Telugu Global
NEWS

ఎట్టకేలకు సంక్రాంతి బెర్తుల ఫిక్స్

జనవరి 12వ తేదీన విజయ్ వారసుడు సినిమా విడుదల కానుండగా, అదే రోజున బాలకృష్ణ వీరసింహారెడ్డి కూడా విడుదల చేయనున్నారు. ఆ తర్వాతి రోజు అంటే జనవరి 13వ తేదీన చిరంజీవి వాల్తేరు వీరయ్య విడుదల కానుంది.

ఎట్టకేలకు సంక్రాంతి బెర్తుల ఫిక్స్
X

ఎట్టకేలకు సంక్రాంతికి వచ్చే సినిమాల బెర్తులు ఫిక్సయ్యాయి. కొన్ని నెలలుగా పండక్కి వచ్చే సినిమాల విషయంలో కొంత గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. పోటాపోటీగా ఆరేడు సినిమాలు సంక్రాంతికి విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. దీంతో ఏ సినిమా పండక్కి విడుదలవుతుందో..ఏ సినిమా వెనక్కి తగ్గుతుందో తెలియక నిర్మాతలు తమ సినిమాల రిలీజ్ డేట్లు ఫిక్స్ చేయలేదు. చిరంజీవి హీరోగా నటిస్తున్న వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ హీరోగా నటిస్తున్న వీరసింహారెడ్డి, తమిళ అగ్ర హీరో విజయ్ నటిస్తున్న వారసుడు సంక్రాంతి పండక్కు విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ డేట్లు మాత్రం కన్ఫర్మ్ చేయలేదు.

సంక్రాంతి రేసులో నిలిచిన ఆదిపురుష్, ఏజెంట్ సినిమాలు పక్కకి తప్పుకోవడంతో ఇప్పుడు పండక్కి వస్తున్న సినిమాల డేట్లు కూడా నిర్మాతలు ప్రకటించారు. జనవరి 12వ తేదీన విజయ్ వారసుడు సినిమా విడుదల కానుండగా, అదే రోజున బాలకృష్ణ వీరసింహారెడ్డి కూడా విడుదల చేయనున్నారు. ఆ తర్వాతి రోజు అంటే జనవరి 13వ తేదీన చిరంజీవి వాల్తేరు వీరయ్య విడుదల కానుంది.

ఈ మేరకు ఈ తేదీల్లో వస్తున్నట్లు డిస్ట్రిబ్యూటర్లకు ఆయా సినిమాల నిర్మాతలు ఇప్పటికే చెప్పేసినట్లు తెలుస్తోంది. ఈ మూడు సినిమాలతో పాటు సంక్రాంతికి మరో తమిళ అగ్ర హీరో అజిత్ నటిస్తున్న తునివు కూడా తెలుగులో విడుదల అయ్యే అవకాశం ఉంది. వారసుడు సినిమా కాకుండా డైరెక్ట్ తెలుగు సినిమాలు వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు మాత్రమే పండక్కి విడుదల అవుతుండడంతో మరికొన్ని చిన్న సినిమాలు కూడా సంక్రాంతి రేసులో నిలుస్తాయని ప్రచారం జరుగుతోంది. ఎవరి సినిమా ఏ రోజు వస్తుంది అన్న విషయం చాలా రోజులుగా సస్పెన్స్ లో ఉండగా ఇప్పుడు ఏ తేదీల్లో ఏ హీరో మూవీ వచ్చేది ఫిక్స్ అయిపోవడంతో నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా జోరుగా చేపడుతున్నారు.

First Published:  2 Dec 2022 9:06 AM GMT
Next Story