Telugu Global
NEWS

మార్గదర్శిపై సీఐడీ దూకుడు పెంచిందా?

మార్గదర్శికి చెందిన రూ.242 కోట్ల పెట్టుబడులను గురువారం జప్తు చేసింది. ప్రజల నుండి డిపాజిట్లు సేకరిస్తున్న మార్గదర్శి ఛైర్మన్ రామోజీరావు, ఎండీ, కోడలు శైలజ తమిష్టం వచ్చినట్లుగా చిట్టేతర సంస్థ‌లకు దారి మళ్ళిస్తున్నట్లు సీఐడీ ఆధారాలతో సహా బయటపెట్టింది.

మార్గదర్శిపై సీఐడీ దూకుడు పెంచిందా?
X

మార్గదర్శి చీటింగ్ కేసులో సీఐడీ దూకుడు పెంచినట్లే ఉంది. మార్గదర్శికి చెందిన రూ.242 కోట్ల పెట్టుబడులను గురువారం జప్తు చేసింది. ప్రజల నుండి డిపాజిట్లు సేకరిస్తున్న మార్గదర్శి ఛైర్మన్ రామోజీరావు, ఎండీ, కోడలు శైలజ తమిష్టం వచ్చినట్లుగా చిట్టేతర సంస్థ‌లకు దారి మళ్ళిస్తున్నట్లు సీఐడీ ఆధారాలతో సహా బయటపెట్టింది. తాజాగా జప్తు చేసిన ఆస్తుల్లో రూ. 242 కోట్లను 40 కంపెనీల్లోని మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టింది. మార్గదర్శి పెట్టుబడులు పెట్టిన 40 కంపెనీల జాబితాను కూడా సీఐడీ విడుదల చేసింది. గతంలోనే రూ.793 కోట్ల ఆస్తులను జప్తు చేసిన విషయం తెలిసిందే.

చిట్ ఫండ్స్ కంపెనీ సేకరిస్తున్న డిపాజిట్లను చిట్టేతర కంపెనీలకు మళ్ళించటం రిజర్వ్ బ్యాంకు నిబంధనలకు విరుద్ధం. అయితే మొదటి నుండి రామోజీ ఇదే పని చేస్తున్నారు. ఇదే విషయాన్ని సంవత్సరాలుగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మొత్తుకుంటున్నారు. అసలు మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థ‌ను ఏర్పాటు చేయటమే మోసమని ఉండవల్లి చెబుతున్నారు. ఇదే విషయమై విచారణ చేస్తున్న సీఐడీ అధికారులతో రామోజీ, శైలజ అడ్డదిడ్డంగా సమాధానాలు చెబుతున్నారట.

రాష్ట్ర చట్టాల గురించి ప్రశ్నిస్తే తాము కేంద్ర చట్టాల ప్రకారమే సంస్థ‌ను నడుపుతున్నట్లు చెబుతారట. కేంద్ర చట్టం ప్రకారం నడపటం తప్పుకదా అని అడిగితే రాష్ట్ర ప్రభుత్వం చట్టాల గురించి మాట్లాడుతారట. శైలజ అయితే తమ కంపెనీ రూపొందించుకున్న మార్గదర్శకాల ప్రకారమే తాము నడుకుంటాము, కానీ ప్రభుత్వం చట్టాల ప్రకారం కాదని సీఐడీకి సమాధానమిచ్చినట్లు సాక్షి మీడియా చెప్పింది. డిపాజిట్లు వసూలు చేసింది నిజమే కానీ ఎంత వసూలు చేశామో గుర్తులేదంటారు. దారిమళ్ళించింది నిజమే కానీ ఎక్కడికి మళ్ళాయో తెలీదంటారు. నిధుల పెట్టుబడులు, నిధుల దారిమళ్ళింపులాంటివి తాను చూసుకోనని శైలజ చెప్పటమే విచిత్రంగా ఉంది.

ఇక్కడ విషయం ఏమిటంటే రామోజీ, శైలజ చెప్పిన సమాధానాల్లోనే వాళ్ళు తప్పు చేసినట్లు అంగీకరించారని సీఐడీ భావిస్తోంది. కాకపోతే ఆ విషయం కోర్టులో తేలాల్సి ఉంటుంది. అందుకనే విచారణ, దర్యాప్తును సీఐడీ పక్కాగా చేస్తోంది. వేల కోట్ల రూపాయల చీటింగ్ జరిగిందన్న విషయం బయటపడుతోంది కాబట్టే సీఐడీతో పాటు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యు ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

First Published:  16 Jun 2023 5:19 AM GMT
Next Story