Telugu Global
Health & Life Style

చలికాలం కీళ్ల నొప్పులకు సింపుల్ వర్కవుట్స్!

సాధారణంగా చలికాలంలో కీళ్ల నొప్పులు ఎక్కువవుతుంటాయి. చలికి నరాలు బిగుసుకుపోవడం, కీళ్ల మధ్య ఉండే బారోమెట్రిక్ ప్రెజర్ తగ్గడం వంటి కారణాల వల్ల నొప్పులు పెరుగుతుంటాయి.

Health Tips: చలికాలం కీళ్ల నొప్పులకు సింపుల్ వర్కవుట్స్!
X

సాధారణంగా చలికాలంలో కీళ్ల నొప్పులు ఎక్కువవుతుంటాయి. చలికి నరాలు బిగుసుకుపోవడం, కీళ్ల మధ్య ఉండే బారోమెట్రిక్ ప్రెజర్ తగ్గడం వంటి కారణాల వల్ల నొప్పులు పెరుగుతుంటాయి. మరి వీటికి చెక్ పెట్టేదెలా?

వింటర్‌‌లో మోకాళ్ల నొప్పులకు పెయిన్ కిల్లర్స్ వాడడం అంత మంచిది కాదు. దానికి బదులు కొన్ని సింపుల్ ఎక్సర్‌‌సైజులతో కీళ్లను రిలాక్స్ చేయొచ్చు. కీళ్లనొప్పులు ఉన్నవాళ్లు చలికాలం ఎలాంటి వర్కవుట్స్ చేయాలంటే..

ఈ సీజన్‌లో చలికి కండరాలు, నరాలు బిగుసుకుపోతుంటాయి. కాబట్టి వ్యాయామం మొదలుపెట్టడానికి ముందు గోరువెచ్చని నీటిలో ముంచిన బట్టతో మోకాలు లేదా నొప్పి ఉన్న కీళ్లపై సున్నితంగా మర్ధనం చేయాలి. ఇలా చేయడం వల్ల కీళ్ళకు రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ఆ తర్వాత ఈ వ్యాయామాలు ట్రై చేయొచ్చు.

క్వాడ్ సెట్స్

ముందుగా కాళ్లు చాపి నేలపై కూర్చోవాలి. తర్వాత మోకాలి అడుగుభాగంలో ఒక మెత్తటి దిండు లేదా టవల్‌ను ఉంచాలి. ఆ తర్వాత మోకాలిని కిందికి ప్రెస్ చేస్తూ.. కాలి వేళ్ళను వెనుక్కి వంచడానికి ప్రయత్నించాలి. ఇలా పదినిమిషాల పాటు చేయొచ్చు. మోకాళ్లపై ఒత్తిడి లేకుండా తేలికగా చేయాలి.

లెగ్ రైజ్

నేలపై వెల్లకిలా పడుకుని కుడికాలిని నిటారుగా ఉంచి నెమ్మదిగా కొన్ని అంగుళాల ఎత్తు వరకు పైకి లేపాలి. అలా కాలిని నేలకు కొన్ని అంగుళాల ఎత్తులో ఉంచి ఐదు వరకు లెక్క పెట్టాలి. తరువాత నెమ్మదిగా కాలిని కిందకు దించాలి. తర్వాత ఎడమ కాలితో చేయాలి.

హ్యమ్‌స్ట్రింగ్ స్ట్రెచ్

నేలపై వెల్లకిలా పడుకుని ఒక కాలిని మెల్లగా పైకి లేపి, నెమ్మదిగా ఛాతివైపుకు తేవడానికి ప్రయత్నించాలి. చేతులతో తొడభాగాన్ని పట్టుకుని కాలిని మరింత వెనక్కి స్ట్రెచ్ చేయాలి. మోకాలు వంచకుండా కాలు నిటారుగా ఉండాలి. ఆ తర్వాత నెమ్మదిగా మోకాలిని బెండ్ చేస్తూ, కాలిని నేలపైకి తీసుకురావాలి. ఈ వ్యాయామాన్ని ఒక్కో కాలితో ఐదు సార్లు చేయొచ్చు.

డయాబెటిస్, ఒబెసిటీ సమస్యలున్నవాళ్లుకు ఈ సీజన్‌లో నొప్పులు ఎక్కువ అవుతుంటాయి.ఇలాంటి వాళ్లు ఇన్‌స్టంట్ రిలీఫ్ కోసం కోసం వేడినీటి కాపడం, మసాజ్ వంటివి చేసుకోవచ్చు. అలాగే ఇతర కీళ్ల సమస్యలు ఉన్నవాళ్లు డాక్టర్ సలహా మేరకు మందులు వాడాలి.

కీళ్ల వ్యాయామాలను పొద్దున లేదా సాయంత్రం వేళల్లో చేయాలి. వ్యాయామం పూర్తయ్యాక మోకాలికి విశ్రాంతి ఇవ్వాలి. వ్యాయామం చేయడంలో ఇబ్బందిగా అనిపిస్తే చేయడం ఆపేయాలి. రిస్క్ తీసుకోవద్దు. ఈ సీజన్‌లో కీళ్ల నొప్పులు మరింత ఎక్కువైతే ఫిజియోథెరపిస్ట్‌ను కలవడం మంచిది.

First Published:  1 Nov 2023 3:28 AM GMT
Next Story