Telugu Global
NEWS

నేను చిరంజీవి కలిస్తే అది పాన్ వరల్డ్ సినిమాయే.. బాలకృష్ణ కామెంట్స్

బాలకృష్ణ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా నిజంగా వస్తుందో రాదో తెలియదు కానీ.. నిజంగా వస్తే చాలా బాగుంటుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

నేను చిరంజీవి కలిస్తే అది పాన్ వరల్డ్ సినిమాయే.. బాలకృష్ణ కామెంట్స్
X

నందమూరి బాలకృష్ణ ఒకవైపు హీరోగా నటిస్తూనే మరోవైపు ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. అన్ స్టాపబుల్ షో మొదటి సీజన్ కేవలం ఎంటర్‌టైన్‌మెంట్‌కి పరిమితం కాగా.. రెండో సీజన్ మాత్రం సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. ఈ షో మొదటి ఎపిసోడ్‌లో చంద్రబాబు నాయుడు, లోకేష్ పాల్గొనగా అది హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. గత ఎపిసోడ్‌లో కూడా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈ షోకు హాజరయ్యారు.

ఇక తాజా ఎపిసోడ్‌కు అగ్ర నిర్మాతలు అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్ బాబు, సీనియర్ దర్శకులు కే రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలకృష్ణ పలు ప్రశ్నలు అడిగి వారి నుంచి సమాధానాలు రాబట్టాడు. ఈ సందర్భంగా బాలకృష్ణ అల్లు అరవింద్‌తో మాట్లాడుతూ 'అందరితో సినిమాలు తీశావ్.. నాతోనే పెండింగ్' అని అన్నారు. దీనికి స్పందించిన అరవింద్ 'మీతో, చిరంజీవిగారితో కలసి మల్టీస్టారర్ సినిమా చేసేందుకే ఇన్నేళ్లుగా వెయిట్ చేస్తున్నా' అంటూ సమాధానం ఇచ్చాడు. దానికి బాలకృష్ణ స్పందిస్తూ 'నేను, చిరంజీవి కలిస్తే అది పాన్ వరల్డ్ సినిమా అవుతుంది' అంటూ కామెంట్స్ చేశాడు.

బాలకృష్ణ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా నిజంగా వస్తుందో రాదో తెలియదు కానీ.. నిజంగా వస్తే చాలా బాగుంటుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చిరంజీవి, బాలకృష్ణ గత 40 ఏళ్లుగా టాలీవుడ్‌లో అగ్ర హీరోలుగా వెలుగుతున్నారు. చిరంజీవి నెంబర్ వన్ స్థానంలో ఉన్నప్పటికీ.. ఆయనకు గట్టి పోటీ ఇచ్చే హీరో ఎవరు అని టాపిక్ వస్తే మాత్రం బాలకృష్ణ పేరే మొదట వినిపిస్తుంది.

మాస్‌లో బీభత్సమైన ఫాలోయింగ్ ఉన్న ఈ ఇద్దరు హీరోలు బాక్సాఫీస్ వార్‌లో ఎన్నోసార్లు పోటాపోటీగా తలపడ్డారు. ఇప్పుడు వీరు నిజంగా కలిసి సినిమా చేస్తే చూడాలని ఉందని ప్రేక్షకులు కోరుతున్నారు. మరి ప్రేక్షకుల కోరికను అల్లు అరవింద్ నిజం చేస్తాడేమో వేచిచూడాలి. ప్రస్తుతం చిరంజీవి వాల్తేరు వీరయ్య అనే సినిమాలో నటిస్తుండగా, బాలకృష్ణ వీర సింహారెడ్డి అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ ఇద్దరు కలిసి నటించిన సినిమాలు వచ్చే సంక్రాంతికి తలపడబోతున్నాయి.

First Published:  1 Dec 2022 11:32 AM GMT
Next Story