Telugu Global
Health & Life Style

వేగస్ నరం బాగా పనిచేస్తే... ఎన్నో ఆరోగ్యలాభాలు

Vagus Nerve Stimulation: పారాసింపథటిక్ నరాల వ్యవస్థలో ఈ పనులు చేసే నరాల్లో వేగస్ నరాలు ముఖ్యమైనవి.

వేగస్ నరం బాగా పనిచేస్తే... ఎన్నో ఆరోగ్యలాభాలు
X

వేగస్ నరం బాగా పనిచేస్తే... ఎన్నో ఆరోగ్యలాభాలు

మన నరాల వ్యవస్థలలో పారాసింపథటిక్ నరాల వ్యవస్థ ఒకటి. ఏదైనా భయం, ఆందోళన కలిగించే విషయం విన్నపుడు మనకు గుండెదడ, చెమటలు పట్టటం, నోరు తడారిపోవటం లాంటివి జరుగుతుంటాయి కదా... అవి సింపథటిక్ నరాల వ్యవస్థ ప్రభావంతో జరిగితే... పారాసింపథటిక్ నరాల వ్యవస్థ గుండె కొట్టుకునే వేగాన్ని తగ్గించి, శరీరం తిరిగి సాధారణ స్థితికి వచ్చేందుకు దోహదం చేస్తుంది.

పారాసింపథటిక్ నరాల వ్యవస్థలో ఈ పనులు చేసే నరాల్లో వేగస్ నరాలు ముఖ్యమైనవి. ఇవి రెండు నరాలయినా ఒకటే నరంగా పిలుస్తుంటారు. మెదడులోని మెడుల్లా ఆబ్లాంగేటాకు కుడి ఎడమ భాగాల్లో రెండు వేగస్ నరాలు మొదలై పొట్టవరకు ఉంటాయి.

గుండెకొట్టుకునే వేగం, జీర్ణక్రియలు, రోగనిరోధక వ్యవస్థ మొదలైనవి వేగస్ నరాల నియంత్రణలోనే ఉంటాయి. అయితే వేగస్ నరాలు చేసే పనులను మనం స్వయంగా నియంత్రించుకోలేము. మన శరీర అంతర్గత అవయవాల పనితీరులో భాగంగా వచ్చే దగ్గు, తుమ్ములు, వాంతులు వంటివి కూడా ఈ వేగస్ నరాల నియంత్రణలోనే ఉంటాయి. వేగస్ నరాల పనితీరు బాగుంటేనే మన లోపలి అవయవాల పనితీరు బాగుంటుంది.

జీర్ణవ్యవస్థలో, రోగనిరోధక వ్యవస్థలో తేడాలు వచ్చినప్పుడు మనకు మనంగా వాటిని తగ్గించుకునే అవకాశం ఉండదు. వేగస్ నరాల పనితీరు బాగున్నపుడే అవి నిర్వహించే విధుల పరంగా మనం ఆరోగ్యం బాగుంటుంది. జీర్ణవ్యవస్థ, రోగనిరోధక వ్యవస్థల పనితీరు బాగుండాలన్నా, గుండె వేగం క్రమబద్దంగా ఉండాలన్నా వేగస్ నరాల పనితీరు బాగుండాలి. వేగస్ నరాల పనితీరు బాగుంటే మనలో ఒత్తిడి తగ్గుతుంది, ప్రశాంతంగా ఉండగలం. జీర్ణవ్యవస్థ, రోగనిరోధక వ్యవస్థ బాగా పనిచేస్తాయి.

వేగస్ నరాలను మెరుగుపరచే మార్గాలను ఇప్పుడు చూద్దాం...

చల్లనినీటి స్నానం చేయటం వలన వేగస్ నరాలు ఉత్తేజితం అవుతాయి. గోరు వెచ్చని నీటితో స్నానం చేసిన తరువాత ఎంత చల్లదనాన్ని భరించగలిగితే అంత చల్లని నీటితో స్నానం చేయాలి. 30 నుండి 60 సెకన్లపాటు ఇలా చేయాల్సి ఉంటుంది.

♦ ఏదైనా పాటని నిదానంగా లోలోపల పాడుకోవటం ద్వారా అంటే హమ్ చేయటం వలన కూడా వేగస్ నరాలు చురుగ్గా మారతాయి. పాటని హమ్ చేసినప్పుడు మన పెదవులు, గొంతు, ఛాతీల్లో స్థిరమైన కదలికలు వస్తుంటాయి. ఇలా శరీరంలో స్థిరంగా చలనాలు ఏర్పడేలా హమ్ చేయటం వలన మనలో ఒత్తిడి ఆందోళన తగ్గుతాయి. ఓంకారాన్ని ఉచ్ఛరించడం ద్వారా కూడా ఈ ప్రయోజనం పొందవచ్చు.

♦ ఉదయం, సాయంత్రం రెండుసార్లు గోరువెచ్చని నీటిని గొంతులో పోసుకుని పుక్కిలించినట్టుగా చేసి ఊసేయటం వలన కూడా వేగస్ నరాలు ప్రభావితం అవుతాయి. శరీరం ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉంటుంది. గార్గిల్ చేయటం వలన గొంతు నొప్పులు, అలర్జీలు, సైనస్ సమస్యలు వంటివి కూడా తగ్గుతాయి.

♦ తల మెడ భుజాల్లో నిదానంగా మర్దనా చేయటం ద్వారా కూడా వేగస్ నరాలను ఉత్తేజితం చేయవచ్చు. అయితే ఎక్కడ నొక్కితే మనకు హాయిగా ప్రశాంతంగా ఉంటుందో తెలుసుకుని మసాజ్ చేయాలి. అలా కాకుండా కఠినంగా మర్దనా చేస్తే పారాసింపథటిక్ కి బదులుగా సింపథటిక్ నరాల వ్యవస్థ ఉత్తేజితం అవుతుంది.

♦ సూర్యకాంతి శరీరంపై పడేలా చేయటం వలన కూడా వేగస్ నరాల పనితీరు మెరుగవుతుంది. సూర్యుని కిరణాలు శరీరం లోపలికి లోతుగా వెళ్లినప్పుడు మెలనోసైట్ అనే హార్మోను స్థాయి పెరిగి దాని వలన వేగస్ నరాలు ఉత్తేజితం అవుతాయి.

వేగస్ నరాన్ని బలోపేతం చేసే మరిన్ని అంశాలు...

♦ కుడిముక్కు ద్వారా గాలిని పీల్చుకుని ఎడమ ముక్కుద్వారా వదలటం, అదే విధంగా ఎడమ ముక్కుద్వారా పీల్చుకుని కుడివైపు నుండి వదలటం. అంటే అనులోమ విలోమ ప్రాణాయామం చేయటం.

♦ ముఖం, మెడ వెనుక భాగాల్లో ఐస్ ప్యాక్ ని అప్లయి చేయటం

♦ ప్రశాంతంగా ఉండటం, దీర్ఘంగా శ్వాస తీసుకోవటం

♦ ఇతరులను అభినందించడం, నవ్వటం, ఆహారం నెమ్మదిగా నమిలి తినటం, అందరూ బాగుండాలని కోరుకోవటం, పచ్చదనంలో సమయం గడపటం మొదలైనవి.

వేగస్ నరం బలంగా ఉంటే...

♦ జీవననాణ్యత పెరుగుతుంది.

♦ శరీరంలో నొప్పులు తగ్గుతాయి.

♦ నిద్రలో నాణ్యత పెరుగుతుంది.

♦ నిరాశ ఆందోళన తగ్గుతాయి.

♦ వాపు మంట లక్షణాలతో కూడిన ఇన్ ఫ్లమేషన్ తగ్గుతుంది.

♦ రుమటాయిట్ ఆర్థరైటిస్, తలనొప్పులు మైగ్రేన్, మూర్చలు తగ్గుతాయి.

♦ బరువు తగ్గుతారు, గుండె ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.

First Published:  29 May 2023 9:43 PM GMT
Next Story