Telugu Global
NEWS

పిల్ల‌లు ఎలా పుడ‌తారంటే.. - చిన్నారి ప్ర‌శ్న‌కు అద్భుత‌మైన‌ వివ‌ర‌ణ ఇచ్చిన త‌ల్లి

ఈ వీడియోను ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. నారింజ పండును ఓ గర్భిణిగా చూపుతూ.. హాస్పిటల్లో సిజేరియన్ ప్రక్రియ ఎలా సాగుతుందో ఆ వీడియోలో క్లుప్తంగా కనిపిస్తోంది.

పిల్ల‌లు ఎలా పుడ‌తారంటే.. - చిన్నారి ప్ర‌శ్న‌కు అద్భుత‌మైన‌ వివ‌ర‌ణ ఇచ్చిన త‌ల్లి
X

సాధార‌ణంగా పిల్ల‌లు అడిగే ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్ప‌డం.. అర్థ‌మ‌య్యేలా వివ‌రించ‌డం.. చాలామంది త‌ల్లిదండ్రుల‌కు చాలా ఇబ్బందిక‌రంగా ఉంటుంది. అలాగ‌ని వారి చిట్టి బుర్ర‌ల్లో మెదిలే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్ప‌క‌పోతే.. అది వారి మాన‌సిక వికాసానికి దోహ‌ద‌ప‌డ‌దు. అదే వారికి స‌వ్య‌మైన రీతిలో స‌మాధానం చెప్ప‌గ‌లిగితే.. చిన్న‌నాటి నుంచే వారి మాన‌సిక వికాసానికి తోడ్ప‌డ‌గ‌లుగుతాం.

స‌రిగ్గా ఇదే ప‌ని చేశారు.. ఓ త‌ల్లి. పిల్ల‌లు ఎలా పుడ‌తార‌మ్మా.. అంటూ ప్ర‌శ్నించిన త‌న చిన్నారికి ఆస‌క్తిక‌ర‌మైన ప‌ద్ధ‌తిలో ఆక‌ట్టుకునేలా వివ‌ర‌ణ ఇచ్చారు. దానిని వీడియో కూడా చేసి సోష‌ల్ మీడియాలో పెట్టారు. ఇప్పుడు ఆ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.


ఈ వీడియోను ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. నారింజ పండును ఓ గర్భిణిగా చూపుతూ.. హాస్పిటల్లో సిజేరియన్ ప్రక్రియ ఎలా సాగుతుందో ఆ వీడియోలో క్లుప్తంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇప్పటివరకు 2.61 లక్షల మంది దీనిని వీక్షించారు. 'వావ్ సర్. సిజేరియన్ ప్రక్రియను ఆ తల్లి సృజనాత్మకంగా ప్రదర్శించారు' అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టారు. `బహుశా ఆమె ఓ వైద్యురాలు, లేదా నర్సు కావచ్చు..` అని మ‌రొకరు స్పందించారు. తన పిల్లలకూ ఇదే విధంగా వివరిస్తానంటూ ఇంకొక‌రు తెలిపారు. ఏదేమైనా ఆ త‌ల్లి అద్భుత‌మైన ఐడియాకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

First Published:  22 May 2023 1:56 AM GMT
Next Story