుతో శ్రీలంక నుంచి బ్రిటన్ కు వచ్చిన 10మంది క్రీడాకారులు ఉపాధి వెదుక్కుంటూ జంప్ అయ్యారు. 9మంది అథ్లెట్లు, వారి మేనేజర్ అడ్రస్ లేకుండా వెళ్లిపోయారు. వారి వద్ద ఆరు నెలల పాటు చెల్లుబాటయ్యే వీసా ఉంది. దీంతో వారిపై చర్యలు తీసుకునేందుకు అవకాశం లేదని శ్రీలంక అధికారులు చెబుతున్నారు.

శ్రీలంక ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న సంగతి తెలిసిందే. అక్రమంగా ద్వీపదేశం నుంచి బయటకు వస్తున్న వారిలో కొందరు సముద్రంలోనే ప్రాణాలు కోల్పోతున్నారు. మిగతా వారు భారత్ వంటి దేశాల్లో శరణార్ధులుగా మిగిలిపోతున్నారు. ఇంకొందరు ఇతర దేశాలకు పారిపోయేందుకు ఆర్థిక శక్తి సమకూర్చుకుంటున్నారు. ఈ దశలో శ్రీలంక క్రీడాకారులకు బ్రిటన్ లో జరుగుతున్న కామన్ వెల్త్ గేమ్స్ ఓ అద్భుత అవకాశంగా మారాయి. 10మంది ఆటల పేరుతో దేశం దాటి.. బ్రిటన్ లో అడుగు పెట్టారు, ఆ తర్వాత మాయమయ్యారు. వీరంతా ఉపాధి కోసం బ్రిటన్ లో ఉండిపోయేందుకు ఇలా వెళ్లిపోయి ఉంటారని శ్రీలంక అధికారులు అంచనా వేస్తున్నారు. వారిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు అందింది. వారిలో ముగ్గురిని పోలీసులు గుర్తించారు కూడా. కానీ వారంతా స్థానిక చట్టాలను ఉల్లంఘించలేదని, పైగా వారి దగ్గర 6 నెలలపాటు చెల్లుబాటయ్యే వీసాలు ఉన్నాయని ఎటువంటి చర్యలు తీసుకోకుండా వదిలేశారు బ్రిటన్ పోలీసులు. వారి ఆచూకీ కూడా ఎవరికీ చెప్పలేదు. శ్రీలంకలోని దుర్భర పరిస్థితులకు అద్దం పట్టే ఈ సంఘటన ప్రపంచ వ్యాప్తంగా అందరినీ ఆలోచనలో పడేసింది.

First Published:  8 Aug 2022 3:12 AM GMT
Next Story