Telugu Global
Health & Life Style

చన్నీటి స్నానంతో... షుగర్ తగ్గుతుందా?

చన్నీటి స్నానంతో మధుమేహ నియంత్రణే కాకుండా గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని డాక్టర్ క్రిస్ వెల్లడించారు.

చన్నీటి స్నానంతో... షుగర్ తగ్గుతుందా?
X

చల్లని నీళ్లతో స్నానం చేయటం వలన మన శరీరంలోని కొవ్వు కరుగుతుందని, మధుమేహం వచ్చే రిస్క్ తగ్గుతుందని ఓ నూతన అధ్యయనంలో తేలింది. ఓ అంతర్జాతీయ ఆరోగ్య పత్రికలో ఈ వివరాలు ప్రచురించారు. చల్లని నీళ్లతో స్నానం చేయటం వలన మన శరీరంలో ఎడిపోనెక్టిన్ అనే హార్మోను ఎక్కువగా విడుదల అవుతుంది. ఇది ఇన్సులిన్ నిరోధకతని నివారిస్తుంది. మన శరీరంలో కండరాలు, కొవ్వు, లివర్ ఇన్సులిన్ కి సరిగ్గా స్పందించకపోవటం వలన కలిగే స్థితి ఇన్సులిన్ నిరోధకత. ఇది మధుమేహానికి దారి తీస్తుంది. ఇన్సులిన్ నిరోధకతని నివారించే హార్మోన్ ని ఎక్కువగా విడుదల చేయటం ద్వారా చన్నీటి స్నానం మధుమేహాన్ని రాకుండా అడ్డుకుంటుంది. అయితే చన్నీటి స్నానం వలన మరికొన్ని లాభాలున్నాయని ఇంతకుముందే కొన్ని పరిశోధల్లో తేలింది. అవి

రోగనిరోధక శక్తిలో అభివృద్ధి

♦ మానసిక స్థితి బాగుంటుంది.

♦ శరీరంలో ప్రసరణ వ్యవస్థ చక్కగా పనిచేస్తుంది.

♦ కేలరీలు ఎక్కువగా ఖర్చవుతాయి.

♦ డిప్రెషెన్ తగ్గుతుంది

♦ శరీరంలో జీవక్రియలు వేగం పుంజుకుంటాయి.

♦ గుండె ఆరోగ్యం బాగుంటుంది.

♦ శరీరంలో నొప్పి, వాపు గుణాలు తగ్గుతాయి.

చన్నీటి స్నానంతో ఈ లాభాలన్నీ పొందే అవకాశాలు ఎక్కువే ఉన్నట్టుగా తమ పరిశోధనలు చెబుతున్నాయని ది ఆర్కిటిక్ యూనివర్శిటీ ఆఫ్ నార్వేలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్ జేమ్స్ మెర్సర్ అంటున్నారు.

చన్నీటి స్నానం వలన మన శరీరంలో ఏం జరుగుతుంది... అనే విషయంలో పూర్తి స్థాయి సమాచారం తమకు తెలియనప్పటికీ చల్లని నీటితో స్నానానికి, మధుమేహం నియంత్రణకు మధ్య సంబంధం ఉన్నదనే విషయంలో మాత్రం చాలా బలమైన ఆధారాలు లభించాయని అమెరికన్ ఫిజియొలాజికల్ సొసైటీలో సభ్యులైన డాక్టర్ క్రిస్ మిన్సన్ తెలిపారు. చన్నీటి స్నానంతో మధుమేహ నియంత్రణే కాకుండా గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని డాక్టర్ క్రిస్ వెల్లడించారు. చన్నీటి స్నానంతో మన శరీరం వ్యాయామం చేసినట్టుగానే స్పందిస్తుందని అందుకే అలాంటి ప్రయోజనం కలిగే అవకాశం ఉందని పరిశోధకులు విశ్లేషిస్తున్నారు.

అయితే బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే... అలవాటు లేనివారు చన్నీటి స్నానాన్ని హఠాత్తుగా మొదలుపెట్టకూడదు. చన్నీళ్లతో స్నానం చేసినప్పుడు ఎలాంటి ప్రభావం ఉండవచ్చు... అనే విషయంలో కచ్చితంగా అవగాహన ఉండాలి. చన్నీటి స్నానం అంత తేలిక కాదని డాక్టర్ క్రిస్ కూడా చెబుతున్నారు. మొదట తల మెడలను చన్నీళ్ల కింద ఉంచి తరువాత శరీరం వీలయినంత వరకు చన్నీళ్లలో మునిగేలా చేయాలని... ఆ వెంటనే కాస్త వేడినీళ్లను శరీరంపై పోసుకుంటూ అలవాటు చేసుకోవాలని సలహా ఇస్తున్నారు క్రిస్. ప్రతివారం కొంత సమయం పెంచుకుంటూ పోవాలని, అలాగే స్నానం తరువాత శరీరంలో ఎలాంటి అనుభూతి కలుగుతుందో గమనించాలని కూడా క్రిస్ మిన్సన్ చెప్పారు. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా, ముఖ్యంగా గుండెజబ్బులు, గుండెపోటుకి గురయి ఉంటే తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవాలి.

ఆరోగ్యంగా చురుగ్గా ఉన్నవారు చన్నీటి స్నానాన్ని ఒక కొత్త వ్యాయామం లాగే మొదలు పెట్టవచ్చని డాక్టర్ క్రిస్ సూచిస్తున్నారు. అయితే దీనివలన వస్తున్న ఫలితాలు, ప్రభావాలను అంచనా వేస్తూ నిదానంగా స్నానం సమయాన్ని పెంచుకుంటూ పోవాలనే నిపుణుల సూచనని మర్చిపోకూడదు.

First Published:  26 Sep 2022 7:21 AM GMT
Next Story