Telugu Global
Health & Life Style

నొప్పి మాత్రలొద్దు.. ఇలా చేయండి చాలు

నొప్పిని తగ్గించే మందులను అతిగా వాడితే అవి లివర్, గుండె, మూత్రపిండాలు, రక్తప్రసరణ వ్యవస్థలపై చెడు ప్రభావాన్ని చూపే ప్రమాదం ఉంటుంది. అందుకే మాత్ర వేసుకోకుండానే నొప్పిని తగ్గించుకునే మార్గాలను సూచిస్తున్నారు వైద్య పరిశోధకులు.

నొప్పి మాత్రలొద్దు.. ఇలా చేయండి చాలు
X

పలురకాల నొప్పులకు పెయిన్ కిల్లర్లను తరచుగా వాడుతుంటారు చాలామంది. అయితే నొప్పిని తగ్గించే మందులను అతిగా వాడితే అవి లివర్, గుండె, మూత్రపిండాలు, రక్తప్రసరణ వ్యవస్థలపై చెడు ప్రభావాన్ని చూపే ప్రమాదం ఉంటుంది. అందుకే మాత్ర వేసుకోకుండానే నొప్పిని తగ్గించుకునే మార్గాలను సూచిస్తున్నారు వైద్య పరిశోధకులు. శరీరంలో ఒత్తిడి హార్మోన్లను తగ్గించి రోగనిరోధక వ్యవస్థకు అనారోగ్యాలపైన పోరాడే శక్తిని పెంచే అతి సులువైన అద్భుతమైన నొప్పిని తగ్గించే మార్గాలివే..

నోరూరించే రుచి... ఊహిస్తే చాలు

రుచికరమైన మాంసాహారాలు, చాక్ లేట్ల గురించి ఆలోచించినప్పుడు నెలసరి నొప్పులు, మైగ్రేన్ ఇంకా చాలా రకాల నొప్పుల నుండి ఉపశమనం కలిగినట్టుగా అధ్యయనాల్లో తేలింది. తమకు నచ్చిన రుచికరమైన ఆహారాన్ని ఊహించుకుంటూ ఐస్ వాటర్‌లో చేతులు ఉంచినవారిలో దాని తాలూకూ బాధ కొంతవరకు తగ్గటం పరిశోధకులు గుర్తించారు.

ధ్యానంతో నొప్పులు దూరం

ధ్యానం నొప్పులకు మందులా పనిచేస్తుంది. శ్వాస పైన ధ్యాస ఉంచి ధ్యానం చేసినప్పుడు నొప్పుల తీవ్రత 11 శాతం నుండి 70 శాతం వరకు తగ్గినట్టుగా 2011లో నిర్వహించిన ఓ అధ్యయనంలో కనుగొన్నారు. అలాగే కొంతమందికి కాళ్ల వద్ద వేడి తగిలేలా చేసి అసౌకర్యాన్నికలిగించి అధ్యయనం నిర్వహించగా వారిలో ధ్యానం 20 నుండి 93 శాతం వరకు ఆ అసౌకర్యాన్ని తగ్గించడం పరిశోధకులు గుర్తించారు. కేవలం 80 నిమిషాల ధ్యాన శిక్షణతోనే ఈ ఫలితం వచ్చింది.

దీర్ఘశ్వాసతో ఉపశమనం

పొట్ట నుండి దీర్ఘ శ్వాస తీసుకోవటం ద్వారా కూడా నొప్పినుండి ఉపశమనం పొందవచ్చు. నాభి భాగం వరకు శ్వాస తీసుకుని ఛాతీ వద్ద నుండి బయటకు వదలాలి. దీని వలన పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థ స్పందించి.. నొప్పి సంకేతాల వలన కలిగే ఉద్రేకానికి విరుగుడుగా ప్రశాంతమైన స్పందనని కలిగిస్తుంది. ప్రసవ సమయంలో వచ్చే నొప్పులకు విరుగుడుగా ఈ శ్వాస విధానాన్ని ఎప్పటి నుంచో ఉపయోగిస్తున్నారు.

మనసు మళ్లిస్తే మంచిది

నొప్పి ఉన్నప్పుడు మన మనసంతా దానిపైనే ఉంటుంది. మరో ఆలోచన ఉండదు. అయితే నొప్పి ఉన్న భాగం నుండి మన ధ్యాసని మళ్లించి శరీరంలోని ఇతర భాగాలను రిలాక్స్ చేయాలి. కండరాలను బిగించి సడలించే ప్రొగ్రెసివ్ రిలాక్సేషన్ వ్యాయామం చాలా బాగా పనిచేస్తుంది. అలాగే సినిమా చూడటం, పుస్తకం చదవటం, మంచి పాటలు వినటం లాంటివి చేయవచ్చు. నొప్పిపైనే ధ్యాస ఉంచితే అది మరింత తీవ్రమవుతుంది.


నొప్పిని తగ్గించే మంత్రం

ఏదైనా నచ్చిన మంత్రం, లేదా మాటని పదేపదే మననం చేయటం వలన శరీరంలోని అసౌకర్యం తగ్గుతుంది. ఇష్టదైవాన్ని ప్రార్థించడం కూడా మంచి ఫలితాన్నిస్తుంది. కేవలం 30 సెకన్ల పాటు మంత్రాన్ని జపించినా చక్కని ఫలితం ఉంటుందని బోస్టన్‌లోని మసాచుసెట్స్ జనరల్ ఆస్ప‌త్రిలోని బెన్సన్ హెన్రీ ఇన్ స్టిట్యూట్‌లో పెయిన్ సర్వీసెస్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఎల్లెన్ స్లాస్ బీ తెలిపారు. మంత్రాన్ని మననం చేయటం వలన సహజంగా నొప్పిని తగ్గించే హార్మోన్లు మన శరీరంలో విడుదల అవుతాయి.

అలా ఊహిస్తే... ఇలా తగ్గుతుంది

నొప్పి నుండి బయటపడేందుకు విజువలైజేషన్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. శరీరంలో విపరీతమైన నొప్పి ఉన్నపుడు దానిని ఎర్రని రంగులో ఉన్న ఒక ద్రవ్యరాశిగా భావించి దాని పరిమాణం తగ్గిపోతున్నట్టుగా లేదా దాని ఎరుపు రంగు తగ్గిపోయి గులాబి రంగులోకి మారుతున్నట్టుగా భావించాలి. అలాగే మనల్ని మనం బీచ్‌లో ఉన్నట్టుగా భావించుకుని మన నొప్పి సముద్రంలో కరిగిపోతున్నట్టుగా ఊహించవచ్చు. మనకు ఏది ఎక్కువ విశ్రాంతినిస్తుందో దానిని ఊహించుకోవటం మంచిది. విజువలైజేషన్ కీళ్ల నొప్పులున్నవారికి చక్కగా పనిచేస్తుంది.


మసాజ్‌తో మేలు

టెన్షన్ వలన వచ్చే తలనొప్పులు, కండరాల నొప్పులున్నవారికి మసాజ్ బాగా పనిచేస్తుంది. నొప్పి ఉన్న చోట ఒత్తిడి కలిగిస్తూ ఎవరికి వారు మసాజ్ చేసుకోవచ్చు. అయితే మసాజ్ చేస్తున్నపుడు నొప్పి పెరిగితే మాత్రం దానిని ఆపేయాలి.

పాజిటివ్ ఆలోచనలే... పిల్స్

సాధారణంగా నొప్పి ఉన్నప్పుడు నెగెటివ్ ఆలోచనలే ఎక్కువగా వస్తుంటాయి. కానీ ఇలాంటప్పుడు సానుకూలంగా ఆలోచించగలిగితే ఆ ఆలోచనలే నొప్పికి మందుల్లా పనిచేస్తాయి. ఎప్పుడూ ఏదో ఒక ఆపద వస్తుందేమో అనే భయాన్ని వదిలిపెట్టాలి. అలాగే తమని తాము తక్కువగా ఊహించుకుంటూ తామెందుకూ పనికిరామనే ఆలోచనలను మానుకుని తమని తాము శక్తిమంతులుగా భావించుకోవాలి. ఆలోచనా విధానం మారటం వలన బలహీనత, మగత తగ్గి... నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుందని ఓ అధ్యయనంలో తేలింది.

రాగాలు వినటం... భావాలు రాయటం..

ఈ రెండు అంశాలు శారీరక నొప్పుల నుండి మనకు ఉపశమనాన్ని కలిగిస్తాయి. కీళ్ల నొప్పులు, దీర్ఘకాలిక నొప్పులు ఉన్నవారు ఒక వారం పాటు రోజుకి ఒక గంట సంగీతాన్ని వినటం వలన వారిలో నొప్పి నిరాశ తగ్గి శక్తి పెరిగిందని అధ్యయనంలో తేలింది. మనసులో ఉన్న భావాలను కాగితంపైన పెట్టటం వలన కూడా నొప్పి తగ్గుతుందని మూడు లేదా నాలుగు రోజుల పాటు నిద్రకు పావుగంట ముందు అలా రాయటం వలన నొప్పి తగ్గి రోగనిరోధక శక్తి పెరిగిందని అధ్యయనంలో రుజువైంది.

సృజనాత్మకత... సంతోషం

ఒక గంట పాటు ఏదైనా కళా సాధనలో నిమగ్నమైతే శారీరక నొప్పులు తగ్గుతాయని అధ్యయనంలో తేలింది. ఒక గంట ఆర్ట్ థెరపీతో హెచ్‌ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల్లో, క్యాన్సర్ పేషంట్లలో శారీరక మానసిక బాధల నుండి ఉపశమనం లభించినట్టుగా పరిశోధకులు గుర్తించారు. అలాగే నవ్వు కూడా నొప్పినుండి ఉపశమనం ఇస్తుంది. కేవలం నవ్వటం వలన మన శరీరంలో నొప్పిని సహజంగా తగ్గించే ఎండార్ఫిన్లు విడుదల అవుతాయి. నవ్వుతో మన మానసిక స్థితి మెరుగై నొప్పిని భరించే శక్తి పెరుగుతుంది.

First Published:  22 Sep 2023 6:06 AM GMT
Next Story