Telugu Global
NEWS

ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డ్స్‌లో ఉత్తమ నటులుగా ఎన్టీఆర్, రామ్‌చరణ్‌

2023 సంవత్సరానికి సంబంధించిన 68వ ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డ్స్‌ సౌత్‌ ఈ అవార్డులను ప్రకటించింది. ఇక ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం మరో నాలుగు అవార్డులు దక్కించుకుంది.

ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డ్స్‌లో ఉత్తమ నటులుగా ఎన్టీఆర్, రామ్‌చరణ్‌
X

ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డుల్లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ దుమ్ము రేపింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు విభాగాలతో పాటు మరిన్ని విభాగాల్లోనూ అవార్డులు సొంతం చేసుకుంది. ఈసారి ఉత్తమ నటుడు విభాగంలో ఇద్దరికి అవార్డు షేర్‌ చేశారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలో తమ నటనతో ఆకట్టుకున్న ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ ఇద్దరినీ ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఉత్తమ దర్శకుడిగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికి గాను రాజమౌళి అవార్డుకు ఎంపికయ్యారు. ఉత్తమ నటిగా మృణాల్‌ ఠాకూర్‌ (సీతారామం) ఎంపికైంది.

2023 సంవత్సరానికి సంబంధించిన 68వ ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డ్స్‌ సౌత్‌ ఈ అవార్డులను ప్రకటించింది. ఇక ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం మరో నాలుగు అవార్డులు దక్కించుకుంది. వాటిలో ఉత్తమ మ్యూజిక్‌ ఆల్బమ్‌ విభాగంలో ఎం.ఎం.కీరవాణి, ఉత్తమ నేపథ్య గాయకుడు విభాగంలో కాలభైరవ (కొమురం భీముడో..), ఉత్తమ కొరియోగ్రఫీ విభాగంలో ప్రేమ్‌ రక్షిత్‌ (నాటు నాటు..), బెస్ట్‌ ప్రొడక్షన్‌ డిజైన్‌ విభాగంలో సాబు శిరిల్‌ అవార్డులకు ఎంపికవడం గమనార్హం.

క్రిటిక్స్‌ ఛాయిస్‌.. సీతారామం, దుల్కర్‌ సల్మాన్‌

ఇక క్రిటిక్స్‌ ఎంపికలో ఉత్తమ చిత్రంగా ‘సీతారామం’ ఎంపికవడం విశేషం. అలాగే ఉత్తమ నటుడుగా దుల్కర్‌ సల్మాన్‌ ఎంపికయ్యాడు. ఇక ఉత్తమ నటిగా సాయి పల్లవి (విరాట పర్వం) ఎంపికైంది. ఇక మరిన్ని విభాగాలను పరిశీలిస్తే.. ఉత్తమ సహాయ నటుడు రానా దగ్గుబాటి (భీమ్లా నాయక్‌), ఉత్తమ సహాయ నటిగా నందితాదాస్‌ (విరాట పర్వం), ఉత్తమ సాహిత్యం విభాగంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి (సీతారామం) అవార్డులు సాధించారు. ఇక ఉత్తమ నేపథ్య గాయనిగా చిన్మయి శ్రీపాద ‘సీతారామం’ చిత్రంలోని ‘ఓ ప్రేమ..’ పాటకు గాను ఎంపికైంది.

First Published:  12 July 2024 8:31 AM GMT
Next Story