Telugu Global
NEWS

ఢిల్లీ విమానాశ్ర‌యంలో 160 విమాన స‌ర్వీసుల ర‌ద్దు..! - జీ-20 ఎఫెక్ట్‌తో రానున్న 3 రోజుల్లో అమ‌లుకు అవ‌కాశం

విస్తారా, ఎయిర్ ఇండియా సంస్థలు తాము ఎంపిక చేసిన, రీషెడ్యూల్ అయిన విమాన సర్వీసుల బుకింగ్స్‌ను వినియోగదారులు ఒకసారి మార్చుకొనేందుకు వీలుగా అదనపు ఛార్జీలను తొలగించాయి. ఈ విషయాన్ని ఎక్స్(ట్విటర్) వేదికగా ప్రకటించాయి.

ఢిల్లీ విమానాశ్ర‌యంలో 160 విమాన స‌ర్వీసుల ర‌ద్దు..!  - జీ-20 ఎఫెక్ట్‌తో రానున్న 3 రోజుల్లో అమ‌లుకు అవ‌కాశం
X

ఢిల్లీలో జ‌ర‌గ‌నున్న జీ-20 స‌ద‌స్సు నేప‌థ్యంలో 160 దేశీయ విమాన స‌ర్వీసులు ర‌ద్దు కానున్నాయ‌ని ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ ప్ర‌తినిధి బుధ‌వారం వెల్ల‌డించారు. ఢిల్లీ నుంచి బ‌య‌లుదేరి వెళ్లే 80 విమానాలు, ఢిల్లీకి వ‌చ్చే మ‌రో 80 విమానాలు రానున్న మూడు రోజుల్లో ర‌ద్ద‌య్యే అవ‌కాశం ఉంద‌ని వివ‌రించారు. జీ-20 సదస్సు కారణంగా రానున్న మూడు రోజుల్లో విధించిన ట్రాఫిక్ నిబంధనల వ‌ల్ల‌ ఈ పరిస్థితి తలెత్తిందని తెలిపారు.

ఆంక్షల కారణంగా అంతర్జాతీయ సర్వీసుల‌కు ఎటువంటి ఇబ్బందులూ లేవని ఎయిర్‌పోర్ట్ ప్ర‌తినిధి తెలిపారు. తాము ప్రయాణికుల అసౌకర్యాన్ని వీలైనంత తగ్గించేందుకు విమానయాన సంస్థలతో కలిసి పనిచేస్తున్నామ‌ని వివ‌రించారు. ఈ సదస్సు కోసం ఎయిర్ పోర్టులో అన్ని రకాల పరికరాలు, పార్కింగ్ సౌకర్యాలను సిద్ధంగా ఉంచామని ఆ ప్రతినిధి వివరించారు.

మరోవైపు విమానయాన సంస్థలు కూడా ప్రయాణికులకు అసౌకర్యాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టాయి. విస్తారా, ఎయిర్ ఇండియా సంస్థలు తాము ఎంపిక చేసిన, రీషెడ్యూల్ అయిన విమాన సర్వీసుల బుకింగ్స్‌ను వినియోగదారులు ఒకసారి మార్చుకొనేందుకు వీలుగా అదనపు ఛార్జీలను తొలగించాయి. ఈ విషయాన్ని ఎక్స్(ట్విటర్) వేదికగా ప్రకటించాయి. ఇక సెప్టెంబర్ 8-11 మధ్యలో విమాన ప్రయాణాల సమయంలో సర్వీసుల స్టేటస్‌ల‌ను జాగ్రత్తగా చెక్ చేసుకోవాలని విస్తారా సూచించింది. ఎయిర్ ఇండియా కూడా ప్రయాణాలను మార్చుకొన్న వినియోగదారులకు ఒక సారికి అదనపు ఛార్జీలను రద్దు చేసింది.

First Published:  6 Sep 2023 10:25 AM GMT
Next Story