Telugu Global
Health & Life Style

తలనొప్పుల్లో రకాలెన్నో!

తలనొప్పుల్లో సుమారు రెండొందలకు పైగా రకాలున్నాయట. ప్రతి దానికి వేర్వేరు కారణాలు, వేర్వేరు ట్రీట్‌మెంట్‌లు ఉంటాయి.

తలనొప్పుల్లో రకాలెన్నో!
X

తలనొప్పి అందరికీ కామన్‌గా వచ్చే సమస్య. ప్రతి ఒక్కరూ ఏదో ఒక టైంలో తలనొప్పితో ఇబ్బంది పడుతుంటారు. అయితే తలనొప్పి అనేది అన్నిసార్లు ఒకేలా ఉండదు. పైకి అన్నీ ఒకేలా అనిపించినా.. తలనొప్పుల్లో సుమారు రెండొందలకు పైగా రకాలున్నాయట. ప్రతి దానికి వేర్వేరు కారణాలు, వేర్వేరు ట్రీట్‌మెంట్‌లు ఉంటాయి. అందరిలో కామన్‌గా వచ్చే కొన్ని తలనొప్పులేంటంటే..

తలనొప్పుల్లో ప్రైమరీ, సెకండరీ అని రెండురకాలుంటాయి. సెకండరీ తలనొప్పులు బ్రెయిన్‌లో కొన్ని సమస్యలు తలెత్తడం వల్ల వస్తాయి. వీటికి లాంగ్ టర్మ్ ట్రీట్‌మెంట్ అవసరమవుతుంది. ఇక తరచుగా అందరికీ వచ్చేవన్నీ ప్రైమరీ తలనొప్పులు. వీటిలో చాలా రకాలున్నాయి. మెదడులోని రసాయనాలు బ్యాలెన్స్ తప్పడం వల్ల ఇవి వస్తుంటాయి.

మైగ్రేన్ తలనొప్పి

తలకు కుడి లేదా ఎడమ భాగాల్లో నొప్పి వస్తే అది మైగ్రేన్‌ నొప్పి. మైగ్రేన్ తలనొప్పి సమస్య చాలామందిలో ఉంటుంది. ముఖ్యంగా టీనేజ్‌ పిల్లల్లో ఎక్కువ. ఈ తలనొప్పి వచ్చిందంటే తొందరగా తగ్గదు. కొన్ని రోజుల పాటు అలానే ఉండిపోతుంది.ఈ నొప్పి తలకు ఒక వైపు మాత్రమే వస్తుంది. కొంతమందికి తలనొప్పితో పాటు వాంతులు, వికారం కూడా ఉంటాయి. యాంగ్జైటీ, ఒత్తిడి, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినడం, తగినంత నిద్రలేకపోవడం, ఆకలితో ఉండటం, వాతావరణంలో వచ్చే మార్పులు, ఆల్కహాల్‌, ఎండకు ఒకేసారి ఎక్స్‌పోజ్‌ కావడం లాంటి కారణాల వల్ల మైగ్రేన్ రావొచ్చు. దీనికి ట్రీట్‌మెంట్ తీసుకోవడం తప్పనిసరి.

క్లస్టర్ హెడేక్

ఒక కన్ను లేదా కనుగుడ్డు చుట్టూ నొప్పి వస్తే అది క్లస్టర్ తలనొప్పి. ఈ తలనొప్పి వచ్చినప్పుడు కన్ను ఎర్రబడి వాపు వస్తుంది. కంటి నుంచి నీరు కారటం, ముక్కు దిబ్బడ వంటి లక్షణాలు కూడా ఉంటాయి. ఈ నొప్పి పావు గంట నుంచి మూడు గంటల వరకు ఉంటుంది. ఒక్కోసారి ఇది రోజూ ఒకే టైంకి వస్తుంటుంది. అలా 8 నుంచి10 వారాల పాటు రావొచ్చు. ఒకసారి అలా వచ్చాక మళ్లీ ఏడాది పాటు రాదు. ఒకవేళ వస్తే.. మళ్లీ కొన్ని వారాల పాటు రోజూ ఒకే టైంకి వస్తూ ఉంటుంది. ఈ తలనొప్పికి ప్రత్యేకించి కారణాలేవీ ఉండవు. తలలో కొన్ని అబ్‌నార్మల్ కండిషన్స్ వల్ల ఇది వచ్చే అవకాశం ఉంటుంది. ఇది వస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ట్రీట్‌మెంట్ తీసుకోవాలి.

సైనస్ హెడేక్

సైనస్ అంటే ముక్కు పైభాగానికి నుదిటికి మధ్య ఉన్న భాగం. ముక్కు పైన, నుదిటి దగ్గర లేదా కళ్ల మధ్య నొప్పిగా ఉంటే దాన్ని సైనస్ తలనొప్పి కింద గుర్తించాలి. ఈ తలనొప్పి వచ్చినప్పుడు కళ్లు, బుగ్గలు నొప్పిపెడతాయి. కొంత మందిలో పంటి నొప్పి కూడా ఉంటుంది. అలాగే ఈ నొప్పి వచ్చినప్పుడు కొన్ని వాసనలు పీల్చడానికి ఇబ్బందిగా ఉంటుంది. ముక్కు దగ్గర ఏవైనా ఇన్ఫెక్షన్లు, ట్యూమర్, అలర్జీలు ఉంటే ఈ తలనొప్పి రావొచ్చు. దీనికి కచ్చితంగా ట్రీట్‌మెంట్ తీసుకోవాలి. మంచి నీళ్లు ఎక్కువగా తాగడం, ఆవిరి పట్టడం, ఎక్సర్‌‌సైజ్ చేయడం ద్వారా కొంతవరకూ నొప్పి నుంచి రిలాక్స్ అవ్వొచ్చు.

స్ట్రెస్ తలనొప్పి

శరీరం, మెదడు ఎక్కువగా పనిచేసినప్పుడు, అలసిపోయనప్పుడు, తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు ఈ రకమైన తలనొప్పి వస్తుంది. ఈ నొప్పి ఐదు నిమిషాల వరకు ఉంటుంది. కొంతమందిలో మూడు రోజుల వరకు కూడా ఉండొచ్చు. ఎక్కువగా వ్యాయామం చేయడం, ఎక్కువ బరువులు ఎత్తడం ఈ రకమైన తలనొప్పికి కారణాలు. ఈ నొప్పి ఎక్కువగా నుదిటి దగ్గర లేదా చెవి మధ్యలో లోపలికి వస్తుంది. ఇలాంటి నొప్పి వచ్చినప్పుడు శరీరానికి, మెదడుకు వీలైనంత రెస్ట్ ఇవ్వాలి. నమిలి తినే ఆహారాలకు బదులు లిక్విడ్ ఫుడ్స్ తీసుకోవడం మంచిది. అలాగే ఇంట్లో డిమ్ లైటింగ్ ఉండేలా చూసుకోవాలి. ఈ నొప్పి వచ్చినప్పుడు నీళ్లు ఎక్కువగా తాగాలి. అప్పటికీ తగ్గకపోతే డాక్టర్‌‌ను సంప్రదించాలి.

వీటితోపాటు ఎక్కువగా దగ్గడం లేదా ఎక్కువసేపు నవ్వడం వల్ల వచ్చే తలనొప్పిని కాఫ్ హెడేక్ అంటారు. ఇది వచ్చినప్పుడు నీళ్లు ఎక్కువగా తాగాలి. ఆవిరి పట్టినా ఉపశమనం ఉంటుంది. పెద్దపెద్ద శబ్దాలు విన్నప్పుడు కూడా తలనొప్పి వస్తుంది. దీన్ని థండర్ క్లాప్ హెడేక్ అంటారు. ఈ నొప్పి వచ్చినప్పుడు నీళ్లు తాగి, రెస్ట్ తీసుకోవాలి. అవసరమైతే డాక్టర్‌‌ను కలవాలి.

First Published:  21 Nov 2023 11:15 AM GMT
Next Story