Telugu Global
NEWS

వర్షాకాలంలో వీరు పాదాలపై శ్రద్ధ పెట్టాల్సిందే! ఎందుకంటే..

తేమతో కూడిన వాతావరణం పాదాలకు సంబంధించిన ఇబ్బందులను, అంటువ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో వర్షాకాలంలో పాదాలను ఆరోగ్యంగా, సురక్షితంగా ఉంచుకోవచ్చు. అదెలాగంటే..

వర్షాకాలంలో వీరు పాదాలపై శ్రద్ధ పెట్టాల్సిందే! ఎందుకంటే..
X

పేరులో ఉన్న తియ్యదనం ఆ వ్యాధిలో ఉండదు. ఒక్కసారి వచ్చిందంటే వదిలేదే లేదు. ఇంత మధురంగా చెప్పాక ఇంకా ప్రత్యేకంగా పలకాల్సిన అవసరం లేని వ్యాధి మధుమేహం. తాజాగా లాన్సెట్‌ అధ్యయనం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 2050 నాటికి 130 కోట్ల మందికిపైగా డయాబెటిస్‌ బారిన పడే ప్రమాదమున్నదని హెచ్చరించింది. సాధారణంగా మధుమేహులకు గుండెజబ్బులు, స్ట్రోక్‌, ఫుట్‌ అల్సర్‌, కంటిచూపు కోల్పోవడం సమస్యలు తలెత్తే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇక వర్షాకాలంలో వీరు చాలా జాగ్రత్త పడాల్సింది పాదాల విషయంలో ఎందుకంటే.. వీరి పాదాలపై ఏ చిన్న దెబ్బ తగిలినా, పుండు అయినా అది నయం కావడానికి చాలాకాలం పడుతుంది. ఒక్కోసారి తీవ్రమైన సమస్యగా మారిపోవచ్చు కూడా.

తేమతో కూడిన వాతావరణం పాదాలకు సంబంధించిన ఇబ్బందులను, అంటువ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో వర్షాకాలంలో పాదాలను ఆరోగ్యంగా, సురక్షితంగా ఉంచుకోవచ్చు. అదెలాగంటే..

డయాబెటిక్ పేషెంట్లు సరైన చెప్పులనే వేసుకోవాలి. సైజ్ పరంగా గానీ, లెదర్ పరంగా గానీ కంఫర్ట్ గా ఉండాలి. అలాగే కాలివేళ్లు నలగకుండా చూసుకోవాలి. అలా హాయిగా ఉంటాయని ఫ్లిప్-ఫ్లాప్స్ లేదా చెప్పులను ధరించడం మానుకోండి. ఎందుకంటే ఇవి మీ పాదాలను దెబ్బలనుంచి సురక్షితంగా ఉంచవు.

పాదాలు క్రమం తప్పకుండా చెక్ చేసుకోండి. ఎర్రబడినా, చిన్న దెబ్బ కనపడినా కూడా మరింత జాగ్రత్తపడండి.

ఈ సీజన్ లో పాదాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా మరియు పొడిగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇది ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తుంది. నిద్రపోయే ముందు, బయటనుండి వచ్చిన తరువాత గోరువెచ్చని నీటితో పాదాలను కడిగి, తడి లేకుండా తుడిచి తగినంత మాయిశ్చరైజర్ అప్లై చేయడం మరచిపోకండి.

డయాబెటిక్ ఫుట్ కేర్‌లో వ్యాయామం ఏంతో ముఖ్యమైనది. రోజూ కొంత సమయం పాదాల వ్యాయామం కోసం కూడా వెచ్చించగలిగితే అది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఈ ప్రక్రియ ఇన్ఫెక్షన్, పుండ్లు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

వర్షాకాలంలో చల్లదనం, గాలిలో తేమ వల్ల దాహం వేయదు. అయినప్పటికీ, రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీరు త్రాగటం చాలా ముఖ్యం. మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పుష్కలంగా నీరు తాగాలని గుర్తు పెట్టుకోండి.

ఇక చివరిగా మీ బ్లడ్ షుగర్ స్థాయిలను క్రమం తప్పకుండా చెక్ చేసుకోండి. రక్తంలో చక్కెర స్థాయి కాళ్ళకు రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది. దీని వల్ల కాళ్లలో తిమ్మిరి రావచ్చు. సకాలంలో సత్వర చికిత్స అందించాలి అంటే చక్కెర స్థాయిలలో మార్పులను క్రమం తప్పకుండా తనిఖీ చేయడం అవసరం.

కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు వర్షాకాలంలో ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా తమ పాదాల ఆరోగ్యాన్ని, తమ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు.

First Published:  26 July 2023 2:23 PM GMT
Next Story