Telugu Global
NEWS

బీటెక్ కాలేజ్‌ల‌ను ఎలా ఎంచుకోవాలంటే..

కాలేజీ ఎంపిక విషయంలో ఫ్యాకల్టీ, మౌలిక వసతులు, ప్లేస్‌మెంట్స్.. ఈ మూడు అంశాల‌కు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. కోర్సు విషయంలో.. రెండు మూడు ఆప్షన్లు ఉంచుకోవడం మంచిది.

బీటెక్ కాలేజ్‌ల‌ను ఎలా ఎంచుకోవాలంటే..
X

రీసెంట్‌గా ఎంసెట్‌-2022 ఫ‌లితాలు విడుదలయ్యాయి. బీటెక్ చ‌దివేందుకు ఎలాంటి కాలేజ్ సెలక్ట్ చేసుకోవాలి? ఏ కోర్సు ఎంచుకోవాలి? అన్న ఆలోచన విద్యార్థుల‌ను వేధిస్తుంటుంది. కాలేజీని ఎంపిక చేసుకునే ముందు ఏయే విషయాలు పరిగణనలోకి తీసుకోవాలంటే..

బీటెక్ కోసం కాలేజీని సెలక్ట్ చేసుకునే ముందు, ఆ కాలేజీ రెపుటేషన్‌ను, 'ఆ కాలేజీలో ప్లేస్‌మెంట్స్‌ ఏ విధంగా జరుగుతున్నాయి' అనే విషయాలు పరిశీలించాలి. అలాగే కాలేజీ ఫ్యాకల్టీ గురించి కూడా తెలుసుకుంటే మంచిది. వీటితో పాటు కాలేజీలో ఉండే మౌలిక వసతులు, ఇతర సౌకర్యాల‌ను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. NAAC, NBA గుర్తింపు పొందిన ఇనిస్టిట్యూట్స్‌కు మొదటి ప్రాధ్యానం ఇవ్వాలి. ఈ రోజుల్లో ఐటీ రంగానికి ఎక్కువ ప్రాధాన్యం ఉండడం వల్ల చాలామంది స్టూడెంట్స్ కంప్యూటర్ సైన్స్, ఐటీ బ్రాంచ్‌లను సెలక్ట్ చేసుకుంటున్నారు. దీని వల్ల ఒకే రంగంలో ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. అందుకే అందుబాటులో ఉన్న అన్ని బ్రాంచీల గురించి అవగాహన పెంచుకుని నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.

ఎంచుకున్న కాలేజీలో ఎంచుకున్న కోర్సులో సీటు రాకపోతే సెకండ్‌ ఆప్షన్‌గా మెకానికల్‌, సివిల్‌, కమ్యూనికేషన్స్ వంటి కోర్సుల్లో కూడా చేరొచ్చు. కాలేజీలో మంచి ప్లేస్‌మెంట్స్ అవకాశాలున్నప్పుడు కోర్సు విషయంలో ఆప్షన్ మార్చుకోవడం మంచిది. ఎందుకంటే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, వెబ్ డెవలపర్స్ లాంటి జాబ్స్ ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంటున్నాయి.

ఒకటే కోర్సుకి ఫిక్స్ అయ్యి దాని కోసమని అంతగా పేరొందని కాలేజీలో డబ్బు కట్టి చేరడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. స్కిల్స్‌ను మెరుగుపరిచే కాలేజీకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. కళాశాల చూడటానికి బాగుందని, ప్రమోషన్స్ బాగా చేస్తుందని అందులో చేరకూడదు. కాలేజీని ఎంచుకునే ముందు అందులో ఎలాంటి ఫ్యాకల్టీ ప‌నిచేస్తోంద‌న్న‌ విషయాన్ని గమనించాలి. ఎంచుకునే కాలేజీ వెబ్‌సైట్‌లో ఆయా డిపార్ట్ మెంట్‌ ఫ్యాకల్టీ వివరాలు ఉంటాయి. వాటిని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. ఎంతమంది ఫ్యాకల్టీలకు పీహెచ్‌డీ ఉంది. వారు ఏటా ఎటువంటి రిసెర్చ్‌ పేపర్స్‌ సబ్మిట్‌ చేస్తున్నారు అనే విషయాలు తెలుసుకోవాలి. కాలేజీ బిల్డింగ్‌లను చూసి మోసపోకుండా సరైన వసతులు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. ల్యాబ్స్, ప్రాక్టికల్స్, వర్క్ షాప్స్ లాంటివి సరిగ్గా నిర్వహిస్తున్నారో లేదో చెక్ చేసుకోవాలి.

చివరిగా చెప్పేదేంటంటే కాలేజీ విషయంలో ఫ్యాకల్టీ, మౌలిక వసతులు, ప్లేస్‌మెంట్స్.. ఈ మూడు అంశాల‌కు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. కోర్సు విషయంలో రెండు మూడు ఆప్షన్లు ఉంచుకోవడం మంచిది. ముందు నుంచీ ఒక సబ్జెక్ట్ పై ఎక్కువ ఆసక్తి ఉంటే దానికి ప్రాధాన్యం ఇవ్వడంలో తప్పు లేదు. అంతేకాకుండా ప్లేస్‌మెంట్స్ సాధించడమే మొదటి ప్రాధాన్యం అనుకున్నప్పుడు కోర్సు విషయంలో మనసు మార్చుకున్నా ఫర్వాలేదు. ఇకపోతే యూనివర్సిటీ ర్యాంక్‌ సాధిస్తే మొదటి ప్రాధాన్యం తప్పక యూనివర్సిటీలకే ఇవ్వాలి. తరువాత రెండో ఆప్షన్‌గా అటానమస్ కళాశాలలను ఎంపిక చేసుకుంటే మంచిది. కొత్తగా ప్రారంభించిన కాలేజీలను పరిగణనలోకి తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి.

First Published:  23 Aug 2022 8:47 AM GMT
Next Story