Telugu Global
NEWS

ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన ఈషాకు సీఎం కేసీఆర్ అభినందన

తెలంగాణ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి అమలు చేస్తున్న పటిష్ట కార్యచరణే జాతీయ, అంతర్జాతీయ వేదికల్లో రాష్ట్ర క్రీడాకారులు కనపరుస్తున్న ప్రతిభకు నిదర్శనమని సీఎం కేసీఆర్ అన్నారు.

ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన ఈషాకు సీఎం కేసీఆర్ అభినందన
X

చైనాలోని హ్యాంగ్జౌలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు పతకాలు కొల్లగొడుతున్నారు. తాజాగా 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌ మహిళల విభాగంలో భారత బృందం మను బాకర్, ఈషా సింగ్, రిథమ్ సంగ్వాన్ గోల్డ్ మెడల్ సాధించారు. ఈ బృందం 1,759 పాయింట్లతో భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించారు. ఈ టీమ్‌లోని ఈషా సింగ్ హైదరాబాద్‌కు చెందిన క్రీడాకారిణి. వ్యక్తిగత మహిళల 25 మీటర్ల పిస్టోల్ ఈవెంట్‌లో ఈషా సింగ్ రజత పతకం కూడా సాధించింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఈషా సింగ్‌తో పాటు భారత బృందానికి అభినందనలు తెలిపారు.

ఆసియా క్రీడల్లో ఈషా సింగ్ బృందం టీమ్ స్పిరిట్ చాటిందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి అమలు చేస్తున్న పటిష్ట కార్యచరణే జాతీయ, అంతర్జాతీయ వేదికల్లో రాష్ట్ర క్రీడాకారులు కనపరుస్తున్న ప్రతిభకు నిదర్శనమని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ క్రీడాకారులు రాబోయే రోజుల్లో మరెన్నో పతకాలు సాధించి.. తెలంగాణ ఖ్యాతిని జగద్వితం చేయాలని సీఎం కేసీఆర్ ఆంకాంక్షించారు.

కాగా, భారత క్రీడాకారులు ఇవ్వాళ ఒక్కరోజే ఎనిమిది పతకాలు సాధించారు. ఇందులో ఏడు పతకాలను షూటర్లే సొంతం చేసుకోగా.. మరో పతకం సెయిలింగ్‌లో వచ్చింది. ప్రస్తుతం భారత పతకాల సంఖ్య 22కు చేరుకున్నది. ఇందులో ఐదు స్వర్ణాలు, ఏడు రజతాలు, 10 కాంస్య పతకాలు ఉన్నాయి.

మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్‌ వ్యక్తిగత విభాగంలో సిఫ్ట్ కౌర సమ్రా స్వర్ణ పతకం గెలిచింది. మహిళల 25 మీటర్ల టీమ్ ఈవెంట్‌లో మను బాకర్, ఈషా సింగ్, రిథమ్ సంగ్వాన్ గోల్డ్ మెడల్ గెలిచారు. మహిళల 25 మీటర్ల పిస్టోల్ వ్యక్తిగత విభాగంలో ఈషా సింగ్ రజత పతకం గెలిచింది. పురుషుల స్కీట్ షూటింగ్ వ్యక్తిగత విభాగంలో అనంత్‌జీత్ సింగ్ నరుక రజత పతకం గెలిచారు. మహిళల 25 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ టీమ్ విభాగంలో ఆషి చౌష్కి, సిఫ్ట్ కౌర్ సమ్రాతో కూడిన జట్టు రజత పతకం గెలిచారు.

మహిలల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ వ్యక్తిగత విభాగంలో ఆషి చౌష్కి కాంస్య పతకం గెలిచింది. పురుషుల స్కీట్ షూటింగ్ జట్టు విభాగంలో అంగద్, గుర్జోత్, అనంత్‌జీత్ సింగ్ కాంస్యం గెలిచారు. పురుషుల దింగే ఐఎల్‌సీఏ 7 విభాగంలో విష్ణు శరవణన్ కాంస్య పతకం గెలుచుకున్నాడు.



First Published:  27 Sept 2023 1:02 PM GMT
Next Story