Telugu Global
Health & Life Style

ఇలా పడుకుంటే నొప్పులు ఉండవు!

నొప్పులకు స్లీపింగ్ పొజిషన్‌కు చాలా దగ్గర సంబంధం ఉంది. కేవలం పడుకునే విధానాన్ని మార్చుకోవడం ద్వారా సాధారణంగా వచ్చే భుజం, మెడ, వెన్ను నొప్పులను తగ్గించుకోవచ్చు.

ఇలా పడుకుంటే నొప్పులు ఉండవు!
X

సాధారణంగా నిద్ర పోయేటప్పుడు శరీరం ఒకే తీరులో ఎక్కువసేపు ఉంటుంది. బాడీ పొజిషన్ సరైన విధంగా లేకపోతే అది రకరకాల నొప్పులకు దారితీయొచ్చు. పడుకునే తీరు సరిగ్గా లేకపోవడం వల్లే చాలామందికి వెన్ను నొప్పి, మెడ నొప్పి, భుజం నొప్పి వంటివి వస్తు్న్నాయని డాక్టర్లు చెప్తున్నారు. అందుకే ఇలాంటి నొప్పుల నుంచి బయటపడాలంటే పడుకునే విధానాన్ని మార్చుకోవాలి.

నొప్పులకు స్లీపింగ్ పొజిషన్‌కు చాలా దగ్గర సంబంధం ఉంది. కేవలం పడుకునే విధానాన్ని మార్చుకోవడం ద్వారా సాధారణంగా వచ్చే భుజం, మెడ, వెన్ను నొప్పులను తగ్గించుకోవచ్చు. నొప్పిని బట్టి స్లీపింగ్ పొజిషన్ ఎలా మార్చుకోవాలంటే..

వెన్ను నొప్పి..

మనదేశంలో నడుము నొప్పితో బాధపడేవాళ్ల సంఖ్య చాలా ఎక్కువ. సాధారణంగా వెన్నెముక కింది భాగానికి ఎలాంటి అదనపు ఎముకల సపోర్ట్ ఉండదు. అప్పర్ బాడీ బరువు మొత్తాన్ని వెన్నెముక కింది భాగంలో ఉండే డిస్క్‌లే మోస్తుంటాయి. అందుకే ఆ ప్రాంతంలో కాస్త ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. ఈ కారణం చేతనే నడుమునొప్పి సమస్యలు చాలా కామన్‌గా వస్తుంటాయి.

నడుము నొప్పి ఉన్నవాళ్లు ఫ్లాట్‌గా ఉండే మంచంపై పడుకోవాలి. నవారు మంచం, కిందికి వంగిపోయే పరుపుల వంటివి వాడకూడదు. చదునుగా ఉండే మంచంపై వెల్లకిలా పడుకుంటే మంచిది. లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్లు నడుము కింద మెత్తపాటి దిండుని పెట్టుకుంటే మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. అలాగే పగటిపూట ఎక్కువ సేపు కూర్చొని ఉండకుండా చూసుకుంటే నొప్పి పెరగకుండా ఉంటుంది.

భుజం నొప్పి

తల కింద చేయిపెట్టుకొని పడుకునే అలవాటు ఉన్నవాళ్లకు భుజం నొప్పి ఎక్కువగా వస్తుంటుంది. అందుకే భుజం నొప్పి తగ్గాలంటే పక్కకు తిరిగి తలకు సమాంతరంగా ఉండే దిండు పెట్టుకుని పడుకోవాలి. వెల్లకిలా పడుకొని రెండు చేతులను రిలాక్స్‌డ్‌గా వదిలేసినా మంచిదే.

మెడనొప్పి

రాంగ్ పొజిషన్‌లో పడుకోవడం వల్ల చాలామందికి మెడ పట్టేస్తుంటుంది. ఇలాంటి వాళ్లు దిండు లేకుండా వెల్లకిలా పడుకుంటే మంచిది. పక్కకి తిరిగి పడుకోవాలనుకొంటే.. తలకు సమాంతరంగా ఉండే మెత్తటి దిండు వాడుకోవచ్చు.

నెలసరి నొప్పి

చాలామంది ఆడవాళ్లకునెలసరి సమయంలో పొత్తికడుపులో నొప్పి వస్తుంటుంది. ఇలాంటివాళ్లు వెల్లకిలా పడుకొని మోకాళ్ల కింద దిండు పెట్టుకుంటే పొట్టపై ఒత్తిడి పడకుండా ఉంటుంది.

వివిధ నొప్పులతో బాధపడేవాళ్లు నొప్పి రకాన్ని బట్టి డాక్టర్ సలహా మేరకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. నొప్పుల నుంచి కాస్త రిలీఫ్ పొందడానికి మాత్రమే స్లీపింగ్ పొజిషన్స్ హెల్ప్ చేస్తాయని గుర్తుంచుకోవాలి.

First Published:  21 Dec 2023 12:30 PM GMT
Next Story