Telugu Global
Sports

భారత క్రికెటర్లకు ఎందుకీ తలపొగరు? హీరోయిజంతో కెరీర్ నాశనం

వరల్డ్ కప్ మ్యాచ్‌లు జరుగుతున్న సమయంలో ఇలా నిర్లక్ష్యం కారు నడపడమేంటి..? అని రోహిత్‌కి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అక్షింతలు వేస్తున్నారు.

భారత క్రికెటర్లకు ఎందుకీ తలపొగరు? హీరోయిజంతో కెరీర్ నాశనం
X

భారత్‌లో సినిమా హీరోలు, క్రికెటర్లకి క్రేజ్ ఎక్కువ. ఆదాయం, ఆదరణ విషయంలో ఈ రెండు రంగాల్లోనూ ఢోకా ఉండదు. దాంతో వాళ్లేదో దైవాంశ సంభూతులుగా భ్రమపడి.. అతి చేష్టలతో తరచూ వివాదాల్లో ఉంటారు. ఇక్కడ సినిమా హీరోల సంగతి కాస్త పక్కనపెడితే.. భారత క్రికెటర్లు గత కొంతకాలంగా ఆటతో కాకుండా ఆటేతర అంశాలతో వివాదంలో నిలుస్తున్నారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మితిమీరిన వేగంతో నిన్న కారుని నడిపి జరిమానాలని ఎదుర్కొన్నాడు.

వరల్డ్‌కప్ మ్యాచ్‌లు.. అయినా నిర్లక్ష్యం

భారత్ వేదికగా ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్‌కప్-2023లో భారత్ వరుస విజయాలతో మంచి జోరుమీదుంది. ఇప్పటికే పాకిస్థాన్, ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్ జట్లని మట్టికరిపించిన టీమిండియా పాయింట్ల పట్టికలోనూ రెండో స్థానంలో కొనసాగుతోంది. ఈ రోజు పుణె వేదికగా బంగ్లాదేశ్‌తో నాలుగో మ్యాచ్‌లో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం ముంబయి నుంచి పుణెకి సొంత కారులో వెళ్లిన రోహిత్ శర్మ.. గంటకి 200 కి.మీ. వేగంతో వాహనాన్ని నడిపినట్లు తేలింది. ఒకానొక దశలో ఆ వేగం 215 కి.మీ. కూడా చేరినట్లు తేల్చిన అధికారులు వేర్వేరు చోట్ల పరిమితికి మించి వేగంగా కారుని నడిపినందుకు చలానాలు విధించారు. వరల్డ్ కప్ మ్యాచ్‌లు జరుగుతున్న సమయంలో ఇలా నిర్లక్ష్యం కారు నడపడమేంటి..? అని రోహిత్‌కి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అక్షింతలు వేస్తున్నారు.

యాక్సిడెంట్‌తో ఏడాదిగా ఆటకి కీపర్ పంత్ దూరం

భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ గత ఏడాది చివర్లో ఇలానే ఓవర్ స్పీడ్‌గా కారుని నడిపి ప్రమాదానికి గురయ్యాడు. అదుపు తప్పిన కారు బోల్తా కొట్టి.. రోడ్డుపైనే కాలిపోయిన విషయం తెలిసిందే. అదే సమయంలో అటుగా వెళ్తున్న లారీ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పంత్ ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ.. గత ఏడాది నుంచి అతను ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదు. దాదాపు 2-3 నెలలు బెడ్‌కే పరిమితమైన పంత్.. కెరీర్ పీక్స్ దశలో అతివేగం కారణంగా ఆటకి దూరమై పశ్చాతాపం వ్యక్తం చేస్తున్నాడు. ఆ విషయం తెలిసి కూడా రోహిత్ శర్మ ఇలా హీరోయిజం చూపిస్తూ అతివేగంగా కారు నడపడంపై విమర్శలు వస్తున్నాయి.

కోట్లలో ఆదాయం.. లెక్కలేనితనం

క్రికెటర్లకి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నుంచి వార్షిక కాంట్రాక్ట్ రూపంలో కోట్లలో ఆదాయం వస్తుంది. అలానే మ్యాచ్ ఫీజు అదనం. ఇక యాడ్స్, ఐపీఎల్ కాంట్రాక్ట్‌లతో వారికి పెద్ద మొత్తంలో డబ్బు వస్తోంది. దాంతో ఆటగాళ్లలో లెక్కలేనితనం పెరిగిపోయిందనే విమర్శలు కూడా గత కొన్నేళ్లుగా వినిపిస్తున్నాయి. ఫాస్ట్ బౌలర్ ప్రవీణ్ కుమార్, మిడిలార్డర్ బ్యాటర్ సురేశ్ రైనా కూడా గతంలో ఇలానే కారుని వేగంగా నడిపి ప్రమాదానికి గురైనవారే. కానీ.. ఆ తప్పిదాల నుంచి క్రికెటర్లు పాఠాలు నేర్చుకోవడం లేదు. కోట్లాది మంది అభిమానులు.. క్రికెటర్లని ఆరాధిస్తుంటారు. ఇలా ఓవర్ స్పీడ్ చేష్టలతో వారికి ఏం మెసేజ్ ఇస్తున్నట్లు..? ఇకనైనా ఆటగాళ్లు బాధ్యతగా ఉండేలే బీసీసీఐ చర్యలు తీసుకుంటే మరో క్రికెటర్ పంత్‌లా బాధపడే రోజులు ఉండవు.


First Published:  19 Oct 2023 4:27 AM GMT
Next Story